పరబ్రహ్మ స్వరూపాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు?


పరబ్రహ్మమూ అతి సూక్ష్మము అంటే పరమాణుస్వరూపము. మామూలు కంటికి కనపడదు. అలాగే ఈ శరీరం కూడా స్థూల శరీరము, సూక్ష్మశరీరము అని రెండుగా ఉంటాయి. జాగ్రదావస్థలో స్థూల శరీరము, స్వప్పావస్థలో సూక్ష్మశరీరము ప్రవర్తిస్తుంటాయి. ఈ సూక్ష్మశరీరము నుండి వాసనలను పూర్తిగా నాశనం చేస్తే అదే పరమాత్మ అవుతుంది. దీనిని అనుభవించవలసినదే కాని కనపడదు. ఈ రెండింటిలోనూ పరబ్రహ్మ స్వరూపము నిక్షిప్తమై ఉంది.

దూరము దగ్గర అనేవి అక్కడకు ఇక్కడకు మధ్య దూరమును సూచిస్తుంది. అప్పుడు ఇప్పుడు అనేది కాలము సూచిస్తుంది. పరబ్రహ్మకు కాలము దూరము లేవు. అంతటా ఉన్న వాడికి అన్ని కాలములలో ఉన్న వాడికి కాలము దూరము ప్రసక్తి లేదు. విశ్వం అంతటా నిండి అతి దూరంగా ఉన్న పరమాత్మ అందరి హృదయాలలో అతి దగ్గరగా ఉన్నాడు. 


పరమాత్మ ఒక్కడే నిత్యుడు. ఎల్లప్పుడూ ఉండేవాడు. ఆయనను విభజించడానికి వీలులేదు. కాని ఆత్మస్వరూపుడుగా అన్ని జీవరాసులలో ఉన్నాడు. పరమాత్మ స్వరూపమూ పూర్ణమే. జీవరాసులలో ఉన్న ఆత్మ పూర్ణమే. ఎందుకంటే పూర్ణములో నుండి మరొక పూర్ణము వచ్చింది. మరలా ఈ పూర్ణము ఆ పూర్ణములో కలిసిపోతుంది. కాబట్టి అంతా పూర్ణమే అవిభాజ్యమే. సూర్యుడు ఒక్కడే అయినా వివిధ జలములలో విడివిడిగా ప్రకాశించినట్టు, పరమాత్మ కూడా వివిధ శరీరములలో ఆత్మస్వరూపుడుగా గోచరిస్తాడు. కాబట్టి అవిభక్తుడుగానూ విభక్తుడుగానూ మనకు గోచరిస్తాడు పరమాత్మ.

త్రిమూర్తుల గురించి ఒక నిజం ఏమిటంటే, సృష్టించే టప్పుడు బ్రహ్మ, పోషించేటప్పుడు విష్ణువు, లయం చేసేటప్పుడు శివుడు. కాని మనం అజ్ఞానంతో వారిని వేరు వేరుగా అనుకుంటూ ఉంటాము.

ఈ ప్రకృతి త్రిగుణాత్మకము. ఈ మూడు గుణములలో ఉన్న హెచ్చుతగ్గుల వలన మనకు అంతా మాయగా కనిపిస్తుంది. దానినే తమస్సు అంటారు. ఈ మాయకు అవతల ఉండే వాడు అనగా పరమైన వాడు పరమాత్మ. పరమాత్మకు జీవాత్మకు మధ్య మూడుగుణములతో కూడిన మాయ అనే తెర అడ్డుగా ఉంది. ఈ మాయను దాటి మాయకు అవతల ఉన్న పరమాత్మను దర్శించాలి. అదే సాధకుడి లక్ష్యం. జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం జ్ఞానము తెలుసుకోవలసినవి. జ్ఞేయము అంటే తెలుసుకోతగినది.

మనం ఎన్ని తెలుసుకున్నా అసలు తెలుసుకోదగినది ఏదో దానిని తెలుసుకోలేకపోతున్నాము. కాని జ్ఞానమునకు అంటే తెలుసుకోవలసిన వాటి గమ్యం జ్ఞేయమే అంటే తెలుసుకోదగినది తెలుసుకోవడమే. ఈ పరబ్రహ్మ తత్వము ఎక్కడో లేదు అందరి హృదయములలో అదిష్టానంగా ఉన్నాడు. కాని మనమే తెలుసుకోలేకపోతున్నాము. పిపీలికాది బ్రహ్మ పర్యంతము అన్ని జీవరాసులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. ఆ పరబ్రహ్మస్వరూపాన్ని దర్శించడానికి అందరికీ హక్కు ఉంది. ఆ హక్కును ఎవరూ వినియోగించుకోవడంలేదు. ఎందుకంటే బయట ప్రపంచంలో ఉన్న వాటికి ఇచ్చిన ప్రాధాన్యత, వాటి మీదున్న మమకారము, లోపల ఉన్న ఆత్మస్వరూపుడి మీద లేకపోవడమే.

◆ వెంకటేష్ పువ్వాడ.


More Enduku-Emiti