భక్తులలో రకాలు... వారి స్వభావాలు!

చతుర్విధా భజన్తో మాం జనాస్సుకృతినోఒర్జునః ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభః॥

అర్జునా! ఈ లోకంలో ఉన్న సుకృత్తులు (పుణ్యాత్ములు) అయిన మానవులు నన్ను నాలుగు విధాలుగా భజిస్తున్నారు. వారు ఆర్తులు, జిజ్ఞాసువులు, కోరికలు కోరుకునేవారు, జ్ఞానులు.

దుషృ తులు, మూఢులు, నరాధములు, అసురులు ఏ కాలంలో కూడా భగవంతుని తలచుకోరు, ఒక వేళ తలచుకున్నా వారి భక్తి అంతా తమ స్వార్థంగురించి తప్ప లోక కల్యాణం గురించి కాదు. ఇకపోతే  పుణ్యాత్ములు అయిన వారు పరమాత్మను ప్రార్థించే వారు నాలుగు రకాలుగా విభజింపబడ్డారు.

1. ఆర్తులు 2, జిజ్ఞాసువు, 3. అర్ధార్థి, 4. జ్ఞాని, వీరంతా సుకృతులు, మంచి పనులు చేసేవాళ్లు. వీరి మార్గములలో భేదము ఉన్నప్పటికినీ వీరంతా భగవంతుని ప్రార్ధిస్తున్నారు. 

మొదటి వాడు ఆర్తుడు.

ఎవరికైనా ఏదైనా ఆపద సంభవిస్తే రోగం వస్తే, ఉన్న డబ్బు పోతే, ఎవరి నుండి అయినా ఆపద వస్తుంది అని తెలిస్తే, అప్పుడు భగవంతుడు గుర్తుకు వస్తాడు. అప్పుడు మొక్కులు మొక్కుతారు. పూజలు వ్రతాలు చేస్తామంటారు ముడుపులు కడతారు. ఈ ఆపద తీరితే నీ వద్దకు వచ్చి మొక్కు తీర్చుకుంటాము అని మొక్కుకుంటారు. ఇంకొంత మంది ఇటువంటి వారికి భగవంతుడు ఆపదలలోనే గుర్తుకు వస్తాడు. పరమాత్మతో బేరం పెడతారు. నాకు ఈ లాభం కలిగితే, ఈ రోగం తగ్గితే, ఈసుఖం కలిగితే నీకు తలనీలాలు ఇస్తాను. నివేదనలు పెడతాను, ఇలాగా. వీరికి ఆపదలు తీరినా కూడా, వేల్పుల మొక్కులు వేయేళ్లు అంటూ దాట వేస్తారు. ఇటు వంటి వారిని ఆర్తులు అని అంటారు. వీరూ భక్తులే కానీ అవకాశ భక్తులు.

రెండవ వాడు అర్ధార్ధి 

అర్థార్థి అంటే తనకు ధనం రావాలని, సంపదలు రావాలని, తాను కోటీశ్వరుడు కావాలనీ, అందరి ధనం తనకే చెందాలని, దేవుని నిరంతరము ప్రార్థిస్తుంటాడు. తనకు వచ్చిన లాభాలలో దేవుడికి వాటా కూడా ఇస్తానని బేరం పెడతాడు. వజ్రకిరీటాలు, బంగారు తొడుపులు చేయిస్తాను అంటాడు, శాలువాలు కప్పుతాను అంటాడు. ఇటువంటి వారు కేవలము ప్రాపంచిక విషయములు, వస్తువులు వీటి గురించి మాత్రమే ఆలోచిస్తూ వాటి కొరకు దేవుని కొలుస్తాడు.

ఈ రెండు రకాల భక్తులు సకామ భక్తులు, కోరికల కోసం పరమాత్మను భజించేవారు. మొదటిరకం భక్తులు తమకు ఉన్న కష్టాలు, దుఃఖాలు, రోగాలు పోవాలని పరమాత్మను కోరుకుంటే, రెండవ రకం భక్తులు తమకు లేని ఐశ్వర్యం, సంపదలు, పదవులు రావాలని కోరుకుంటారు.

