దేవతగా మారిన రాక్షసి - హిడింబి
పాండవులను గుట్టుచప్పుడు కాకుండా మట్టుపెట్టేందుకు దుర్యోధనుడు వారి కోసం ఒక లక్క ఇంటిని నిర్మించిన కథ తెలిసిందే! ఆ లక్క ఇంట్లోంచి ఉన్న సొరంగం గుండా భీముడు తన సోదరులను, తల్లిని ఓ సురక్షిత స్థానానికి చేరుస్తాడు. అక్కడ మొదలవుతుంది హిడింబి కథ!
లక్క ఇంటి నుంచి తప్పించుకుని అరణ్యంలో సేదతీరుతుంటారు పాండవులు. అక్కడికి సమీపంలోనే హిడింబ, హిడింబి అనే అన్నాచెల్లెళ్లు నివసిస్తూ ఉంటారు. రాక్షసులైన ఈ అన్నాచెల్లెళ్ల ముక్కుపుటాలకి నరవాసన తగలగానే జిహ్వచాపల్యం కలుగుతుంది. ఆ నరవాసన ఎక్కడి నుంచి వచ్చిందా అని బయల్దేరిన వారికి అల్లంత దూరంలో గాఢనిద్రలో ఉన్న పాండవులూ, వారికి కాపలాగా ఉన్న భీముడూ కనిపిస్తారు. మంచి కండపట్టి బలిష్టంగా ఉన్న భీముని చూడగానే హిడింబకు ఓ ఆలోచన కలుగుతుంది. అతడిని ఎలాగైనా ఏమార్చి పక్కకు తీసుకువస్తే సుష్టుగా ఆరగించవచ్చని తన సోదరికి సూచిస్తాడు. దాంతో భీముని ఆకర్షించేందుకు హిడింబి అందమైన యువతి రూపంలో భీముని చెంతకు చేరుకుంటుంది.
భీముని మోసం చేయాలనుకున్న హిడింబి ప్రయత్నం ఏమాత్రమూ నెరవేరదు. ఆమెను చూసి భీముడు ఇసుమంతైనా చలించకపోవడంతో... అతని వ్యక్తిత్వం పట్ల నిజంగానే ఆకర్షితురాలవుతుంది హిడింబి. అంతేకాదు! తన నిజస్వరూపాన్ని అతనికి చూపి, నిజాయితీగా తాను వచ్చిన పనిని ఒప్పుకుంటుంది. దాంతో కోపోద్రిక్తుడైన భీముడు, హిడింబి సోదరుని మీదకు యుద్ధానికి వెళ్తాడు. ఆ భీకర యుద్ధంలో హిడింబ చనిపోతాడు. కానీ భీముడి కోపం అంతటితో చల్లారదు. తన సోదరుని చావుకి హిడింబి ప్రతీకారం తీర్చుకుంటుందేమో అన్న అనుమానంతో... హిడింబిని కూడా చంపేందుకు ఉద్యుక్తుడవుతాడు. కానీ ధర్మరాజు అడ్డుకోవడంతో భీముడి కోపానికి అడ్డుకట్ట పడుతుంది.
హిడింబి మనసులో భీముడు నిలిచిపోయాడని కుంతీదేవి గ్రహించి... ఆమెను వివాహం చేసుకోమంటూ భీమునికి సూచిస్తుంది. ఎట్టకేలకు హిడింబిని వివాహం చేసుకునేందుకు భీముడు అంగీకరిస్తాడు. కానీ అందుకో షరతుని కూడా పేర్కొంటాడు. తాను ఎల్లకాలం హిడింబితో కలిసి ఉండలేననీ, వారిద్దరికీ ఓ శిశువు జన్మించగానే అక్కడి నుంచి వెళ్లిపోతానన్నదే ఆ షరతు. దానికి హిడింబి ఒప్పుకోవడంతో వారిరువురి వివాహం జరుగుతుంది. హిడింబికి భీముని ద్వారా అనతికాలంలోనే ఓ శిశువు జన్మిస్తాడు. అతని తల ఘటం (కుండ) ఆకారంలో ఉండటంతో ‘ఘటోత్కచుడు’ అని పేరు పెడతారు. తమ మధ్య ఉన్న షరతు ప్రకారం ఘటోత్కచుడు జన్మించిన తరువాత భీముడు, హిడింబిని విడిచి వెళ్లిపోతాడు.
భీముడు తనని విడిచి వెళ్లిపోయిన తరువాత హిడింబి సుదీర్ఘమైన తపస్సులో మునిగిపోతుంది. ఆ తపస్సుతోనే ఆమె దేవతగా రూపాంతరం చెందిందని నమ్ముతారు. హిడింబిని ఒక దేవతగానూ, ఆటవిక జాతులవారికి ప్రతీకగానూ చాలాచోట్ల పూజిస్తారు. అందుకు సాక్ష్యంగా ఉత్తరభారతంలో హిడింబిని పేర్కొంటూ అనేక స్థలపురాణాలు వినిపిస్తాయి. ఉత్తరాఖండ్‌లోని భీమ్‌తల్ అనే సరస్సు సమీపంలోనే భీమునికీ హిడింబకీ యుద్ధం జరిగిందని చెబుతూ హిడింబి పేరుతో ఉన్న ఓ కొండని చూపిస్తారు. నాగాలాండ్‌లోని అతిపెద్ద పట్నమైన డిమాపూర్ అసలు పేరు ‘హిడింబాపూర్’ అని చెబుతారు. ఇక హిడింబి పేరుతో ఉన్న ఆలయాలు సైతం ఉత్తరాదిలో అక్కడక్కడా కనిపిస్తాయి.
నేపాల్లోని హెటౌడా అనే ఊరిలో హిడింబ ఆలయాన్ని చూడవచ్చు. ఇక్కడ ఆమెను భూతన్‌దేవి అన్న పేరుతో కొలుచుకుంటారు. గుజరాత్‌లో లావణ అనే గ్రామంలో హిడింబి కుండం, హిడింబి ఆలయాలు కలిగిన ఓ వనం కనిపిస్తుంది. ఆ వనం యావత్తుకీ హిడింబి వనం అని పేరు. ఇక మన దేశంలోనే అతి ప్రసిద్ధమైన హిడింబి ఆలయం కులుమనాలిలో ఉంది. దేవదారు వృక్షాల నడుమ వందల ఏళ్ల క్రితం కట్టబడిన ఈ ఆలయాన్ని దర్శించేందుకు వేలాదిమంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయానికి సమీపంలోనే ఘటోత్కచునికి కూడా ఓ ఆలయం కనిపిస్తుంది. విచక్షణని అనుసరించి నడుచుకుంటే రాక్షసులు సైతం దేవతలుగా మారతారని హిడింబి ఉదంతం మనకు సూచిస్తోంది.
- నిర్జర.