మహాలయ పక్షంలో ....
మానవుడు మోక్షాన్ని పొందడానికి దేవయానం, పితృయానం అనే రెండు మార్గాలున్నాయని వేదం చెప్పింది. అలాగే జన్మించిన ప్రతి మానవునికీ దేవఋణం, ఋషిఋణం, పితృఋణం అనే మూడు ఋణాలు ఉంటాయని, వాటి నుంచి విముక్తులైన వారికి మాత్రమే ముక్తి లభిస్తుందనీ వేదం శాసిస్తోంది. భాద్రపదంలోని శుక్లపక్షం దేవతా పూజలకు అనువైనది. అయితే, బహుళ పక్షం పితృదేవతల పూజకు విశిష్టమైనది. యజ్ఞయాగాదులు, తపోధ్యానాలతో దేవఋణాన్ని, సంతానవంతులై తాతముత్తాలకు పిండప్రదానాలు చేసి పితృ ఋణాన్ని, వేద శాస్త్రాధ్యయన ప్రవచనాలతో ఋషి ఋణాన్ని తీర్చుకోవాలి. మహా భారతంలో ఈ మూడు ఋణాలను తీర్చుకునే కర్తవ్యాన్ని ఆయా సందర్భాలలో బోధించింది. ప్రతిసంవత్సరం భాద్రపద మాస కృష్ణ పక్ష ప్రతిపద నుంచి అమావాస్య వరకు ఉన్న రోజుల్ని మహాలయ పక్ష రోజులంటారు. వీటినే పితృపక్షాలుగా వ్యవహరిస్తారు. సృష్టిలో ప్రత్యక్షదైవాలు తల్లిదండ్రులు. వారు లేకపోతే ఈ సృష్టిలేదు. పిల్లలను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దేది తల్లిదండ్రులే. అందుకే పిల్లలు వారి జీవించి ఉన్నంత కాలం చూసుకోవడమే గాక, మరణానంతరం వారిని సంతృప్తి పరచడం వారి ముఖ్యవిధి. ఆ సంతృప్తి పరిచేది ఈ మహాలయ పక్షంలోనే. అదే పితృకార్యక్రమము.
అనుశాసనిక పర్వంలో భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజు పితృయజ్ఞం గురించి అడిగినప్పుడు భీష్ముడు ... "ధర్మరాజు! పితృపూజతోనే దేవపూజ సంపూర్ణం అవుతుంది. దేవతలు కూడా పితృదేవతలనే భక్తితో పూజిస్తారు అని చెప్పారు.'' భాద్రపద కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అనువైనది. ఆషాడ కృష్ణపక్షం నుండి లెక్కిస్తే అయిదవదైన భాద్రపద కృష్ణపక్షాన్ని వారంతా ఆశ్రయించుకుని ఉంటారు. అన్నానికి, మంచినీళ్లకు ఇబ్బంది పడుతూ వాటికోసం ఎదురుచూస్తూ ఉంటారు. కనుక ఆ పదిహేనురోజులు శ్రాద్ధకర్మతో వారికి అన్నోదకాలు కల్పించాలి.
ఆషాఢీ మనధిం కృత్వా పంచమం పక్షమా శ్రితా:|
కాంక్షంతి పితర: అన్నమస్య స్సహం జలమ్||
ఆషాఢ మాసం రెండు పక్షాల నుండి భాద్రపద కృష్ణ పక్షం వరకు గల అయిదు పక్షాలు మన పితృదేవతలు ఎన్నో ఇక్కట్లు పాలగుచుందురట! సూర్యుడు కన్యా,తులారాసుల నుండి వృశ్చిక రాశి వచ్చేవరకు ప్రేతపురి శూన్యంగా ఉంటుందని అందువల్ల ఆ కాలంలో మన పితృదేవతలు అన్నోదకములు కాంక్షిస్తూ భూలోకమున వారివారి గృహముల చుట్టూ ఆత్రుతగా తిరుగుతుంటారని అని భారతం పేర్కొంది. అందుకే మహాలయ పక్షంలో సూర్యుడు కన్యారాశిలో ఉండగా ఒక్క రోజయినా పితృ దేవతలకు పిండ ప్రధానంతో శ్రాద్ధం చేస్తే వారు సంతోషంతో ఆశీర్వదిస్తారు. అష్టమి, ద్వాదశి, అమావాస్య, తిథులలోను, భరణి నక్షత్రం ఉన్ననారు తిథివార నక్షత్ర విచారణ లేకుండా మహాలయ శ్రాద్ధం పెట్టవచ్చునని హేమాద్రి ఖండం చెబుతోంది. అందుకే భాద్రపద కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అనువైనది. సాధారణంగా తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి మహాలయ పక్షంలో తర్పణ, శ్రాద్ధకర్మలు ఆచరిస్తారు. గతించిన వారి తిథి గుర్తు లేనప్పుడు మహాలయ అమావాస్య రోజు పిండ ప్రదానం, తప్పణాలు వదిలి, శ్రాద్ధం ఆచరిస్తారు.