మూడవ వాడు జిజ్ఞాసువు. 

ఇతడు భగవంతుని గురించి ఆయన తత్వము గురించి తెలుసుకోడానికి నిత్యం ప్రయత్నం చేస్తుంటాడు. ఇటువంటి వారు చాలా అరుదుగా కనిపిస్తారు. మానవులలో 90 మందికి బయట ప్రపంచంలో కనిపించే వస్తువుల మీద దృశ్యముల మీదా, ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కాని లోపల ఉన్న ఆత్మ మీద ఎటువంటి ఆసక్తి ఉండదు. ఈ శరీరమే నేను అనుకుంటూ ఉంటారు. ధన సంపాద. సుఖములు అనుభవించడం, పనికిమాలిన పనులు చేయడం, అనవసర విషయాలను చర్చించడం చేస్తుంటాడు. కాని జిజ్ఞాసువు మాత్రము నేను వేరు ఈ దేహము వేరు అనే భావనతో ఆత్మతత్వము తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రాపంచిక సుఖాల కోసం దేవుడిని భజించడు. ఎల్లప్పుడు తాను ఎవరు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు. పరమాత్మను ఎలా చేరుకోవాలి? ఇటువంటి ఆలోచనలతోనే ఉంటాడు. ఈ భావన పూర్వజన్మ వాసనల వలననే కలుగుతుంది. ఇటువంటి వారికి కోరికలు ఉండవు. కోరికలు తీరడానికి భగవంతుని ప్రార్ధించరు. భగవంతుని గురించి తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు.

నాలుగవ వాడు జ్ఞాని. 

ఇతని భక్తి ఉత్తమమైన భక్తి. ఇతడు వేదములు, శాస్త్రములు, పురాణములు బాగా చదువుతాడు. ఉపన్యాసాలు వింటాడు, జ్ఞానం సంపాదిస్తాడు. భగవంతుని తత్వము బాగా తెలిసిన వాడు. ఆత్మ శరీరము వీటి గురించి ఎల్లప్పుడూ ఆలోచించేవాడు.  ఆత్మయే నిత్యము సత్యము అని నమ్మేవాడు. ఈ శరీరము, ప్రాపంచిక వస్తువులు విషయ వాంఛలు శాశ్వతములు కావు అని నమ్మేవాడు. ఇతనికి ఎటువంటి కోరికలు ఉండవు. కోరికల కొరకు భగవంతుని ప్రార్థించడు. తనకు పరమాత్మకు భేదం లేదు అనే భావనతో ఉన్న వాడు. అందరినీ సమదృష్టితో చూచేవాడు. అందరిలో పరమాత్మను దర్శించేవాడు.

ఈ నాలుగు విధములైన భక్తులు ఏదో విధంగా భగవంతుని స్మరిస్తారు పూజిస్తారు ధ్యానిస్తారు. కొంచెం ఆలోచించి చూస్తే ఈ నాలుగురకములైన భక్తులు ప్రతివాడిలోనూ ఉన్నారు. మొదట తనకు ఉన్న కష్టములను, దుఃఖములను పోవాలని ప్రార్థిస్తారు. కష్టాలు పోగానే సుఖాలమీదికి మనసు మళ్లుతుంది. స్వామీ నాకు సుఖాలు, ధనం, సంసారం ప్రసాదించు అని ప్రార్థిస్తారు. అవి లభిస్తాయి. కొంత కాలానికి ఆ సుఖం ముఖం మొత్తుతుంది. ఈ ప్రాపంచికసుఖాలు శాశ్వతములు కావు అని భావించి, శాశ్వతసుఖం పొందడానికి ప్రయత్నం చేస్తాడు. తుదకు అందరిలో పరమాత్మను, పరమాత్మలో అందరిని చూచే స్థితికి చేరుకుంటాడు. మనసును ఆత్మలో లీనం చేసి ఆత్మానందాన్ని, పరమ శాంతిని పొందుతాడు.

◆వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu