గంగను దివి నుండి భువికి తెచ్చిన
భగీరథుడు
Bhageeratha – Ganges River
భగీరథుడు మహా జ్ఞాని. పరోపకారానికి పెట్టింది పేరు. దీక్షకు, సహనానికి ప్రతిరూపం. ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా, అనుకున్నది సాధించేవారిని భగీరథునితో పోలుస్తారు. ఎవరైనా కఠోర పరిశ్రమ చేసి దేన్నయినా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని చెప్పుకుంటాం. కారణం భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భువికి తీసుకొచ్చాడు. అసలు భగీరథుడు గంగను ఆకాశం నుండి ఎందుకు తీసుకురావలసివచ్చిందో, దాని వెనుక ఎంత కఠోర శ్రమ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
సగర చక్రవర్తికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు అసమంజుడు జన్మించాడు. చిన్న భార్యకి అరవైవేలమంది కొడుకులు పుట్టారు. అసమంజుని కొడుకు అంశుమంతుడు.
సగరుడు 99 అశ్వమేధ యాగాలు పూర్తయి, నూరవ యాగం నిర్వహిస్తున్నాడు. నూరు యాగాలు పూర్తిచేసినవారు దేవలోకానికి రాజయ్యే అర్హత పొందుతారు. అందుకే ఎవరు నూరు యాగాలు పూర్తి చేయబోతున్నారు అని తెలిసినా ఇంద్రుడికి తన పదవి ఎక్కడ పోతుందో అని భయం. అందుకే సగరుని నూరవ యాగం సక్రమంగా పూర్తి కాకుండా చేయాలనుకున్నాడు. యాగాశ్వాన్ని పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి దగ్గర కట్టేశాడు.
సగరుని కొడుకులు యాగాశ్వాన్ని వెతుక్కుంటూ బయల్దేరారు. చివరికి పాతాళంలో దొరికింది. కపిల మహర్షే దాన్ని తనవద్ద కట్టేసుకున్నాడని అపోహపడ్డారు. ఆ మహామునితో అసభ్యంగా మాట్లాడారు. ఆ అరుపులకు కపిలమహర్షి తపస్సుకు భంగం కలిగింది. ఆయన కోపంగా కళ్ళు తెరిచేసరికి ఆ కళ్ళలోంచి అగ్నిజ్వాలలు వచ్చాయి. అవి సగరపుత్రులను భస్మం చేశాయి.
యాగాశ్వం కోసం వెళ్ళిన కొడుకులు ఎంతకూ తిరిగిరాకపోవడంతో మనుమడు అంశుమంతుని పంపాడు. అంశుమంతుడు పాతాళంలో చితాభస్మపు గుట్టను చూసి బాధపడ్డాడు. వారి ఆత్మలను ఊర్ధ్వ లోకాలకు పంపాలని ఉదకం చిలకరించబోతోంటే అశరీరవాణి ''అంశుమంతా, మామూలు జలంతో వారి ఆత్మలు ఊర్ధ్వ లోకాలు చేరవు. పవిత్ర గంగాజలంతో మాత్రమే సద్గతి పొందుతారు'' అంటూ పలికింది.
అంశుమంతుడు నిట్టూర్చి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
సగరుని తర్వాత అంశుమంతుడు రాజయ్యాడు. తర్వాత దిలీపుడు రాజ్యాన్ని పాలించాడు. దిలీపుడు మరణించడంతో అతని కొడుకు భగీరథుడు పిన్న వయసులోనే రాజయ్యాడు. అప్పటివరకూ భస్మం అయిన రాజకుమారులకు సద్గతి కలగలేదు.
చిన్నవాడైన భగీరథుడు తల్లి చెప్పగా విషయం తెలుసుకున్నాడు. పవిత్ర ఆకాశగంగను భువికి తెస్తానని తల్లితో చెప్పాడు. వెంటనే బ్రహ్మదేవుని తలచుకుంటూ కఠోర తపస్సు చేశాడు.
బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భగీరథా, నీ కఠోర దీక్ష అమోఘం. నీ కోరిక నెరవేరుతుంది. అయితే, ఆకాశం నుండి మహోధ్రుతంగా కిందికి దూకుతుంది గనుక అది తిన్నగా భూమ్మీద పడితే కష్టం.. పరమేశ్వరుని ప్రసన్నం చేసుకో, అప్పుడే ఆకాశగంగను నియంత్రించడం సాధ్యమౌతుంది..'' అన్నాడు.
భగీరథుడు మరోసారి శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడై భువి నుండి దివికి ఉరుకుతున్న సురగంగకు తన జటాజూటాన్ని ఆధారంగా చేశాడు. దాంతో ఆకాశగంగ శివగంగగా మారి, అక్కణ్ణించి భువికి దూకింది. భగీరథుని వెంట పరుగులు తీసి ''భాగీరథి'' అయింది. జహ్నుముని ఆశ్రమంలో చిందులు వేసింది.
అది చూసిన జహ్నుముని గంగను అమాంతం తాగేశాడు. అది చూసి కలవరపడిన భగీరథుడు ''గంగను వదలమని'' ప్రాధేయపడగా జహ్నుముని చెవిలోంచి వదిలాడు. అందుకే గంగను ''జాహ్నవి'' అంటారు. అక్కణ్ణించి మళ్ళీ భగీరథుని వెంట పరుగులు తీసి పాతాళం చేరి ''పాతాళగంగ'' అయింది.
ఆవిధంగా భగీరథుని మహా దీక్షతో గంగానది, పాతాళం చేరి సగరపుత్రుల చితాభస్మంమీద ప్రవహించి వారికి సద్గతులు కలిగించింది.
Bhageeratha maharshi, Bhagiratha and Sagara, Sagara 99 Aswamethayagas, bhagirathi and mahashiva, Bhageerath and Ganges River