అలగ్జాండర్‌ని అడ్డుకున్న సాధువులు!
చరిత్రలోనే గొప్ప చక్రవర్తి ఎవరంటే వినిపించే మొదటి పేరు అలగ్జాండర్. అలాంటి చక్రవర్తిని ఒక ముసలి సాధువు ఆశ్చర్యపరచిన సంఘటన ఒకటి ఉంది. గ్రీకులు చరిత్రను నమోదు చేయడంలో చాలా శ్రద్ధని చూపేవారు. అందుకని మనం చదవబోయే సంఘటన ఎవరో ఊహించి ప్రచారం చేసింది కాదు. ఆయనతో పాటు మన దేశాన్ని సందర్శించిన గ్రీకుల పత్రాల ఆధారంగా ప్లూటార్చ్‌వంటి చరిత్రకారులు దీనిని అక్షరబద్ధం చేశారు.
అలగ్జాండర్ క్రీ.పూ.325- 327ల మధ్య భారతదేశం మీదకి దండెత్తాడు. అప్పటికే ప్రపంచంలో వెలిగిపోతున్న భారతదేశాన్ని జయిస్తే కానీ, తన ప్రపంచయాత్ర సంపూర్ణం కాదన్నది అలగ్జాండర్ అభిమతం. అందుకోసం సింధునదీతీరం దగ్గర మకాం వేసుకుని, ఆ దేశంలోకి ఎలా చొచ్చుకుపోవాలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంతలో అతని సైనికాధికారులు ఓ పదిమంది సాధువులను వెంటతీసుకుని వచ్చారు. `వీళ్లు మన అధికారాన్ని అంగీకరించడంలేదనీ, పైగా మన మీదకి యుద్ధం చేయమని ప్రజలని ప్రేరేపిస్తున్నారనీ` వివరించారు. వాళ్లని చూస్తేనేమో ఒంటిమీద నూలుపోగు కూడా లేని సాధువులు! కానీ తన అధికారాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు!
`మిమ్మల్ని చూస్తే గొప్ప జ్ఞానులులాగా కనిపిస్తున్నారు. అందుకని మీకో పరీక్ష పెడతాను. మీలో ప్రతి ఒక్కరినీ ఒకో ప్రశ్న వేస్తాను. ఎవరైతే మొదటి అసంబద్ధమైన జవాబుని ఇస్తారో వారిని చంపేస్తాను` అన్నాడు. వారి సమాధానాలు సవ్యమైనవా, కాదా అని బేరీజు వేసేందుకు వారిలో వృద్ధుడైన ఒక వ్యక్తిని న్యాయనిర్ణేతగా నియమించాడు.
మొదటి వ్యక్తిని ఇలా ప్రశ్నించాడు అలగ్జాండర్ `ఈ ప్రపంచంలో బతికున్నవి ఎక్కువున్నాయా, చనిపోయినవి ఎక్కువున్నాయా?`
దానికి ఆ సాధువు `బతికున్నవే! ఎందుకంటే చనిపోయినవి ఉన్నట్లు కాదు కదా!` అని జవాబిచ్చాడు.
ఇక రెండో సాధువుని ఇలా ప్రశ్నించాడు `అన్నిటికంటే పెద్ద జీవులు నేల మీద ఉంటాయా, సముద్రంలో ఉంటాయా?`
`నేల మీదే! ఎందుకంటే సముద్రం కూడా నేలమీదే ఉంది కదా` అన్నది అతని జవాబు.
`మృగాలలో అతి తెలివైన మృగం ఏది?` అని మూడో సాధువుని అడిగాడు.
`ఇంతవరకు మనిషి కంటపడనిది!` అని తెలివిగా సమాధానమిచ్చాడు అతను.
`ఇక్కడి ప్రజలను మీరు ఎందుకని ఎదురుతిరిగేందుకు ప్రోత్సహిస్తున్నారు?` అని నాలుగో సాధువుని అడిగాడు.
`ఎందుకంటే వాళ్లు బతికినా, మరణించినా మన గౌరవాన్ని నిలుపుకోవాలని నా ఉద్దేశం కాబట్టి` అని జవాబిచ్చాడు అతను.
ఆ తరువాత అలగ్జాండర్ ఐదో మనిషిని `పగలుముందా రాత్రి ముందా?` అని అడిగాడు.
`తన ముందర వచ్చిన పగలుకంటే, ఒక పగలే ముందు!` అని ఘాటుగా జవాబిచ్చాడు ఐదో సాధువు.
`ఒక వ్యక్తి అత్యంత ఆభిమానాన్ని ఎలా పొందగలడు?` అన్నది ఆరో సాధువుని అడిగిన ప్రశ్న.
`అంతులేని అధికారం ఉండి కూడా, ఇతరులలో భయాన్ని కలిగించనివాడే గొప్ప అభిమానాన్ని పొందగలడు!` అన్నాడతను.
ఇక ఏడో సాధువుని `ఒక సాధారణ మానవుడు, దేవుడిగా మారగలడా!` అని అడిగాడు.
`తప్పకుండా! ఒక మనిషి చేయలేని పని చేస్తే అతను దేవుడిలా మారగలడు` అన్నది సమాధానం.
`జీవితం బలమైనదా? మృత్యువు బలమైనదా` అని ఎనిమిదో వ్యక్తిని అడిగాడు చక్రవర్తి.
`జీవితమే! ఎందుకంటే అది ఎన్నో రుగ్మతలను తట్టుకుంటుంది కాబట్టి` అని చిరునవ్వుతో చెప్పాడు అతను.
`ఒక మనిషి ఎంతకాలం సంతోషంగా జీవించగలడు?` అని ఆఖరి సాధువుని అడిగాడు అలగ్జాండర్.
`జీవితంకంటే మరణం మేలనుకునేంత కాలం అతను సంతోషంగా జీవించగలడు` అన్నది అతనికి దక్కిన జవాబు.
ఈ జవాబులన్నింటికీ తృప్తి చెందిన విశ్వవిజేత, తాను న్యాయ నిర్ణేతగా నియమించిన పదవ సాధువు వంక తిరిగి `మీ ఉద్దేశం ఏంటి?` అని అడిగాడు.
`రాజా! నా దృష్టిలో ఒకరికంటే మరొకరు పనికిమాలిన సమాధానాలని ఇచ్చారు. అవేవీ నాకు తృప్తి కలిగించలేదు` అని తాపీగా చెప్పాడు ఆ వృద్ధ సాధువు.
`అయితే ముందు నిన్ను చంపుతాను. ఆ తరువాత వాళ్లందరినీ చంపుతాను` అన్నాడు అలగ్జాండర్.
`అలా ఎలా చేస్తారు మహారాజా!` అన్నాడతను నవ్వుతూ `ఎవరైతే మొదటి పనికిమాలిన సమాధానాన్ని ఇస్తారో వారిని ముందుగా దండిస్తానని చెప్పారుగా! నా తీర్పు నిజమే అయితే, వారిలో మొదటి వ్యక్తికి మరణదండన విధించిన తరువాతే రెండో ప్రశ్న అడిగి ఉండాలి కదా!` అంటూ నిశ్చలంగా ఉండిపోయాడు ఆ సాధువు.
అతని మాటల్లోని సమయస్ఫూర్తిని గ్రహించిన అలగ్జాండర్ వాళ్లందరినీ గౌరవంగా సత్కరించి విడిచిపెట్టేశాడు.
- నిర్జర.