ఏ జపమాలతో ఏ దేవతను జపించాలో తెలుసా!
జపం.. దేవుడి అనుగ్రహం పొందడానికి చేసే సాధనే జపం. దేవతకు సంబంధించి నిర్ణీత మంత్రాన్ని ఎంచుకుని ప్రతిరోజూ ఒక నిర్దేశిత సంఖ్యను జపించడం చేస్తుంటారు. దీని వల్ల ఆ మంత్రం శక్తి పెరగడమే కాకుండా ఆ మంత్ర శక్తి జపం చేసే వ్యక్తికి లభిస్తుంది. చాలామంది జపం చేయడానికి జపమాల వాడతారు. కొందరు రుద్రాక్ష మాలను, మరికొందరు తులసి మాలను, మరికొందరు స్పటిక మాలను వాడటం చూసి ఉంటారు. అయితే ఏ దేవత జపానికి ఏ మాలను వాడాలి?
రుద్రాక్ష మాల..
రుద్రాక్ష మాలను శివుడి జపం చేయడానికి వాడతారు. రుద్రాక్ష మాలతో చేసే జపంలో "ఓం నమఃశివాయ" అనే మంత్రం లేదా.. మృత్యుంజయ మంత్రం జపిస్తారు. ఈ మంత్రాలను రుద్రాక్ష సహాయంతో జపించడం వల్ల మంత్రశక్తి పెరగడం, రుద్రాక్ష మాల శక్తి పెరగడం జరుగుతాయి. అంతేకాదు రుద్రాక్ష మాలతో జపం చేయడం వల్ల మనశ్శాంతి, ఏకాగ్రత కూడా పెరుగుతాయి. ఇది ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. మానసిక స్థిరత్వాన్ని అందిస్తుంది.
తులసి మాల..
తులసి మాలతో విష్ణువు లేదా కృష్ణుడికి జపం చేయడం శ్రేష్టం. "ఓం నమో భగవతే వాసుదేవాయ" లేదా హరే కృష్ణ హరే రామ" అనే మంత్రాలను జపిస్తారు. తులసి మాల విష్ణువుకు, కృష్ణుడికి చాలా ప్రీతికరమైనది. తులసి మాలతో చేసే జపం భక్తిని పెంచుతుంది. జీవితంలో శాంతి, శ్రేయస్సును తెస్తుంది.
చందనం మాల..
చందనం మాల గురించి చాలా మందికి తెలియదు. కానీ ఈ మాల విష్ణువు, కృష్ణుడు, లక్ష్మీదేవికి కూడా చాలా ప్రీతికరమైనది. విష్ణువు, లక్ష్మీదేవి మంత్రాలను పఠించడానికి గంధపు జపమాల చాలా మంచిదని చెబుతారు. ఈ జపమాలతో జపం చేస్తే మానసికంగా ఆహ్లాదాన్ని ఇస్తుంది. మానసిక ఆరోగ్యం కుదుట పడుతుంది. సంపద, శ్రేయస్సు పెరుగుతాయి.
స్పటికమాల..
స్పటికమాల లక్ష్మీదేవిని దుర్గాదేవిని జపించడానికి వాడవచ్చు. "ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ల్మై నమః" అనే మంత్రం, దుర్గా సప్తశతి వంటి దేవత మంత్రాలను పఠించడానికి స్పటిక మాల ఉపయోగించవచ్చు. ఈ మాలతో జపం చేయడం వల్ల సానుకూల శక్తి అందుతుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది.
ఎర్ర చందనం మాల..
ఎర్ర చందనంతో జపమాల తయారు చేయించి దాంతో వినాయకుడు, సూర్యుడి జపం చేయాలి. "ఓం సూర్యాయ నమః" "ఓం గం గణపతయే నమః" అనే మంత్రాలు జపించాలి. ఈ మాలతో మంత్ర జపం చేస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనులలో విజయాన్ని తెచ్చిపెడుతుంది.
నవరత్న మాల..
నవగ్రహాల శాంతి కోసం నవరత్న మాల ఉపయోగించాలట. ఇందులో ఉండే ప్రతి రత్నం ఆయా గ్రహా శక్తిని సమతుల్యం చేస్తుందట. నవరత్న మాల ఉపయోగించి నవగ్రహ జపం చేస్తే జాతకంలో ఉండే దోషాలను తొలగిస్తుంది. గ్రహాలకు అనుకూలిస్తాయి.
తామర మాల..
తామర పువ్వు విత్తనాలతో మాల తయారు చేస్తారు. ఈ మాలతో లక్ష్మీదేవి జపం చేయవచ్చు. లక్ష్మీదేవి జపం చేస్తే సంపద, శ్రేయస్సు చేకూరతాయని అంటారు. జీవితంలో, ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగుతాయట.
*రూపశ్రీ.