ఋషులు చెప్పిన ఆహార నియమాలు

Food Conditions by Sages

 

హెల్త్ అండ్ న్యూట్రిషన్ కోర్సులు, ఫిట్ నెస్ స్టడీలు ఇప్పుడొచ్చాయి. ఏ పదార్ధాల్లో ఎన్ని కేలరీలు ఉంటాయి. ఏయే పోషకాహారాల్లో ఏమేం విటమిన్లుంటాయి లాంటి వివరాలు తెలియజేస్తున్నారు. శరీరానికి ఏయే పోషకాలు కావాలి, ఏ విటమిన్లు కరువైతే ఎలాంటి అనారోగ్యాలు తలెత్తుతాయి మొదలైన అంశాలను వివరిస్తున్నారు. ఇదంతా ఆధునిక విజ్ఞానమని మురిసిపోతున్నాం. నిజానికి వేల సంవత్సరాల క్రితమే, ఏ సాంకేతిక పరికరాలూ లేని కాలంలోనే శరీర తత్వానికి సంబంధించిన పరిజ్ఞానం సంపాదించారు మన ఋషిపుంగవులు. మహర్షులు ఎన్నో సిద్ధాంతాలు రూపొందించినట్లు, ఆహారానికి సంబంధించి కూడా నియమాలు ఏర్పరిచారు. కంటికి కనిపించిందల్లా తినకూడదని, కడుపుకు పట్టినంత ఆహారం తీసుకోవడం సరికాదని చెప్తున్నాయి మన ధార్మిక గ్రంధాలు. ఇంకా మహర్షులు చెప్పిన ఆహార నియమాలు ఏమిటో తెలుసుకుందాం.

పరగడుపున కొంతసేపు యోగాసనాలు వేయడం లేదా వ్యాయామం చేయడం మంచిది. యోగా చేయడానికి ముందు మూడు గంటలపాటు ఏమీ తినకూడదు. ఖాళీ కడుపుతో ఉండాలి. యోగా పూర్తయిన తర్వాత కొంతసేపు విరామం ఇచ్చి, నానబెట్టగా మొలకలొచ్చిన పెసలు, శనగలు, వేరు శనగలు లాంటి బలవర్థకమైన గింజలను ఒక గుప్పెడు తినడం శ్రేష్ఠం. నానబెట్టిన గింజల్లో పోషకాలు అత్యధికంగా లభిస్తాయి.

మనం తినే ఆహారాన్ని బట్టి సాత్విక, తామస, రజో గుణాలు అలవడతాయి. సాత్విక లక్షణాలతో ఉండాలంటే సాత్వికాహారం తీసుకోవాలి. పాలు, ఆకుకూరలు, పండ్లు, పొట్లకాయ, బీరకాయ మొదలైనవి సాత్వికాహారం కిందికి వస్తాయి. ఉల్లి, వెల్లుల్లి తదితరాలు తామస గుణాన్ని పెంచుతాయి.. మాంసాహారం రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది. మనం తీసుకునే ఆహారం జీర్ణ ప్రక్రియ, పోషకాలు అందించడం లాంటి లక్షణాలతో శరీరం మీదే కాకుండా మనసు మీద కూడా ప్రభావం చూపిస్తుందని గ్రహించాలి. ఆకుకూరలు, తాజా పండ్లు వీలైనంత ఎక్కువగా సేవించాలి.

అందరి శరీర తత్వాలూ ఒక రీతిగా ఉండవు. కొందరిది ఉష్ణతత్వం కాగా, కొందరిది శ్లేష్మ తత్వం అయి ఉంటుంది. ఎవరి శరీర తత్వానికి తగ్గట్లు వారు భుజించాలి.

ఉష్ణతత్వం ఉన్నవారికి ఆహారం త్వరగా జీర్ణం కాదు. కనుక నూనె ఎక్కువగా ఉండే పిండివంటలు, వేపుళ్ళు, మసాలా దినుసులు ఉపయోగించిన పదార్థాలు తినకూడదు. కారం కూడా తగ్గించాలి. వాము, మిరియాలు , సొంఠి, జీలకర్ర తదితర దినుసులు ఆహారంలో ఉండేలా చూసుకుంటే త్వరగా జీర్ణం అవుతుంది.

ఆహార నియమాలను లక్ష్యపెట్టకుండా సరిపడని ఆహారాన్ని సేవించినట్లయితే ఆహారం జీర్ణం కాదు. అజీర్తి అనేక అనారోగ్యాలకు కారణమౌతుంది. పైపెచ్చు విసుగు, అసహనం లాంటి అనేక చిరాకులు ఎదురౌతాయి.

శ్లేష్మ తత్వం ఉన్నవారు దుంప కూరలు, శనగ, కంది, సోయాబీన్సు తదితర పప్పు కూరలు, పులుసు కూరలు, పులిసిన పెరుగు, మజ్జిగ లాంటి పదార్ధాలు తినకూడదు.

శరీరం ఆరోగ్యంగా, ఆనందంగా మనసు నిర్మలంగా, నిర్వికారంగా ఉండాలంటే సాత్వికాహారం భుజించాలి. అది కూడా మరీ ఎక్కువగా బస్తాలో కూరినట్లుగా తినకూడదని చెప్పారు పెద్దలు. అంటే భుక్తాయాసం వచ్చేదాకా తినడం ఏ రకంగానూ మంచిది కాదు. మన భోజనం పూర్తయ్యాక మరికొంత తినగలిగేలా ఖాళీ ఉండాలి. అలా ఖాళీ ఉన్నప్పుడే అరుగుదల బాగుంటుంది. జీర్ణప్రక్రియకు ఇబ్బంది కలక్కుండా తిన్న పదార్ధం సవ్యంగా అరిగి శరీరానికి వంటపడుతుంది.

వారానికి రెండుసార్లు ఉపవాసం ఉండగలిగితే ఆరోగ్యానికి చాలా మంచిది. రెండుసార్లు ఉండలేకపొతే, కనీసం వారానికి ఒకరోజు అయినా ఉపవాసం పాటించాలి. తినడం వల్లే కాదు, అప్పుడప్పుడూ అభోజనంగా ఉండటంవల్ల కూడా ఎనలేని మేలు జరుగుతుంది. ఉపవాసం ఒకరకంగా ఔషధంలా పనిచేస్తుంది. శరీరం ఉత్తేజితం అవుతుంది.

ఆహారానికీ ఆరోగ్యానికీ అవినాభావ సంబంధం ఉంది. మనం ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో ఎక్కువశాతం తీసుకునే ఆహారాన్ని బట్టే వస్తాయంటే అతిశయోక్తి కాదు. కొన్నిరకాల పదార్ధాలు తీసుకోవడం వల్ల ఉన్న వ్యాధులు నివారించబడతాయి. కనుక మనం తీసుకునే ఆహారంలో ఉప్పు, కారం, నూనె - అన్నీ మితంగా ఉండేలా చూసుకోవాలి. తిన్న పదార్థాలు జీర్ణమయ్యేలా ఉండాలి. మంచి పోషకాలను అందించేవై ఉండాలి.

 

olden days and nutritious food, health and food, nutritious food and vitamins, food and minerals


More Enduku-Emiti