ఆహారం, నిద్ర ఎలా ఉండాలి?

నాత్యశ్నతస్తు యోగో స్తి నచైకాన్తమనశ్నతః న చాతిస్వప్నశీలస్య జాగ్రతోనైవచార్జునః॥

ఎక్కువగా అంటే కడుపునిండా తిన్నవాడికీ, లేక అసలు తినకుండా ఉపవాసం పేరుతో కడుపు మాడ్చుకునేవాడికి, జాగారం పేరుతో నిద్రమేలుకొనే వాడికి, తినగానే గుర్రు పెట్టి నిత్రపోయేవాడికి ఈ ధ్యానయోగం చేయడం కుదరదు.

ఈ ధ్యాన యోగం అవలంబించే వాళ్లు ఎప్పుడెప్పుడు భోజనం చేయాలి అనే విషయం ఇక్కడ చెప్పాడు భగవానుడు. ఈ శ్లోకంలో యోగోస్తి అన్నాడు కాబట్టి యోగము అభ్యసించేవారికి అని అర్థం. ఏ యోగమును అభ్యసించినా, ఈ ఆహార నియమాలు పాటించాలి. ప్రతి మనిషి మూడు పనులతోనే తన పూర్తి జీవితం గడిపేస్తున్నాడు. అవి ఆహారము, నిద్ర, మైధునాలు. (మైథునము అంటే స్త్రీపురుషులు కలిస్తేకలిగే సుఖం). మొదటి రెండు తనకు తానుగా అనుభవించేవి. మూడవది రెండవ మనిషి సహకారంతో చేసేది. ఈ మూడు పనులు మానవులు చేస్తున్నారు. జంతువులు చేస్తున్నాయి. కాకపోతే జంతువులు ఒక నియమం ప్రకారం చేస్తున్నాయి. మానవులు ఏ నియమమూ పాటించకుండా ఆహార, నిద్ర మైథునాలు అపరిమితంగా అనుభవిస్తున్నారు.

(వేళాపాళలేకుండా, అర్థరాత్రి దాకా తాగుతున్నాడు. తింటున్నాడు. నిద్రపోవాల్సిన సమయంలో మేల్కొని, పగలంతా నిద్రపోతున్నాడు. ఆఫీసులో నిద్రపోవడం ఇదే. ఇంక మైథునం సంగతి అందరికీ తెలిసిందే! ఒక నియమం లేదు. ఒక సమయం లేదు. అందుకే నిర్భయ చట్టం చేయాల్సి వచ్చింది.)

ఆహారము, నిద్రగురించి చెబుతూ న అతి అశ్నతస్తు అంటే ఎక్కువగా మితిమీరి తినకూడదు. అంటే మితంగా తినాలి. కడుపు నిండా భోజనం చేసి ధ్యానమునకు కూర్చోకూడదు అనికూడా అర్థం. గొంతుదాకా మెక్కిన తిండి లోపల ఊరుకోదు కదా. దాని పని అది చేస్తుంది. కడుపులో గడబిడ. వికారము, లేక త్రేపులు, ఇలాగా, వీటితో సతమతమౌతుంటే ఇంక ధ్యానం ఏం కుదురుతుంది. కాబటి అధికంగా తినకూడదు. ధ్యానానికే కాదు ఆరోగ్యరీత్యా కూడా మితంగా తినాలి. మితాహారము తింటే శరీరం తేలికగా ఉంటుంది. అదేవిధంగా న చ ఏకాన్తమ్ అనశ్నతః అంటే అసలు ఆహారం తీసుకోకపోవడం కూడా మంచిది కాదు. అంటే కటిక ఉపవాసం ఉన్నాకూడా శరీరంలో శక్తి ఉండదు, ధ్యానం కుదరదు. చాలామంది ఇదేం ఉపవాసం పండ్లు తింటారు, పాలు తాగుతారు అని హేళన చేస్తారు. కానీ అదే ఉత్తమం మనిషి ఆరోగ్యానికి.  శరీరములోని అవయవములు అన్నీ సక్రమంగా పని చేయడానికి మితాహారము అవసరము. ఆహారం లేకపోతే అవయవములు క్షీణించిపోతాయి. ఆహారము, మితంగా ఉంటేనే మంచిది.

ఇక్కడ మనం ఒక ఆహార సూత్రం గురించి చెప్పుకుందాము. ఆహారం ఎలా తినాలి. అంటే, మనం కడపును నాలుగు భాగాలుగా, ఊహామాత్రంగా విభజించుకోవాలి. అందులో రెండు భాగాలను ఆహారంతో నింపాలి. ఒక భాగం నీటితో నింపాలి. నాలుగవ భాగం ఖాళీగా ఉంచాలి. ఎందుకంటే మనం తిన్న ఆహారం, నీరు కలిసి జీర్ణం కావడానికి కాస్త స్థలం కావాలి కదా. అందుకని నాలుగవ వంతు ఖాళీగా ఉంచాలి. అంతే కానీ, ఇష్టమైన పదార్థాలు ఉన్నాయి. కదా అని గొంతుదాకా దట్టించకూడదు. కాబట్టి ఎక్కువ ఆహారం తినడం కానీ అసలు తినకపోవడం కాని ధ్యానయోగమునకు మంచిది కాదు.

ఇంక నిద్ర విషయానికి వస్తే అతి నిద్ర అసలే మంచిది కాదు. సోమరితనమును కలుగజేస్తుంది. సాధకుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండాలి. పగలంతా పని చేసిన తరువాత శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వాలి అది అవసరం. (కానీ అదేపనిగా ఉదయం తొమ్మిది గంటలదాకా ముసుగుతన్ని పడుకోవడం సోమరితనం కలుగచేస్తుంది. చురుకుదనం దూరం చేస్తుంది.) ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. అతిగా తింటే నిద్రవచ్చే ప్రమాదం ఉంది. కళ్లు మూసుకోగానే నిద్రలోకి జారుకుంటే ఇంక ధ్యానం ఏం చేస్తాడు. న చ అతి స్వప్నశీలస్య అన్నాడు. అంటే అతిగా నిద్రపోయేవాడు, ఆ నిద్రలో కలలు కనేవాడు. వీడికి కళ్లుమూసుకోగానే నిద్రలోకి జారుకొని ఆ నిద్రలో పిచ్చి పిచ్చి కలలు కంటుంటే ఇంక ధ్యానము ఏం నిలుస్తుంది. కలలలో తేలియాడుతుంటాడు. అలాగని అస్సలు నిద్రపోకుండా ఉంటే కూడా కళ్లు మూసుకోగానే నిద్ర ఆవహిస్తుంది. అంటే పుణ్యం వస్తుందని అతిగా జాగారం చేయడం కూడా పనికి రాదు. కాబట్టి ధ్యానం చేయడానికి గానీ, ఏయోగమును అవలంబించడానికి కానీ, మితాహారము, మితమైన నిద్ర అవసరము. ఏదీ అతిగా ఉండకూడదు.

ఈ శ్లోకంలో అంతర్లీనంగా చెప్పబడిన ఒక విషయం మనం గమనించాలి. అతి సర్వత్ర వర్జయేత్ అంటే ఏదీ అతిగా ఉండకూడదు. మితంగా ఉండాలి. మానవుల మూడో లక్షణమైన మైథునానికి కూడా దీన్ని అస్వయించుకోవచ్చు. ఆమాటకొస్తే ప్రతి విషయానికీ ఈ సూత్రం వర్తిస్తుంది. 

◆ వెంకటేష్ పువ్వాడ


More Aacharalu