ప్రపంచాన్ని జయించే ముందు...
మనసులో స్వేచ్ఛని పొందు!
సింధునదీతీరంలో మకాం వేసిన అలగ్జాండర్, కొందరు సాధువుల జ్ఞానానికి ఆశ్చర్యపోయి, వారిని సగౌరవంగా విడిచిపెట్టేశాడని మనం ఇంతకు ముందు చదివాం. అయితే వాళ్ల జ్ఞానానికి ముగ్ధుడైన అలెగ్జాండర్ `మిమ్మల్ని ఇంత గొప్పగా ప్రభావితం చేసిన గురువు ఎవరు?` అని అడిగాడు. దానికి వారు `రాజా! ఆయన పేరు దండమిస్. అదుగో ఆ కనిపించే అడవులలో సంచరిస్తుంటాడు. రాలిన పళ్లని తింటూ, సెలయేరుల్లో దాహం తీర్చుకుంటూ ఉంటాడు. పిల్లవాడు తల్లి నుంచి పాలు తాగినంత స్వేచ్ఛగా, ఈ సృష్టి నుంచి అతను ప్రశాంతతను పొందుతున్నాడు.` అని చెప్పారు.
`అయితే ఆ రుషిని నా దగ్గరకి తీసుకురండి` అని తన దగ్గర ఉన్న ఆన్‌సిక్రిటస్ అనే రాతగాడిని పంపించాడు. ఆన్‌సిక్రిటస్ దర్జాగా దండమిస్‌ని వెతుక్కుంటూ బయల్దేరాడు. కొద్దిసేపటికి అడవిలో ఒకచోట నిశ్చలంగా ఆకుల మీద పడుకుని ఉన్న దండమిస్ అతనికి కనిపించాడు.
``ఓ రుషీ! ఈ ప్రపంచంలోని ప్రజలందరికీ రాజు, దైవసమానుడు అయిన అలగ్జాడర్ మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు. మీరు కనుక ఆయన ఆజ్ఞను పాటిస్తే అద్భుతమైన బహుమతులతో మిమ్మల్ని ముంచెత్తుతాడు. లేదంటే మీ తల తీసేందుకు కూడా వెనుకాడడు`` అని అహంకరించాడు ఆన్‌సిక్రిటస్.
ఆ మాటలు విన్న దండమిస్ కనీసం తాను విశ్రమిస్తున్న ఆకుల మీద నుంచి లేవను కూడా లేవలేదు, పైగా చిరునవ్వుతో తలెత్తి చూస్తూ ``దేవుడనేవాడు తప్పులు చేయడు సరికదా! ఈ ప్రపంచంలో కాంతినీ, శాంతినీ, జీవితాన్నీ, జలాన్నీ సృష్టిస్తాడు. వాటితో పాటుగా జీవుల్ని సృష్టించి వాటిని తిరిగి తనలో లీనం చేసుకుంటాడు. అలాంటి దేవుడు హింసనీ, వినాశనాన్నీ ఇష్టపడతాడని నేను అనుకోను. అయినా చావుని జయించలేని మీ అలగ్జాండర్ దేవుడెలా అవుతాడు. ఇక అలగ్జాండర్ నాకు ఇచ్చే బహుమతుల గురించి అంటావా. నా దృష్టిలో అవెందుకూ పనికిరానివి. నాకు నిజంగా ఉపయోగపడేవల్లా... నీడని ఇచ్చే ఆకులు, ఆహారాన్ని ఇచ్చే మొక్కలూ, నీటిని ఇచ్చే సెలయేళ్లే! ఇవి కాక ప్రజలు ఏర్పరుచుకునే భౌతికమైన సుఖాలన్నీ, వాటి వెంటపడేవాళ్ల వినాశనానికే దారితీస్తాయి. నా మటుకైతే నేను రక్షించుకోవాల్సిన ఆస్తులేవీ లేవు కాబట్టి, హాయిగా ఉంటాను. అలగ్జాండర్ నా ప్రాణాలకి హాని కలిగించగలడు కానీ, నా ఆత్మని ఏం చేయలేడు కదా! సంపద అంటే మోజు ఉన్నవారినీ, చావంటే భయపడేవారినీ మీ అలగ్జాండర్ ప్రలోభపెట్టగలడు. కానీ మా దృష్టిలో అవి బలహీనమైనవి. పోయి మీ అలగ్జాండర్‌కు చెప్పు - `నీ దగ్గర ఉన్నదేదీ దండమిస్‌కు అవసరం లేదు. దండమిస్ దగ్గర నీకు ఏదన్నా కావాలంటే, నువ్వే అతని దగ్గరకి వెళ్లు`అని`` ఈ మాటలు విన్న ఆన్‌సిక్రిటస్ తలవంచుకుని అలగ్జాండర్ దగ్గరికి వెళ్లి జరిగిన సంభాషణంతా చెప్పాడు.
