ఆవనూనెతో దీపం వెలిగించడం వల్ల ఏం జరుగుతుందంటే..!
హిందూ ధర్మంలో దీపానికి చాలా ప్రాధాన్యత, ఎంతో విశిష్టత ఉన్నాయి. దేవుడి ముందు దీపం వెలిగిస్తే మనిషిలో అహం నశిస్తుందని, మనిషిలో దైవిక గుణాలు మెరుగవుతాయని అంటారు. అందుకే దీపం వెలిగించడం చాలా మంచి అలవాటు అని కూడా చెబుతారు. సరిగ్గా గమనిస్తే దీపాలు వెలిగించడంలో కూడా చాలా పద్దతులు ఉన్నాయి. సాధారణంగా దీపం వెలిగించడం మాత్రమే కాకుండా నెయ్యి దీపం, నువ్వుల నూనె దీపం, కొబ్బరి నూనె దీపం.. ఇలా చాలా రకాల నూనెలతో దీపాలు పెడుతుంటారు. ఆవనూనె తో పెట్టే దీపం గురించి చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఆవనూనె దీపాన్ని పెద్దలు చాలా కాలం క్రితం నుండే వెలిగిస్తూ వచ్చారు. ముఖ్యంగా దీపావళి పండుగ రోజు ఆవనూనె వెలిగించడం చాలా చోట్ల సంప్రదాయంగా ఉంది. ఆవాలనూనెతో దీపాలు వెలిగించడానికి అనేక కారణాలు ఉన్నాయి.
ప్రతిరోజూ ఆవనూనెతో దీపం వెలిగించడం వల్ల కష్టాలు తొలగుతాయని చెబుతారు. అంతేకాదు ప్రవహించే నీటిలో ఆవనూనె దీపం వెలిగిస్తే ఐశ్వర్యం చేకూరుతుందట. ఇంట్లోని దారిద్ర్యం తొలగిపోతుందట.
వ్యాపారం, ఉద్యోగాలలో ఏమాత్రం పురోగతి లేనివారికి ఆవాల నూనె ఉన్నతిని తెచ్చిపెడుతుంది. ఆవాల నూనెను ఒక గాజు సీసాలో వేసి ప్రవహిస్తున్న నదిలో వదలాలి. ఇలా చేస్తే జీవితంలో ఉన్నతి ప్రాప్తిస్తుందట.
ఇంట్లో ఆవాల నూనె దీపం వెలిగించి అందులో రెండు రూపాయల నాణెం వేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మిదేవి ప్రసన్నురాలు అవుతుందట. ఇంట్లో ధనానికి లోటు లేకుండా కూడా ఉంటుందట.
చాలామంది శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పిస్తుంటారు. కానీ శనిదేవుడికి ఆవనూనెను సమర్పిస్తే సంతోషిస్తాడట. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా శనిదేవుడు చూసుకుంటాడని కూడా నమ్ముతారు.
ప్రతిరోజూ సాయంత్రం రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయట. కుటుంబంలో ఇబ్బందులు, పిల్లల జీవితాలలో ఎదుగుదల లేకపోవడం, పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, ఏ పనులు తలపెట్టినా ఆటంకాలు ఎదురు కావడం మొదలైనవి మరణించిన పెద్దలు కోపించడం వల్ల జరుగుతాయట. అందుకే రావి చెట్టు దగ్గర దీపం పెడితే మంచిదట.
ఆరోగ్యపరమైన ఇబ్బందులకు కూడా ఆవాల నూనె దీపం చక్కని ఉపశమనాన్ని ఇస్తుంది. తలనొప్పి లేదా గొంతు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడేటప్పుడు ఇంట్లో ఆవాల నూనె దీపం వెలిగించాలి. ఈ దీపం నుండి వెలువడే వాసన, దీపపు పొగ మొదలైనవి తలనొప్పి, గొంతునొప్పిని తగ్గిస్తాయి.
*రూపశ్రీ.