దత్తాత్రేయుడు - పంచభూతాలు!
తాను 24మంది గురువుల నుంచి జ్ఞానాన్ని పొందానని చెబుతారు దత్తాత్రేయులవారు. వాటిలో పంచభూతాలు కూడా ఉన్నాయి. వాటి నుంచి దత్తాత్రేయులవారు గ్రహించిన విషయాలు ఇవీ...
భూమి: తన మీద ఉండే చరాచరాలన్నింటికీ భూమి ఆధారంగా నిలుస్తోంది. తన గుండెలను నాగళ్లతో తవ్వుతున్నా పంటలను కానుకగా అందిస్తుంది. అగ్నిపర్వతాలు పేలుతున్నా ముందుకు కదులుతూనే ఉంటుంది. యుద్ధంలోనైనా, శాంతి వర్ధిల్లుతున్నా నిశ్చలంగానే ఉంటుంది. సహనం అన్న లక్షణం గురించి చెప్పేటప్పుడు భూమాతనే ఉదాహరణగా ఎంచుతారు. అందుకే సహనం, ప్రేమ, నిబద్ధతలకు మారుపేరైన భూమిని తన తొలి గురువుగా ఎంచుతారు దత్తాత్రేయులు.
గాలి: గాలిలో ఎన్నో అంశాలు కలుస్తూ ఉంటాయి. ఒకోసారి అది చెడు వాసనలను మోసుకువెళ్తుంది. మరోసారి సువాసనలను వెదజల్లుతుంది. కానీ అదంతా తాత్కాలికమే. తిరిగి తన నిజరూపానికి చేరుకుంటుంది. ఆ నిజ రూపంలో గాలికి ఎటువంటి రంగూ, రుచీ, వాసనా ఉండవు! అలాగే మనిషిని కూడా ఈ లౌకిక ప్రపంచంలో ఎన్నో లక్షణాలు చుట్టుముట్టినా, అతని నిజరూపమైన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలని అంటారు దత్తాత్రేయులు. అందుకే వాయువుని తన రెండవ గురువుగా ఎంచారు.
ఆకాశం: ఆకాశంలో ఒకోసారి దట్టమైన మేఘాలు కమ్ముకుంటాయి. మరోసారి ఇంద్రధనుస్సులు వెలుస్తాయి. ఒకోసారి చంద్రుని కాంతులతో వెలిగిపోతుంది. మరోమారు చీకట్లతో నిండిపోతుంది. తనలో ఎన్ని రంగులు మారుతున్నా, తాను మాత్రం నిశ్చలంగానే ఉంటుంది ఆకాశం! జీవితం అనే నాటకరంగంలో కూడా ఎన్ని ఘట్టాలు గడుస్తున్నా, తాను మాత్రం ఆకాశంలాగా నిమిత్తమాత్రునిగా ఉండాలని అంటారు దత్తాత్రేయులు. అందుకే ఆకాశాన్ని తన మూడవ గురువుగా పేర్కొన్నారు.
అగ్ని: జీవుల ఆహారాన్ని దహించే జఠరాగ్ని నుంచి సముద్రపు లోతుల్లో ఉండే బడబాగ్ని వరకూ అగ్ని లేని చోటు లేదు. చిన్న నిప్పుకణిక దగ్గర్నుంచీ, అడవిని దహించే దావానలం వరకూ అది తీసుకోని రూపం లేదు. తాను ఏ వస్తువునైతే దహిస్తోందో అదే రూపంలో ఉంటుంది అగ్ని. చిన్నాపెద్దా, చెట్టూచేమాలాంటి బేధాలేవీ దానికి ఉండవు. ఒకసారి మొదలుపెట్టాక దహించడమే దాని పని. యోగి కూడా తనను శరణు కోరే సంసారుల పాపాలను దహించివేస్తాడు. అంతేకాదు! ఈ శరీరం అనే కట్టె దహించుకుపోయాక మిగిలేది బూడిదే అన్న శాశ్వతసత్యాన్ని కూడా తెలుసుకుంటాడు. అందుకే దత్తాత్రేయులు తన నాలుగో గురువుగా అగ్నిని పేర్కొన్నారు.
నీరు: ఆహారం లేకుండానైనా మనిషి కొద్ది వారాలు బతకగలడు కానీ, నీరు లేకుండా కొన్ని రోజులు మించి ఉండలేడు. ఆ ఆహారాన్ని పండించేందుకు కూడా నీరు ఉండాల్సిందే! కులమతాలకూ, జాతిబేధాలకూ, పరువుప్రతిష్టలకు అతీతంగా నీరు ప్రతి ఒక్కరి దాహాన్నీ తీరుస్తుంది. కానీ తాను మాత్రం అందుకు గర్వపడకుండా దిగువకే ప్రవహిస్తుంటుంది. ఒక యోగి కూడా ఈ ప్రపంచం యావత్తు మీదా తన కరుణను ప్రసరిస్తూనే, భగవంతుని పట్ల వినయవిధేయతలతో ఉండాలి. అందుకే దత్తాత్రేయులు నీరుని కూడా తన గురువుగా భావించారు.
- నిర్జర.