`ఎన్నో రాజ్యాలను జయించిన తననే ధిక్కరిస్తూ మాట్లాడిన ఆ సాధువుని చూడాల`న్న కోరిక ఆ చక్రవర్తిలో మొదలైంది. మర్నాడే ఆ మునిని వెతుక్కుంటూ అడవిలోకి బయల్దేరాడు అలగ్జాండర్. తన ఆడంబరాలన్నింటినీ విడిచిపెట్టి, ఆయన దగ్గర కూర్చుని దండమిస్ చెప్పే విషయాలన్నీ శ్రద్ధగా విన్నాడు. `నీకు దాహం వేస్తే, కాసిని మంచినీరు తాగగానే దప్పిక తీరిపోతుంది. పైగా నీ దగ్గర నదుల కొద్దీ నీరు ఉన్నా, దప్పిక తీర్చుకునేందుకు కావల్సిన నీరు కొద్ది మాత్రమే కదా! ఎందుకంటే అది ప్రకృతిసహజమైన అవసరం. కానీ నీ మనసు కల్పించుకునే ఆశలకి హద్దులు ఉండవు, ఎంత బంగారం సంపాదించినా ఇంకా సంపాదించాలనే యావ పోదు. పైగా అవసరానికి మించి ఎంత ఉన్నా తనివి తీరదు` అని అలగ్జాండర్‌కి నచ్చచెప్పాడు దండమిస్.
దాదాపు గంటసేపు వీరిద్దరి మధ్యా సంభాషణ జరిగినట్లు గ్రీకు చరిత్రకారులు పేర్కొన్నారు. అలగ్జాండర్ తిరిగి వెళ్లిపోయే సమయంలో దండమిస్ ఇలా హెచ్చరిచాడు ``రాజా! ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తాను నిలబడగలిగేంత భూమి ఉంటే చాలు. నువ్వు కూడా మా అందరిలాగా మామూలు మనిషివే. కాకపోతే మీ ఇంటి నుంచి వేలకొద్దీ మైళ్లు ప్రయాణిస్తూ నువ్వు ఇబ్బంది పడుతున్నావు, నీ తోటి మానవులనూ ఇబ్బంది పెడుతున్నావు. ఒకరి స్వేచ్ఛను హరించాలని నువ్వనుకుంటున్నావు. కానీ నీ మనసు మాత్రం స్వేచ్ఛగా లేనేలేదు సుమా! ఆహ్! నువ్వు త్వరలోనే చనిపోతావు. అప్పుడు నిన్ను ఖననం చేసేందుకు కావల్సినంత నేల మాత్రమే దక్కుతుంది.`` అన్నాడు.
కానీ అప్పటికే అలగ్జాండర్ తన దండయాత్రలతో తలమునకలైపోయి ఉన్నాడు. వీరమరణమే పొందడమే కానీ వెనుతిరిగే పరిస్థితిలో అతను లేడు. అందుకని దండమిస్ మాటలను పాటించలేకపోయినా, తరచూ తనకి మార్గదర్శనం చేసేందుకు తనతో పాటు గ్రీకు రాజ్యానికి రమ్మని
ఆహ్వానించాడు. దానికి దండమిస్ ససేమీరా అనడంతో, ఆయన శిష్యుడైన కలనోస్‌ని తన వెంట తీసుకుని బయల్దేరాలని నిశ్చయించుకున్నాడు.
