పితృదోషం కారణంగా ఎన్ని ఇబ్బందులో తెలుసా...
సనాతన ధర్మంలో పూర్వీకులకు లేదా మరణించిన పెద్దలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ప్రతి శుభకార్యంలో పితృదేవతలను కూడా పూజిస్తారు. వివాహం, కుంభరాయణ కార్యక్రమం వంటి ముఖ్యమైన సందర్భాలలో పూర్వీకులను ఆహ్వానిస్తారు. ఎందుకంటే వారి ఆశీర్వాదాలు పిల్లలు, కుటుంబ సంక్షేమానికి చాలా అవసరం. పూర్వీకులు దుఃఖిస్తే వ్యక్తి జీవితంలో అతని కుటుంబంలో చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్నిసార్లు కుటుంబం మొత్తం పితృ దోషం బారిన పడవచ్చు. దాని ప్రభావం ఏడు తరాల వరకు ఉంటుందని నమ్ముతారు. అసలు పితృదోషం వల్ల ఎలాంటి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది? తెలుసుకుంటే..
పితృ దోషంతో లేదా పూర్వీకుల శాపంతో బాధపడేవారు పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. తన పూర్వీకులను సంతృప్తి పరచని వ్యక్తికి సంతానం కలిగే అదృష్టం లభించదని, అందువల్ల అతని వంశం కొనసాగదని ఒక నమ్మకం ఉంది.
పితృ దోషం బారిన పడిన వ్యక్తి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటాడు. అలాంటి వ్యక్తులు సంపద, ఆనందం, ఆస్తి, శ్రేయస్సును సంపాదించుకోవడానికి ఎంత కష్టపడినా, వాటిని ఎంత సంపాదించుకున్నా వాటిని కోల్పోతూ జీవితాంతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.
పితృ దోషంతో బాధపడుతున్న కుటుంబాలలో పురోగతి ఉండదు. ఇలాంటి వారి ఇంట్లో ఏ విధమైన అభివృద్ది అయినా ఆగిపోతుంది. కష్టపడి పనిచేసినప్పటికీ, ఆశించిన విజయం సాధించలేరు. ప్రతి పనిలో అడ్డంకులు ఎదురవుతాయి. ఎన్ని ప్రణాళికలు రచించినా అవి విజయవంతం కావు.
మరణించిన పెద్దలు అసంతృప్తిగా ఉన్న కారణంగా కుటుంబంలోని ఒకరు లేదా ఇద్దరు ఎల్లప్పుడూ అనారోగ్యంతో ఉంటారు. ఆరోగ్య సమస్యలు అలాగే ఉంటాయి. ప్రమాదాల అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులు నిరంతరం శారీరక అసౌకర్యానికి గురవుతారు.
పితృ దోషం బారిన పడిన ఇళ్లలో కుటుంబ కలహాలు, పరస్పర వివాదాలు, తగాదాలు, ఉద్రిక్తత పరిస్థితులు ఉంటాయి. వైవాహిక జీవితంలో అడ్డంకులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు పెరుగుతాయి. దీనితో పాటు, వ్యాపారంలో వైఫల్యం ఆర్థిక నష్టం కూడా పితృ దోషం ప్రభావాలే..
పరిష్కారాలు..
మరణంచిన పెద్దల ఆశీర్వాదం ఉంటేనే ఏ పని అయినా సవ్యంగా జరుగుతుంది. వారి ఆశీర్వాదం పొందడానికి తర్పణం, శ్రాద్ధం, దానం వంటి కర్మలు చేయడం అవసరం. మత విశ్వాసాల ప్రకారం, ఈ ఆచారాలను సరైన రీతిలో నిర్వహిస్తే పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తాయి.
*రూపశ్రీ.
