శకుంతల తనయుడు భరతుడు

(Sakuntala's Son Bharata)

 

పురాణ పాత్రల్లో ఇద్దరు భరతులు కనిపిస్తారు. ఒక భరతుడు దశరథుడికి కైకేయి వల్ల కలిగిన పుత్రుడు కాగా, రెండో భరతుడు శకుంతలా దుష్యంతుల తనయుడు భరతుడు. ఇప్పుడు మనం శకుంతల కొడుకు భరతుని స్మరించుకుందాం.

 

శకుంతల తనయుడు భరతుడి వల్లనే మన దేశానికి ''భారతదేశం'' అని పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. సాధారణంగా ఒక వ్యక్తి ఉదారుడు, ఉన్నతుడు అయితే ఆ కుటుంబానికి మంచి పేరు వస్తుంది. కానీ శకుంతలా, కణ్వ మహర్షుల పెంపకంలో పెరిగిన బాలుడు దేశానికే వన్నె తెచ్చాడు. దేశానికే తన పేరు వచ్చేంత ప్రముఖుడయ్యాడు.

 

అడవికి వచ్చి మునికన్య శకుంతలను చూసి మోహించిన దుష్యంతుడు ఆమెని గంధర్వ వివాహం చేసుకున్నాడు. తన రాజ్యానికి తిరిగి వెళ్ళి, శాపవశాత్తు శకుంతలను మర్చిపోయాడు. ఈలోపు గర్భం దాల్చిన శకుంతల భరతునికి జన్మనిచ్చింది. భరతుడు కన్వ మహర్షి ఆశ్రమంలో పెరుగుతున్నాడు.

 

పూవు పుట్టగానే వికసిస్తుంది అన్నట్లు, భరతుడు కణ్వాశ్రమంలోనే పెరుగుతున్నప్పటికీ ముని కుమారునిలా మెలిగేవాడు కాదు. మహా ధైర్యసాహసాలు ప్రదర్శించేవాడు. సాధు జంతువులతో గడిపినంత చనువుగా, సన్నిహితంగా క్రూర జంతువులతో తిరిగేవాడు. పులులు, సింహాలతో ఆడుకునేవాడు. చూసేవారు ఆశ్చర్యంతో కళ్ళు తేలేసేవారు.

 

దుష్యంతుడు శాప ప్రభావంతో మొదట శకుంతలను కాదన్నాడు. అయితే, ఆకాశవాణి జరిగింది చెప్పి, శకుంతల ఎవరో గుర్తు చేయడంతో ఆమెను ధర్మపత్నిగా ఒప్పుకున్నాడు. దుష్యంతుడి తర్వాత భరతుడు భారత ఖండానికి రాజయ్యాడు.

 

భరతుని పాలనలో దేశం సుసంపన్నంగా, సస్యశ్యామలంగా ఉంది. రాక్షసులవల్ల దేవతలు బాధపడుతుంటే వారిని సంరక్షించాడు. భరతుని పాలనలో ప్రజలకు ఏ లోటూ జరగలేదు. సుఖసంతోషాల్లో ఓలలాడారు. జపాలు, తపాలు, యజ్ఞాలు, యాగాలు జరిపించేవాడు. వంకపెట్టలేని విధంగా సాగిన భరతుని పాలన చరిత్రలో సువర్ణాధ్యాయం అని చెప్పాలి.

 

Sakuntala's Son Bharata, King Bharata, Bharata and Bharata Desam, Bharata son of Dushyanta, Mythological Character Bharata


More Purana Patralu - Mythological Stories