కలనోస్ కూడా తక్కువవాడేమీ కాదు. ఎంతైనా దండమిస్ ముఖ్యశిష్యుడు కదా! తన దగ్గరకు అలగ్జాండర్ ఎన్నో విలువైన కానుకలను పంపగానే... `అలాంటి బహుమతులు ఎన్ని దక్కినా, అవి మనిషి ఆశలను తగ్గించలేవు. నా స్వేచ్ఛను వదులుకునే ప్రశ్నే లేదు` అంటూ వాటిని సున్నితంగా తిరస్కరించాడు.
ఆఖరికి కలనోస్‌ను బలవంతంగానైనా తన వెంట తీసుకువెళ్లడానికి అలగ్జాండర్ సిద్ధపడ్డాడు. దానికి కలనోస్ నిర్వికారంగా`నీ ప్రజల దగ్గర నన్ను ప్రదర్శించుకునేందుకు తప్ప, నీకు నేను ఎందుకూ ఉపయోగపడను` అన్నాడట.
ఎట్టకేలకు అలగ్జాండర్‌తో పాటు ప్రయాణం కట్టిన కలనోస్ ఇప్పటి ఇరాన్‌లోని `సుసా` అనే పట్నాన్ని చేరుకోగానే తీవ్రంగా జబ్బుపడ్డాడు.... తను అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం అగ్నిలో ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. అతణ్ని వారించేందుకు అలగ్జాండర్ సహా ఎవరెంతగా ప్రయత్నించినా కలనోస్ వెనక్కి తగ్గలేదు. చెప్పిన సమయానికి చితి మీద నిశ్చలంగా కూర్చున్నాడు కలనోస్. నలుదిక్కులా మంటలు ఉవ్వెత్తున లేచాయి. ఈ వింత దృశ్యాన్ని చూసేందుకు, అలగ్జాండర్ సైన్యమంతా అక్కడికి చేరుకుంది. కానీ వారందరినీ ఆశ్చర్యపరుస్తూ కలనోస్ మంటల మధ్య కూడా నిర్వికారంగా ఉండిపోయాడు. మంటల తీవ్రతకి కాస్తైనా చలించనేలేదు. ఆ సమయంలో అలగ్జాండర్ అక్కడ లేడు కాబట్టి, జరిగినదంతా అతని వార్తాహరులు చక్రవర్తికి చేరవేశారు. దాంతోపాటుగా కలనోస్ ఆయనకు అందించిన చివరి సందేశాన్ని కూడా వినిపించారు `మనం త్వరలోనే బాబిలోన్‌లో కలుసుకుందాం!` అన్నదే ఆ సందేశం!
ఆ మాటలు విన్న అలగ్జాండర్ తెగ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అప్పటికి ఆయనకు బాబిలోన్ వైపు వెళ్లే ఉద్దేశం ఏమాత్రం లేదు. కానీ భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించుకునేందుకు తన సైన్యం నిరాకరించడంతో, అలగ్జాండర్ తన దేశానికి తిరుగుప్రయాణమయ్యాడు. ఎవరూ ఊహించని రీతిలో బాబిలోన్ (ఇప్పటి ఇరాక్‌లోని భాగం) అనే ప్రదేశానికి చేరుకోగానే, ఎలాంటి కారణం లేకుండానే జబ్బుపడ్డాడు. అక్కడే చనిపోయాడు.
కానీ దండమిస్, కలనోస్‌లు చెప్పిన విషయాలు బహుశా అలగ్జాండర్‌ను కదిలించే ఉంటాయి. అందుకే చివరిక్షణాల్లో `నా భౌతికకాయాన్ని శవపేటికలో ఉంచినా కూడా, నా చేతులు మాత్రం బయటకి కనిపించేట్లు ఉంచండి. ఎందుకంటే ప్రపంచాన్ని నా బానిసగా చేసుకోవాలని బయల్దేరిన అలగ్జాండర్, పోతూపోతూ ఖాళీ చేతులతోనే వెళ్తున్నాడని అందరికీ తెలియాలి కదా` అన్నాడట. అలా విశ్వవిజేత అయిన అలగ్జాండర్ ఖాళీ చేతులతో, ప్రశాంతత లేని మనసుతో ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు.
- నిర్జర