ముగ్గురు ఆళ్వారులూ – భగవంతుని కలుసుకున్నారు!

 

విష్ణుసేవలో తరించేందుకు, ఆ విష్ణు భక్తిని ఇలలో ప్రచారం చేసేందుకు జన్మించిన గొప్ప భక్తులు ఆళ్వారులు. వీరందరూ భగవంతుని మీద సృజించిన పద్యాలను ‘నాలాయిర దివ్య ప్రబంధం’ పేర సంకలనం చేశారు. నాలాయిరం అంటే తమిళంలో 4,000 అని అర్థం. ఈ సంకలనంలో 4,000 పద్యాలు ఉన్నాయి కాబట్టి ఆ పేరు! ఇక ఈ సంకలనంలో 108 వైష్ణవక్షేత్రాలను పేర్కొన్నారు. ఈ 108 వైష్ణవక్షేత్రాలను ‘దివ్యదేశాలు’గా పిలుస్తారు. వీరిలో తొలిముగ్గురి గురించిన విశేషాలు…

ఈ ఆళ్వారులలో తొలివాడు ‘పొయ్‌గయ్‌ ఆళ్వార్‌’! పొయ్‌గయ్‌ ఆళ్వార్‌ కంచిలోని తిరువెక్క అనే ఆలయంలో జన్మించారట. తిరువెక్క ఆలయం కంచిలోని పురాతన ఆలయాలలోనే ఒకటి. ఆ ఆలయం ప్రాంగణంలోని ఒక కొలనులోని తామరపూవు మీద పొయ్‌గయ్‌ ఆశ్వార్‌ దర్శనమిచ్చారు. తమిళంలో కొలనుని పొయ్‌గయ్‌ అంటారు కాబట్టి, ఆయనకు ఆ పేరు వచ్చింది. శ్రవణా నక్షత్రాన పుట్టిన పొయ్‌గయ్‌ ఆళ్వార్‌ సాక్షాత్తూ విష్ణుమూర్తి పాంచజన్యం (శంఖం) యొక్క అవతారమని భక్తుల నమ్మకం. పొయ్‌గయ్‌ చిన్ననాటి నుంచే వైష్ణవ సంప్రదాయం పట్ల ఆకర్షితుడయ్యాడు. కనులు మూసినా, తెరచినా అతని మదిలో విష్ణురూపమే గోచరించేది. నిరంతరం నారాయణ మంత్రమే ఆయన నోట నిలిచేది. చరిత్రకారులు పొయ్‌గయ్‌ ఆళ్వారు క్రీ.శ.7వ శతాబ్దంలో జీవించారని చెబుతున్నప్పటికీ, భక్తుల విశ్వాసం ప్రకారం వీరు క్రీ.పూ నాలుగువేల సంవత్సరాల పూర్వమే కంచిలో సంచరించారు.

ఆళ్వారులలో మరో ఇద్దరైన భూతనాధాళ్వార్‌, పేయాళ్వార్లు కూడా పొయ్‌గయ్‌ సమకాలికులే. భూతనాథాళ్వార్‌ మహాబలిపురంలోని ‘తిరుకడల్మలై’ అనే ఆలయంలో శిశువుగా దర్శనమిచ్చారు. ఇక పేయాళ్వారు జననం కూడా ఇలాంటిదే. మైలాపురంలోని ‘ఆదికేశవ పెరుమాళ్‌’ ఆలయంలోని ఒక కలువపూవులో శిశువుగా పేయాళ్వారు ఉద్భవించారు. తమిళంలో దెయ్యం పట్టినవాడిని ‘పెయ్‌’ అంటారు. భగవన్నామస్మరణలో ఉన్నత్తునిగా సంచరించేవాడు కాబట్టి ఈయనకు ఈ పేరు స్థిరపడిపోయింది. ఒకే సమయంలో జీవించిన ఈ ముగ్గురు ఆళ్వారులనూ ముదలాళ్వారులని పిలుస్తారు. అంటే తొలి ఆళ్వారులు అని అర్థం. విచిత్రంగా సమకాలీనులైన ఈ ముగ్గురూ కలుసుకున్న ఓ సందర్భం కూడా ఏర్పడింది. తమిళనాట విల్లిపురానికి దగ్గరలో ఉన్న తిరుకోయిలూర్‌ అనే వైష్ణవక్షేత్రంలో ఈ ముగ్గురూ ఓసారి తారసపడ్డారట. అదెలా జరిగిందంటే…

