శతరూప.. బ్రహ్మదేవుడు సృష్టించిన ఈమె రహస్యం ఇదే..!

భారతీయ వేద పురాణాలు, మనుస్మృతి ప్రకారం, విశ్వం ఆవిర్భవించినప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మ ప్రపంచాన్ని జీవులతో నింపాలని అనుకున్నాడు. అప్పుడు ఆయన మనస్సులో మనువు, శతరూప అనే మొదటి పురుషుడు, మొదటి స్త్రీ ఉద్భవించారు. శతరూప అనే పేరుకు "వంద రూపాలతో కూడినది" అని అర్థం. మనువు, శతరూప ఇద్దరూ కలిసి మానవాళికి జీవం పోశారు. భూమిపై జావానికి వీరే మూలకర్తలు. అయితే మనువు గురించి చాలా చోట్ల ప్రస్తావించబడింది. కానీ సృష్టిలో మొదటి స్త్రీ అయిన శతరూప గురించి చాలా తక్కువ ప్రస్తావించబడింది. బ్రహ్మ దేవుడు సృష్టించిన శతరూప గురించి మరింత వివరంగా తెలుసుకుంటే..
మొదటి స్త్రీ అయిన శతరూప సృష్టి కేవలం జీవసంబంధమైనది కాదు, ఆధ్యాత్మికం, విశ్వసంబంధమైనదని చెబుతారు. ఆమె స్త్రీ స్వభావాన్ని సూచిస్తుంది, బ్రహ్మ పురుష శక్తిని సూచిస్తుంది. వారి కలయిక శక్తిని, చైతన్యాన్ని సూచిస్తుందట.
శివ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణాలలో ఒక వివాస్పద విషయం ఉంది. శతరూప కనిపించినప్పుడు స్వయానా బ్రహ్మ దేవుడే ఆమె అందానికి మంత్రముగ్ధుడయ్యాడట. ఆమె నడక, ఆమె హొయలు ఇలా.. అన్ని చూసి బ్రహ్మ దేవుడు ఆమె పట్ల మరింత ఆకర్షితుడయ్యాడట. ఆమెను చూడటానికే బ్రహ్మకు నాలుగు తలలు పెరిగాయని, చివరికి ఆమె ఆకాశంలో ఎగిరినప్పుడు ఆమెను చూడటానికి బ్రహ్మ దేవుడికి ఐదవ తల కూడా పెరిగిందని చెబుతారు. ఈ సంఘటన దేవతలలో కూడా కోరిక పుట్టుకను సూచిస్తుంది. ఇదంతా గమనించిన శివుడు, విశ్వ క్రమాన్ని కాపాడటానికి, సృష్టి స్వచ్ఛంగా ఉండాలని, అనుబంధం లేదా కామానికి చోటు లేకుండా ఉండాలని, మానవులందరికీ గుర్తు చేయడానికి బ్రహ్మ దేవుడి అయిదవ తలను వేరుచేశాడని చెబుతారు. అంత అందగత్తె శతరూప.
మనువు, శతరూప.. మానవాళి..
బ్రహ్మ దేవుడు సృష్టించిన మనువు, శతరూప ఇద్దరూ మానవాళికి జీవం పోశారు. శతరూప కథ పాపం లేదా ప్రలోభాలకు సంబంధించినది కాదు.. ఆమె సమతుల్యతను కాపాడుకుని, సృష్టిలో .. ప్రపంచంలో అవతరించిన మొట్టమొదటి పవిత్ర స్త్రీ. దైవిక శక్తులు కూడా ధర్మ నియమాలకు కట్టుబడి ఉండాలని శతరూప కథనం తెలియజేస్తుంది. అంతేకాదు.. సృష్టి స్త్రీ చాలా పవిత్రమైనదని, విశ్వ సామరస్యానికి స్త్రీ శక్తి అవసరమని చెబుతుంది.
మనువు- శతరూప దేవాలయం..
మను-శతరూప ఆలయం ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌లోని నైమిశారణ్యంలో ఉంది. ఆలయంలోకి ప్రవేశించడం వల్ల మనసుకు, ఆత్మకు శాంతి లభిస్తుంది. మానవ జాతి నైమిశారణ్యం అనే పవిత్ర భూమిపై ఉద్భవించిందని నమ్ముతారు.
*రూపశ్రీ.