మొత్తం వీలుకాకపోతే మొదటి అయిదురోజులు వదిలి చివరి పదిరోజులు, కుదరకపోతే మొదటి పదిరోజులు వదిలి చివరి అయిదు రోజులు చెయ్యాలి. కనీసం నువ్వులు, నీళ్లు వదిలినా అమావాస్యనాడు మాత్రం తప్పకుండా అన్నశ్రాద్ధం పెట్టితీరాలి. పదిహేను రోజుల్లో ఒక్క రోజయినా శ్రాద్ధం పెట్టాలి. తస్య సంవత్సరం యావత్ సంతృప్తాః పితరోధ్రువమ్ (మహాలయంలో ఒక్కరోజు శ్రాద్ధం పెడితే సంవత్సరం పొడుగునా పెట్టినంతగా పితృదేవతలు సంతృప్తి చెందుతారు). మహాలయ పక్షానికి ఉత్తరకార్తె వస్తుంది. ఆ కార్తెలో పితృయజ్ఞం చేస్తే పితృదేవతలు సంతానాన్ని అనుగ్రహిస్తారు. రవి కన్యారాశిలో ఉండే సమయం ఇది. పార్వణవిధి (అన్నంతో చేసేది)తో చేసే శ్రాద్ధం పితృదేవతల అనుగ్రహంతో ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. మహాలయపక్షంలో సూర్యుడు కన్యారాశిలో ఉండగా ఒక్కరోజయినా పితృదేవతలకు పిండప్రదానంతో శ్రాద్ధం చేస్తే వారు సంతోషంతో ఆశీర్వదిస్తారు. అష్టమి, ద్వాదశి, అమావాస్య తిథులలోను, భరణి నక్షత్రం ఉన్న నాడు తిథివారనక్షత్ర విచారణ లేకుండా మహాలయ శ్రాద్ధం పెట్టవచ్చునని హేమాద్రిఖండం చెబుతోంది
అయోధ్యామధురామాయా కాశీకాంచి అవంతికా |
పూరి ద్వారవ తీచైవ సప్తైతే మోక్షదాయక: ||
పై ఏడు అరణ్యతీర్థాల్లో పితృకార్యాలు చేస్తే పితృదేవతలకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. అక్కడికి వెళ్లలేనివారు కనీసం ఇంటిలో ఈ పై శ్లోకం చదువుతూ కర్మను ఆచరించాలని శాస్త్రవచనం. ఈ మహాలయంలో ఒక విశేషం వారి వారి జ్ఞాతి బంధువలందరికీ అర్ఘ్యాదక, పిండోదకాలు ఉండగలవు. శ్రాద్ధం అంటేనే కృతజ్ఞత ప్రకటించడం. శ్రాద్ధ కర్మల వల్ల పితరులు సంతోషిస్తారు. శ్రాద్ధ కర్తను ఆశీర్వదిస్తారు. పితరులను ఉద్దేశించి అన్నం, పాలు, పెరుగు, నెయ్యి, మొదలైన పదార్థాలతో భోజనం వండి తమ పితరుల పేరిట అర్పించాలి. ఆ సమయంలో ధూపం, దక్షిణాభి ముఖంగా పెట్టాలి. దక్షిణ దిశ పితృదేవతల దిక్కు కావడం దీనికి అర్థం. దేవతలుకాని, పితరులు కాని భోజనం స్థూలంగా గ్రహించరు. కేవలం సారం గ్రహిస్తారు. దేశ, కాల, ప్రాంతీయతలు పరిస్థితులను అనుసరించి పితరులకు శ్రద్ధతో దర్భ, నీరు సమర్పించడమే శ్రాద్ధం. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలేవీ ఆరంభించరు. శ్రాద్ధకర్మల చేత పితృదేవతలకు సంతృప్తి కల్గించిన వ్యక్తికి భౌతికంగా సుఖసంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతి లభిస్తాయని వాయు పురాణం చెబుతోంది.
తండ్రి మరణించిన తిథి నిషిద్ధ దినమైనా ఆరోజు శ్రాద్ధం పెట్టవచ్చు. తిథినాడు కుదరకపోతే అష్టమి ఎవరికైనా పనికి వస్తుంది. కొత్తగా పెళ్లి అయిన వారు కూడా మహాలయంలో పిండ దానం చేయవచ్చునని బృహస్పతి చెప్పాడు. "త్రస్య సంవత్సరం యావత్ సంతృప్తా: పితరో" (ధువమ్) మహాలయంలో ఒక్క రోజు శ్రాద్ధం పెడితే సంవత్సరం పొడువునా పెట్టినంతగా పితృదేవతలు సంతృప్తి చెందుతారట. తండ్రి జీవించి ఉండి తల్లిని కోల్పోయిన వారు ఈ పక్షంలో నవమినాడు 'అవిధవానవమి' పేరుతో తర్పణ, శ్రాద్ధ విధులను ఆచరించవచ్చు. ప్రతీ సంవత్సరం చేసే శ్రాద్ధంకన్నా అతిముఖ్యమైంది ఈ పక్షం. పితరులను తృప్తి పరిచే ఈ కర్మల ద్వారా పితృఋణం తీర్చుకునే అవకాశం ఉంది. స్వర్గస్తులైన మాతాపితరుల కోసం ఈ పక్షంలో పితృకర్మలను ఆచరించాలి.