తిరుకోయిలూర్‌లో ఒక రోజు జోరున వర్షం కురుస్తోంది. పట్టపగలే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. అలాంటి సమయంలో నిలువనీడ కోసం వెతుకుతున్న పొయ్‌గయ్‌ ఆళ్వారుకి ఓ చిన్న గది కనిపించింది. వర్షం వెలిసేదాకా అక్కడ విశ్రమిద్దామనుకుని నడుం వాల్చాడు పొయ్‌గయ్‌. ఇంతలో వర్షం తాకిడికి అటూ ఇటూ తిరుగుతున్న భూతనాథాళ్వార్‌ కూడా అక్కడికే చేరుకున్నారు. ‘అయ్యా! లోపల నాకు కూడా చోటు ఉందా!’ అని అడిగారు భూతనాథాళ్వార్‌. ‘నేను లేచి కూర్చుంటే మరొకరు కూడా కూర్చునేంత చోటు ఉంటుంది. తప్పకుండా లోపలికి దయచేయండి’ అని ఆహ్వానించారు పొయ్‌గయ్‌ ఆళ్వారు.

అదే సమయంలో ఆ పట్నంలో తిరుగుతున్న పేయాళ్వారు కూడా ఆ చోటకి చేరుకున్నారు. ‘అయ్యా లోపల తలదాచుకునేందుకు చోటు ఉందా!’ అని అడిగారట పేయాళ్వారు. ‘మేమిద్దం నిల్చొంటే, మరో మనిషి కూడా నిలబడేంత స్థలం ఉంటుంది. తప్పకుండా లోపలకి దయచేయండి’ అన్నారట లోపల ఉన్న ఆళ్వారులు. చిత్రం ఏమిటంటే వీరిలో ప్రతి ఒక్కరికీ మిగతా ఇద్దరూ ఫలానావారన్న విషయం తెలియదు. ఈ ముగ్గురు ఆళ్వారులూ ఒకచోటకి చేరుకున్న సందర్భానికి సంతసించిన విష్ణుమూర్తి, తాను కూడా అక్కడికి చేరుకున్నాడట. ఆ గదిలో తాము ముగ్గురమే కాకుండా మరో దివ్యమూర్తి కూడా ఉన్నాడన్న విషయాన్ని గ్రహించనే గ్రహించారు పొయ్‌గయ్‌ ఆళ్వారు. వెనువెంటనే ఆ దివ్యమూర్తి దర్శనం కొరకు నూరు పాశరాలను ఆశువుగా పాడారు, ఆ వెనువెంటనే భూతనాథాళ్వార్‌ మరో వంద పాశురాలను ఆశువుగా ఆలపించారు. అప్పుడు వారి భక్తికి మెచ్చి దర్శనమిచ్చిన విష్ణుభగవానుని స్తుతిస్తూ పేయాళ్వారు మరో వంద పాశురాలతో స్వామిని స్తుతించారు. ఈ మూడు వందల పాశురాలనూ భక్తి సాహిత్యంలో అత్యద్భుత రచనలుగా భావిస్తారు. అలా విధి వారి ముగ్గరినీ ఒకేచోటకి చేర్చగా, ఆ విధిని పాలించే విష్ణుమూర్తి వారిపై తన అపారమైన దయని చూపాడు.

- నిర్జర.

 


More Vyasalu