పేరు లేని అపూర్వ పాత్ర

Great Lady: Nigama Sarma's Sister

 

మనందరికీ ఏదో ఒక పేరు ఉంటుంది. అది ఉనికిని తెలియజేస్తుంది. కథల్లోనూ అంతే. ప్రతి పాత్రకీ ఒక పేరు ఉంటుంది. కానీ మన పురాణ కథలో ఒక ముఖ్యమైన పాత్రకి.. ప్రేమ, అభిమానం, ఔన్నత్యం, ఔదార్యం, తెలివి, వివేకం, బాధ్యత, కర్తవ్యం - ఇలా అనేక సుగుణాలు కలగలసి రూపుదాల్చిన ఒక చక్కటి పాత్రకి ఎందుకో పేరులేదు. ఆమె ఎవరో తెలియాలంటే ఈ కథ చదవండి...

 

నిగమశర్మ గొప్ప పండితుడు. అయితేనేం, బలహీనతల పుట్ట. దాంతో అనేక దుర్వ్యసనాలకు లోనయ్యాడు. జపతపాలు, పూజాపునస్కారాలు మానేశాడు. ఆఖరికి వేశ్యా గృహాలకు వెళ్లడం కూడా అలవాటు చేసుకున్నాడు. తన పరువు పోగొట్టుకోవడమే గాక కుటుంబ ప్రతిష్ట మంటకలిపాడు. ఆస్తులన్నీ కర్పూర హారతిలా కరిగిపోయాయి. ఉన్న ధనమంతా దుర్వినియోగం చేసి చివరికి అప్పులపాలయ్యాడు.

 

ఇంటి పరువు గంగపాలు చేసి, హీనంగా తిరుగుతున్న నిగమశర్మను చూసి తల్లిదండ్రులు, భార్య కుమిలిపోతున్నారు. పరిస్థితి విషమించడంతో నిగమశర్మ తల్లిదండ్రులు, సహనవంతురాలు, మంచి మాటకారి అయిన తమ కూతురికి కబురు చేశారు. దాంతో నిగమశర్మ సోదరి, భర్త, పిల్లలను వెంటబెట్టుకుని పుట్టింటికి వచ్చింది. ఆమె ఎలాగైనా తమ్ముడికి నచ్చజెప్పాలని, అతని దురలవాట్లు మానిపించి, మంచి దారిలో పెట్టాలని నిశ్చయించుకుంది. మెల్లగా నచ్చజేపితే వింటాడని, తమ్ముడు బాగుపడితే అమ్మానాన్నలు సంతోషిస్తారని, మరదలు మరింత ఆనందిస్తుందని అనుకుంది.

 

నిగమశర్మ అక్క తమ్ముడి రాక కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. బలహీనతల పుట్ట నిగమశర్మ డబ్బు తీసుకుపోదామని ఇంటికి వచ్చాడు. తండ్రి మాదిరిగానే పండితుడైన తమ్ముడు నిగమశర్మ అందరిచేతా "ఆహా" అనిపించుకోవాల్సింది పోయి, "ఛీఛీ" అనిపించుకునే స్థితిలో ఉండటం దయనీయంగా అనిపించింది. మనసంతా మెలిపెట్టినట్లయింది. క్షణంలో కన్నీళ్లు ఉబికాయి. కానీ వెంటనే నోరు మెదపలేదు.

 

నిగమశర్మ అక్క మరదలికి భోజనం పెట్టమని సైగ చేసింది. మరదలు వెంటనే వెళ్ళి, భర్తను కాళ్ళు కడుక్కోమని నీళ్ళు అందించి, భోజనం వడ్డించింది. తాంబూలం కూడా ఇచ్చింది. అప్పటివరకూ మౌనం వహించిన నిగమశర్మ అక్క "బాబూ, నిగమా! ఈ వయసులో అమ్మానాన్నల్ని సుఖ పెట్టాల్సిన బాధ్యత నీదే. నీ భార్య నీమీదే ఆధారపడి ఉంది. అక్కచెల్లెళ్ళమైన మేం కూడా నువ్వు మాకు కష్టంలో సుఖంలో అండగా ఉంటావని గంపెడు ఆశతో ఉన్నాం. అలాంటిది మా ఆశలన్నీ అడియాసలు చేస్తావా?

 

''నాకు నీ పాండిత్యం మీద గొప్ప గౌరవం. నువ్వు నలుగిరిలో గౌరవంగా తిరుగుతుంటే, కీర్తిప్రతిష్టలు సంపాదిస్తే, అదంతా మా అత్తగారింట్లో చెప్పుకోవాలని ఆశగా ఉంది. కుటుంబ గౌరవాన్ని పెంచుతావని, నీ ఘనత చూసి మురిసిపోవాలని తపిస్తున్నాను..." అంటూ ఎంతో సహనంగా ఎన్నో ఉదాహరణలతో చెప్పింది.

 

కానీ నిగమశర్మ సోదరి మాటలన్నీ చెవిటివాడి ముందు శంఖం ఊదిన చందమే అయ్యాయి. ఆమె ఉపదేశాలు నిరర్ధకం అయ్యాయి.

 

నిగమశర్మ, తన అక్క మాటలు లక్ష్యపెట్టకపోగా, ఇంట్లో ధనాన్ని దోచుకుపోయాడు. ఇంకా విషాదం ఏమిటంటే సోదరి పుట్టింటికి వచ్చిందని, అత్తగారి ఇంట్లో ఆమె పరువు పోతుందని కూడా ఆలోచించకుండా ఆమె నగలు కూడా ఎత్తుకుపోయాడు.

 

నిగమశర్మ అక్క, తల్లిదండ్రులు, భార్య అందరూ బాధపడ్డారు. అతను జీవితంలో ఎన్నడూ మారలేదు. ఇంట్లో భార్య ఉండగానే మరో స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. తల్లిదండ్రులు, ఇద్దరు భార్యలు కూడా నిగమశర్మ వల్ల నరకయాతన అనుభవించారు.

 

అలా వ్యసనాల పాలై, హీన అవస్థలో పడ్డ నిగమశర్మ చివరికి పండరీపురం, నృసింహ క్షేత్రంలో అంతేహీనమైన చావును కొనితెచ్చుకున్నాడు.

 

వ్యసనం అనేది మనిషిని ఎంతగా దిగజారుస్తుందో నిగమశర్మ కథలో అరటిపండు ఒలిచి నోటికి అందించినంత చక్కగా చెప్పారు. తమ్ముడికి హితవు చెప్పే నిగమశర్మ అక్క పాత్రను అణకువ, ఆలోచన గల ఉదాత్త, ఉన్నత స్త్రీగా, గొప్పగా మలచారు. కానీ చిత్రం ఏమిటంటే ఆమెను నిగమశర్మ అక్కగా పరిచయం చేశారే తప్ప, ఆమెకంటూ ఒక పేరు పెట్టలేదు కవిగారు.

 

the story of nigama sarma, indian mythology and nigama sarma, hindu mythological character Nigama Sarma's Sister, nigama sarma in nrusimha kshetra, nigama sarma and his sister


More Purana Patralu - Mythological Stories