ధ్యానం వల్ల కలిగే లాభం!

ధ్యానయోగం వలన ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, మనస్సు ఆత్మయందు నిలపడం. దాని వలన సుఖము శాంతి పొందడం జరుగుతుంది. అప్పుడు మనిషి మోక్షమార్గములో ప్రయాణం చేస్తాడు. దానికి మార్గాలు చిత్తము ఆత్మలో నిలిచి ఉండటం, సర్వకామేభ్యో నిస్పృహ అంటే సకల కోరికల యందు స్పృహ లేకుండా ఉండటం. అంటే ఒక రకంగా వైరాగ్యము కలిగి ఉండటం. ఇవి సాధిస్తే గానీ యోగసిద్ధిని పొందలేడు. కోరికలు అంటే ఏవో ఒకటి రెండు వదిలిపెట్టి నాకు వైరాగ్యం కలిగింది అంటే కుదరదు. సర్వకామేభ్యో అంటే సకలమైన కామములు అంటే కోరికలు. ఒక్కటి కూడా మిగల కూడదు. అంటే సంపూర్ణ వైరాగ్యము కలగాలి. కోరికలు మనసు నిండుగా ఉంటే మనసు చంచలంగా ఉంటుంది. అటు ఇటు పరుగెడుతుంటుంది. ధ్యానము కుదరదు. అసలు కోరికలే లేకపోతే మనసు నిర్మలంగా ఉంటుంది. ఏది దొరికితే ఇంక దొరకవలసినది ఏమీ ఉండదో అదే దొరుకుతుంది. అదే సుఖము, శాంతి. మానవులు ఏ కోరిక కోరినా దాని వలన లభించేది సుఖము, శాంతి. 


దీనికి కావాల్సింది.... సత్ అసత్ పదార్థములు.....వీటి మధ్య ఉన్న భేదమును తెలుసుకోగలిగే వివేకము. దాని వలన కలిగే వైరాగ్యము. ఇలా అన్ని కోరికలను మనసు లో నుండి తీసి వేస్తే జరిగే పరిణామము వినియతం చిత్తం అంటే చిత్తము మనం చెప్పినట్టు వింటుంది. అటు ఇటు పోదు. చంచలంగా ఉండదు. దీని వలన కలిగే పరిణామము ఆత్మన్యేవావతిష్ఠతే అంటే చిత్తము ఆత్మలో స్థిరంగా ఉంటుంది. అదే మోక్ష మార్గము. ఆనంద మార్గము. శాంతి మార్గము. దీనిని పొందడానికే ధ్యానయోగము ఉపయోగపడుతుంది. దీనికి చెప్పబడిన మార్గముల గురించి వివరంగా తెలుసుకుందాము.


మొదటి వినియతం చిత్తం. అంటే మనసును ప్రాపంచిక విషయముల నుండి వెనుకకు తీసుకురావాలి. శరీరం ఒకచోట ఉంటే మనసు మరొక చోట ఉంటుంది. దానినే అన్యమనస్కంగా ఉన్నాడు అని అంటారు. కాబట్టి మనం ఎక్కడ ఉన్నామో మనసు కూడా అక్కడే ఉండాలి. మనసు మన అధీనంలో ఉండాలి. మనం ఏపని చేస్తున్నామో మనసు కూడా దాని మీదనే ఉండాలి. అంటే మనసు ఎక్కడకో పోతుంది అని కాదు. మనసు మన దగ్గరే ఉంటుంది. కాని మనం చేసే పని గురించి కాకుండా వేరేదాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దానినే మనసు నిలకడలేకపోవడం అని అంటాము. అంటే మనసు మనం ఏ పని చేస్తున్నామో దాని గురించి తప్ప మరొక దాని గురించి ఆలోచించకూడదు. ఉదాహరణకు మనం ధ్యానానికి కూర్చున్నాము. మనసు కూడా ధ్యానం చేయడం మీదనే ఉండాలి కానీ వేరే చోట ఉండకూడదు. వేరు ఆలోచనలు ఉండకూడదు. ఎదురుగా మనం ఏ విగ్రహం ముందు కానీ, పటం ముందు కానీ కూర్చున్నామో ఆ దేవతా మూర్తి స్వరూపమే మనసులో నిలుపుకోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే మనం ధ్యానంచేసే ఆ పది నిమిషాలో, ఇరవై నిమిషాల సేపు, మన మనసులో దేవుని గురించి తప్ప వేరే ఆలోచనలు అంటే ప్రాపంచిక విషయముల సంబంధమైన, కుటుంబ సంబంధమైన, మనం చేసే వృత్తి సంబంధమైన ఆలోచనలు ఏవీ మనసులో ఉండకూడదు. దానినే మనోనిగ్రహం అంటారు.

ఈ మనోనిగ్రహం కలగాలంటే నిస్స్పృహస్సర్వకామేభ్యో అంటే ధ్యానం చేసే ఆ కాసేపు అన్ని రకములైన కోరికల పట్ల స్పృహ ఉండకూడదు. కోరికల గురించిన ఆలోచనలు ఉండకూడదు. అప్పుడు ఏంజరుగుతుంది అంటే ఆత్మన్యేవ అవతిష్ఠతే అంటే మన మనసు ఆత్మలో నిలకడగా నిలిచి ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది. మనసు అనేది ఒక వస్తువు కాదు. దానికి రూపం ఆకారం లేదు. అలాగే ఆత్మ అనేది ఒక ప్రదేశం కాదు. ఆత్మ సర్వవ్యాపి. అటుంటప్పుడు మనసును ఆత్మలో ఉంచడం ఎలా సాధ్యం అనే సందేహం రావచ్చు. ఆత్మ అంతటా ఉంది కాబట్టి, మనం మనసును ఏకోరికలు లేకుండా నిర్మలంగా ఉంచుకుంటే, అది ఆత్మలో స్థిరంగా ఉన్నట్టే లెక్క అంతేకానీ మనం మనసును ప్రత్యేకంగా ఆత్మలో ఉంచనవసరం లేదు.

ఈ ప్రకారంగా మనసును నిర్మలంగా, నిశ్చలంగా ఏ కోరికలూ లేకుండా ఉంచుకోవడమే ధ్యానము అని అనవచ్చు. ఈ ధ్యానమును ప్రతిరోజూ సాధన చేస్తే మొదట్లో కష్టం అనిపించినా, కొంత కాలానికి అది చాలా సులభం అవుతుంది.

 ◆వెంకటేష్ పువ్వాడ.


More Aacharalu