ఇక్కడి శివుడు ఐరావతేశ్వరుడు
అది తమిళనాడులోని ధరాసురం అనే చిన్న పట్నం. పట్టుమని పాతికవేలు కూడా లేని జనాభా! కానీ ఒకప్పుడు ఈ పట్నం చోళుర రాజధానిగా ఉండేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఆనాటి వైభవానికి, శిల్ప చాతుర్యానికీ సాక్ష్యంగా నిలిచే ఐరావతేశ్వరుని ఆలయాన్ని చూస్తే... ఎంతటివారైనా నోరు వెళ్లబెట్టాల్సిందే!
ఐరావతం- శాపం
దేవేంద్రుని ఏనుగైన ఐరావతం గురించి అందరికీ తెలిసిందే! ఒకసారి దుర్వాస మహర్షికి ఈ ఐరావతం మీద పట్టలేనంత కోపం వచ్చిందట. అంతే! ‘ఏ తెలుపు రంగుని చూసుకుని మురిసిపోతున్నావో, ఏ తెలుపు రంగు కారణంగా ఇతరులకంటే అధికుడినని భావిస్తున్నావో ఆ రంగు మారిపోతుంది,’ అంటూ శపించాడట. ఆ శాపం నుంచి విమోచనం పొందేందుకు ఆ దేవ గజం ఎన్ని చోట్ల తిరిగినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ధరాసురంలోని పరమేశ్వరుని పూజించుకొని, అక్కడ ఉన్న కొలనులో మునగగానే... ఐరావతానికి తన రంగు తిరిగి వచ్చేసింది. ఈ గాథకు ప్రామాణికంగా ఆలయంలో ఇంద్రునితో సహా వేంచేసి ఉన్న ఐరావతం కనిపిస్తుంది. ఆ ఐరావతానికి శాప విమోచనం కలిగించిన కారణంగా ఇక్కడి పరమేశ్వరునికి ‘ఐరావతేశ్వరుడు’ అని పిలవబడుతున్నాడు.
యముడు సైతం:
ఒకసారి యముడు సైతం ఇక్కడి కోనేరులో మునగగానే తన శాపాల నుంచి విముక్తం అయ్యారని చెబుతారు. అప్పటి నుంచీ ఈ కోనేరుని యమతీర్థంగా పిలుచుకుంటున్నారు. 200 అడుగులకు పైనే వెడల్పు ఉండే ఈ కోనేరు, స్వచ్ఛమైన కావేరీ జలాలతో నిండి ఉంటుంది. ఇందులో స్నానం చేసి వచ్చే భక్తులకు గుర్రాలు లాగుతున్న రథం మీద కొలువై ఉన్నట్లుగా కనిపించే ముఖమండపం దర్శనమిస్తుంది. కేవలం ముఖమండపమే కాదు, ఆ ఆలయంలోని ప్రతి అణువులోనూ ఆనాటి శిల్పకళాచాతుర్యం కనిపిస్తుంది. వివిధ దేవతాశిల్పాలు, భరతనాట్య భంగిమలు, పౌరాణిక గాథలకి సంబంధించిన శిల్పాలతో ఆలయం అణువణువూ సజీవమైన సృజనలా తోస్తుంది. ఆలయంలోని శిల్పాలన్నీ ఓ అద్భుతమైతే, ఇక్కడి వినాయకుడి ఉపాలయానికి చేరుకునేందుకు ఉన్న మెట్లని తాకితే సప్తస్వరాలు వినిపించడం మరో అద్భుతం.
వెయ్యేళ్ల చరిత్రకు సాక్ష్యం:
కొన్ని వివరాల ప్రకారం ఈ ఆలయం 1160 నాటికి నిర్మితమైంది. అంటే దాదాపు వెయ్యేళ్లు గడిచిపోయిందన్నమాట. ఈ వెయ్యేళ్ల కాలంలో తమిళనాట ఎందరో రాజులు మారారు. చోళ, పాండ్య, నాయక... వంశాలు ఈ ప్రాంతాన్ని ఏలాయి. అలా వివిధ రాజులకు సంబంధించిన శాసనాలన్నీ ఈ ఆలయంలో భద్రంగా ఉన్నాయి. అవి వివిధ రాజుల పాలనాకాలాన్ని గురించీ, ఆ సమయంలో రాజ్యంలో ఉన్న పరిస్థితుల గురించి వివరిస్తున్నాయి. ఇంత విశేషమైంది కాబట్టే UNESCO ఈ ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. గంగైకొండ చోళేశ్వరాలయం, తంజావూరు బృహదీశ్వరాలయాలతో పాటుగా... ‘Great Living Chola Temples’ పేరుతో వీటికి ప్రాధాన్యతను ఇచ్చింది.
- నిర్జర.