మార్గశిర మాసాన్ని విష్ణు స్వరూపంగా భావిస్తారు ఎందుకంటే..!
మార్గశిర మాసాన్ని విష్ణు స్వరూపంగా భావిస్తారు. మార్గశిర మాసంలో పూజలు కూడా మహా విష్ణువుకే ఎక్కువగా జరుగుతాయి. దీని వెనుక పురాణ కథనాలు, కారణాలు కూడా ఉన్నాయి. భాద్రపద మాసంలో గణపతిని, ఆశ్వయుజ మాసంలో అమ్మవారిని, కార్తీకంలో శివుడిని, మార్గశిర మాసంలో విష్ణువును, పుష్యమాసంలో సూర్య భగవానుడిని పూజిస్తారట. ఇలా వరుసగా అయిదు మాసాలలో అయిదు దేవతా స్వరూపాలను పూజించడానికి అనుగుణంగా పంచాయతన పూజా విధానాన్ని ఏర్పరిచారు.
మార్గశిర మాసం గురించి చెప్పాల్సి వస్తే.. ఈ మాసం నాటికి చలి చాలా ఉంటుంది. అయినా సరే.. ఈ మాసంలో సూర్యోదయం కంటే ముందే చన్నీటితో స్నానం చేస్తే అస్సలు చలి బాధ ఉండదట. ఎందుకిలా అంటే.. బ్రాహ్మీ ముహూర్తంలో నీటిలో అగ్ని, సూర్యుడు కలిసి ఉంటారని శాస్త్రం, పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే అంత చలిలోనూ చన్నీటి స్నానం చేసినా చలి బాధ వేయదు.
బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం, సంధ్యావందనం చేయడం, జప ధ్యానాలు నిర్వహించడం వల్ల సూర్య శక్తి, అగ్నితేజము.. రెండూ మనస్సును, బుద్దిని చైతన్యం చేస్తాయి. ఇవి మనిషిని మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
చాలామంది మార్గశిర వ్రతం చేస్తారు. దీని వెనుక కూడా కారణం ఉంది. నందవ్రజంలోని గోపికలు విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడిని భర్తగా పొందాలని, శ్రీకృష్ణుడిలో లీనమవ్వాలని తలచి మార్గశిర వ్రతాన్ని ఆచరించి తమ కోరికను నెరవేర్చుకున్నారు. ఈ కారణంగా మార్గశిర మాసంలో వ్రతానికి కూడా చాలా ప్రాముఖ్యత ఏర్పడింది.
*రూపశ్రీ.