భూత శుద్ది వివాహం.. అసలు నిజం ఇదే..!

వివాహం భారతీయ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన, పవిత్రమైన అంశం. చాలామందికి వివాహాలలో కూడా రకాలు ఉంటాయనే విషయం తెలియదు. అయితే తాజాగా నటి సమంత, నిర్మాత రాజ్ నిడిమోరు చేసుకున్న వివాహం సోషల్ మీడియాలో చాలా చర్చలకు కారణమైంది. వీరిద్దరూ భూత శుద్ది వివాహం చేసుకున్నారని సమాచారం. అసలు భూత శుద్ది వివాహం అంటే ఏంటి? భారతీయ సంప్రదాయ వివాహాన్ని కాదని, భూత శుద్ది వివాహం చేసుకోవడం వెనుక కారణం ఏంటి?భూత శద్ది వివాహం వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏంటి? తెలుసుకుంటే..
నటి సమంత, నిర్మాత రాజ్ నిడిమోరు తమిళనాడు రాష్ట్రం, కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ లోని లింగ భైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఈషా యోగ సెంటర్ లో వివాహాలు మూడు రకాల పద్దతులలో జరుపుతారట. వీటిలో భూత శుద్ది వివాహం కూడా ఒకటి. మొదటిది లింగ భైరవి వివాహం కాగా, రెండవది వైభవ వివాహం. మూడవది భూత శుద్ది వివాహం.
భూత శుద్ది వివాహం ప్రాముఖ్యత..
భూత శుద్ది వివాహం అనేది యోగ కాలం నాటి అత్యంత పురాతన వివాహ వ్యవస్థ. దీనిని ఈషా యోగ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు అయిన సద్గువు మళ్లీ ప్రజాదరణలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో బాగంగానే భూత శుద్ది వివాహం జరిపించారు.
భూత శుద్ది వివాహంలో పంచభూతాల ద్వారా జంటను శుద్ది చేయడం జరుగుతుందట. పంచ భూతాలైన నీరు, అగ్ని, ఆకాశం, గాలి, నేల.. ఇలా అన్నింటి ద్వారా జంటను శుద్ది చేస్తారు. దీని వల్ల వ్యక్తులలో అంతర్గతంగా శాంతి నెలకుంటుంది. సంబంధంలో సమతుల్యత, భావోద్వేగాల పరంగా బంధం బలంగా ఉండటం, బంధం స్వచ్చంగా ఉండటం, మరీ ముఖ్యంగా భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని చెబుతారు.
లింగ బైరవి..
లింగ భైరవి మాత స్త్రీ శక్తి స్వరూపం. ఈ అమ్మవారిలో క్రోధం, క్రూరత్వమే కాకుండా కరుణ కూడా నిండి ఉంటుంది. ఈషా యోగ కేంద్రంలో సద్గురు లింగ భైరవిని ప్రతిష్టించారు. యోగ, ధ్యానం సాధనలలో లింగ భైరవి ప్రాముఖ్యత చాలా ఉంటుందని చెబుతారు.
*రూపశ్రీ.


