ఆశ్చర్య పరిచే కుబేరుడి ఒంటి కన్ను కథ..!


కుబేరుడు ధనానికి, ఐశ్వర్యానికి అధిపతి అనే విషయం తెలిసిందే. సాధారణంగా కుబేరుడు,  పరమేశ్వరుడు తనకు ఏదైనా పని చెబితే చేయాలని కాచుకుని ఉంటాడట. కుబేరుడికి అంత భక్తి శివుడంటే..  అంతేకాదు.. శివుడికి కుబేరుడికి మంచి స్నేహం కూడా ఉందని పురాణాలు చెబుతాయి. మరీ ముఖ్యంగా చంద్రశేఖర అష్టకాన్ని అర్థం చేసుకుంటే.. అందులో యక్షరాజ సఖం అనే ఒకే లైన్ ఉంటుంది. దీని అర్థం కుబేరుడికి పరమేశ్వరుడు స్నేహితుడు అని.


ఒకసారి కుబేరుడు హిమాలయ పర్వతానికి వెళ్లాడట. కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా ఉన్నాడు.  అంతే కాదు పార్వతీ దేవి ఎంచక్కా పరమేశ్వరుడి తొడ మీద కూర్చుని కూడా ఉందట.  ఇలా వారు ఉంటే కుబేరుడి చూపు తనకు తెలియకుండానే పార్వతి దేవిపై నిలిచి పోయింది.  ఎడమ కంటితో పార్వతీ దేవి అందాన్ని చూస్తూ.. ఆహా ఏం సౌందర్యం అనుకున్నాడట.  కానీ ఈ విషయాన్ని పార్వతీ దేవి గమనించనే గమనించింది. వెంటనే అమ్మవారికి కోపం వచ్చింది. అమ్మవారు కోపంతో కన్నెర్ర చేసే సరికి ఆ ప్రభావంతో కుబేరుడి ఎడమ కన్ను కాలిపోయి పింగళ వర్ణంలోకి మారిపోయిందట.  అలా జరగగానే  తనెంత తప్పు చేశాడో కుబేరుడు గ్రహించాడట.  వెంటనే అక్కడి నుండి కైలాసంలోని మరొక ప్రాంతం చూసుకుని అక్కడ పరమేశ్వరుడి అనుగ్రహం కోసం తపస్సు చేస్తూ కూర్చున్నాడట.

కుబేరుడు పరమేశ్వరుడి అనుగ్రహం కోసం 800ఏళ్ళు తపస్సు  చేసి రౌద్ర కేదార వ్రతం చేశాడట. ఈ వ్రతం చేయడానికి చాలా నియమ నిష్టలు అవసరం.  ఇవన్నీ కూడా చాలా కఠినంగా ఉంటాయి. అయినా సరే.. కుబేరుడు అన్నింటిని ఎంతో నియమంగా, నిష్టగా పాటిస్తూ రౌద్ర కేదార వ్రతాన్ని కూడా చేశాడు. ఇవన్నీ చేసేసరికి చివరికి ఆ పరమేశ్వరుడు కుబేరుడి ముందు ప్రత్యక్షమయ్యాడట.

కుబేరుడితో పరమేశ్వరుడు బాధపడకు కుబేరా..ఇకనుంచి నువ్వు నాకు స్నేహితుడిగా ఉంటావు అని వరం ఇచ్చాడట. అంతేకాదు.. కుబేరుడి కాలిపోయిన కన్ను స్థానంలో ఒక గవ్వను పార్వతీ పరమేశ్వరులు అమర్చారట. అందుకే కుబేరుడికి ఎడమకన్ను స్థానంలో గవ్వ ఉంటుందని. ఆయనకు ఉన్న అసలైన కన్ను ఒకటేనని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే కుబేరుడిని ఏకాక్ష పింగళుడు అని కూడా పిలుస్తారు. ఇదీ కుబేరుడి ఒంటి కన్ను కథ.

                                       *రూపశ్రీ.


More Purana Patralu - Mythological Stories