వాలి కథాకమామీషు ఏమిటి?
(The Story of Vali)
వాలి, సుగ్రీవుడి సోదరుడు. సీతాదేవిని రావణాసురుడు అపహరించుకు పోయినట్లుగా సుగ్రీవుని కొట్టి, గాయపరిచి, అతని భార్య ''రుమ''ను ఎత్తుకుపోయాడు. ఆమెను బంధించి కిష్కింధలో దాచాడు. సుగ్రీవుడు ఎంత ఉత్తముడో వాలి అంత హీనుడు. చిత్రం ఏమిటంటే, అన్నదమ్ములైన వాలి, సుగ్రీవులు చూట్టానికి అచ్చం ఒకలాగే ఉంటారు.
వాలి చేసిన అవమానం భరించలేక, ఆ నరకయాతన సహించలేక సుగ్రీవుడు ఉన్నచోటు నుండి పారిపోయాడు. ఋష్యమూకపర్వతంపై నివాసం ఏర్పరచుకున్నాడు. హనుమంతుడు మొదలైనవారితో కలిసి ఉంటూ భార్యను కలుసుకునే రోజు కోసం ఎదురుచూస్తూ కాలక్షేపం చేస్తున్నాడు.
సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చిన రామలక్ష్మణులను చూసి సుగ్రీవుడు మొదట సందేహించాడు. తన దుష్ట సోదరుడు వాలి తరపువారేమో అనుకున్నాడు. కానీ, అలా కాదని అసలు సంగతి తెలిసిన తర్వాత వారిపట్ల సద్భావం కలిగింది. చాలా తక్కువ సమయంలోనే శ్రీరాముడితో చెలిమి కుదిరింది. అది అనన్యసామాన్యమైన మైత్రిగా మారింది. ఇద్దరూ అన్ని సంగతులూ మాట్లాడుకున్నారు.
సుగ్రీవుడు చిప్పిందంతా విన్న రాముడు ''వాలిని సంహరిస్తాను.. నీ భార్య ''రుమ''ను త్వరలోనే కలుసుకుంటావు'' అన్నాడు.
కానీ సుగ్రీవుడు శ్రీరాముని మాటలకు అడ్డు తగిలి వాలి మహా బలశాలి అని, అతన్ని జయించడం అంత తేలిక్కాదని చెప్పాడు.
రాముడు చిరునవ్వు నవ్వి ''సప్తతాళశ్రేణి''ని (ఏడు తాడిచెట్ల వరుస) ఒకే ఒక్క బాణంతో కూల్చేసి, సుగ్రీవుని అనుమానాన్ని పోగొట్టాడు. అప్పుడు గానీ శ్రీరాముడు ఎంతటి మహానుభావుడో సుగ్రీవునికి అర్ధం కాలేదు.
శ్రీరాముడు చెప్పినట్లుగానే సుగ్రీవుడు, వాలిని యుద్ధానికి రమ్మని పిలిచాడు. ఇద్దరిమధ్యా అరివీర భయంకరంగా యుద్ధం సాగింది.
శ్రీరాముడు చెట్టు చాటు నుండి బాణం వేయగా అది సూటిగా వెళ్ళి వాలికి తగిలింది. ఆ బాణపు దెబ్బకు విలవిల్లాడుతూ ''చెట్టు చాటునుండి యుద్ధం చేయడం న్యాయమా'' అని అడిగాడు వాలి.
''తమ్ముని చావతన్ని, అతని భార్యను చెరపట్టడం న్యాయమా?'' అని ఎదురుప్రశ్న వేశాడు రాముడు.
వాలి తన తప్పును ఒప్పుకుని, పశ్చాత్తాప్పడ్డాడు. ''రామా, నీ చేతిలో చావడం నా భాగ్యం'' అన్నాడు.
రాముని చలవతో సుగ్రీవుడు తన భార్య ''రుమ''ను చేరుకోవడమే కాకుండా కిష్కింధకు రాజయ్యాడు.
Mythological Character Vali, Vali and Sugriva, Kishkindha King Vali, Vali in Ramayan, Vali and Srirama, The Story of Vali