బలిచక్రవర్తి
Bali Chakravarti
బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవడు, దేవాంబ, విరోచనుల తనయుడు. ఇతని భార్య ఆశన. రాక్షసుడైనప్పటికీ ఇతనిలో ఎన్నో సుగుణాలునాయి. స్వర్గం మీద దండెత్తి ఇంద్రుని ఓడించి, స్వర్గాధిపత్యం సంపాదిస్తాడు. ఒకసారి ప్రహ్లాదునితో మాట్లాడుతూ, విష్ణుమూర్తిని తూలనాడడంతో ప్రహ్లాదునికి కోపం వచ్చి, శ్రీహరి వల్లే నీ పదవి పోతుందని శపిస్తాడు. తుదకు బలిచక్రవర్తి మూడు లోకాలను ఆక్రమించుకున్నప్పుడు విష్ణుమూర్తి వామనుడిగా అవతారమెత్తి, యజ్ఞం చేస్తున్న బలిచక్రవర్తి వద్దకు వచ్చి, మూడు అడుగుల నేలను దానం కోరతాడు.
వచ్చింది శ్రీహరే అని గ్రహించిన రాక్షస గురువు శుక్రాచార్యుడు, బలిచక్రవర్తి దానమివ్వకుండా కమండలం నుంచి కారుతున్న నీటి ధారకు అడ్డం పడగా, వామనుడు దర్భతో కమండలం కొమ్ములో పొడుస్తాడు. ఆ దర్భ తగిలి శుక్రాచార్యునికి ఒక కన్ను పోతుంది. తుదకు వామనుడు ఒక అడుగుతో నేలను, మరొక అడుగుతో ఆకాశాన్ని ఆక్రమించి, మూడవ అడుగు కోసం చోటు చూపమని బలిచక్రవర్తిని కోరగా, బలిచక్రవర్తి శిరస్సు చూపుతాడు. మూడవ అడుగు అక్కడ మోపి, బలిచక్రవర్తిని పాతాళానికి పంపుతాడు.



