హరిశ్చంద్రుడు ఆచరించిన అజైకాదశి

 

హిందూ సంప్రదాయంలో ఏకాదశి వ్రతానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అందరికీ తెలసిందే! క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ప్రతి ఏకాదశి గురించీ స్వయంగా ఆ శ్రీకృష్ణుడే, ధర్మరాజుకి బోధించాడు. ఏకాదశుల మహిమ గురించి కృష్ణుడు, యుధిష్ఠిరునితో జరిపిన సంవాదం అంతా బ్రహ్మవైవర్త పురాణంలో కనిపిస్తుంది. అలా శ్రావణమాసంలోని బహుళపక్షంలో వచ్చే ‘అజైకాదశి’ విశేషం ఇదిగో...


సత్యానికి కట్టుబడిన హరిశ్చంద్రుని కథ అందరికీ తెలిసిందే కదా! హరిశ్చంద్రుని సత్యసంధతను పరీక్షించేందుకు విశ్వామిత్రుడు అతడిని రాజ్యం యావత్తునీ దానం రూపంలో స్వీకరించేస్తాడు. అతని భార్య చంద్రమతినీ, కుమారుడు లోహితాస్యుడినీ హరిశ్చంద్రుని నుంచి దూరం చేస్తాడు. చివరికి ఓ చండాలుని దగ్గర అతను ఊడిగం చేసే స్థితికి తీసుకువస్తాడు. తన సర్వస్వాన్నీ కోల్పోయినా కూడా హరిశ్చంద్రుడు సత్యనిష్టకు మాత్రం కట్టుబడే ఉంటాడు.


ఒకనాడు తన భార్యాపిల్లలను కోల్పోయిన బాధలో హరిశ్చంద్రుడు బాధపడుతుండగా, అతనికి గౌతమ మహర్షి కనిపించాడు. ఆ రుషి వద్ద తన గోడునంతా వెళ్లబోసుకున్నాడు హరిశ్చంద్రుడు. దానికి గౌతమ మహర్షి ‘రాజా! మరేమీ చింతించాల్సిన పనిలేదు. నీ అదృష్టవశాత్తూ మరో ఏడు రోజులలో అజైకాదశి వస్తోంది. ఆ రోజు కనుక నువ్వు ఉపవాసం ఉండి, రాత్రివేళ జాగారం చేస్తే నీ దుఃఖమంతా తీరిపోతుంది. నీ భార్యబిడ్డలు నిన్ను చేరుకుంటారు,’ అని సూచించాడు.


గౌతమ మహర్షి చెప్పినట్లుగానే హరిశ్చంద్రుడు అజైకాదశి రోజున ఉపవాసం ఉండి, ఆ రాత్రి జాగరణ చేయగా... అతని భార్యాపిల్లలని కలుసుకోగలిగాడు. అజైకాదశి వల్ల కోరుకున్న కోరికలు తీరిపోవడమే కాదు, గత పాపాలన్నీ నశించిపోతాయని చెబుతారు. కర్మఫలాలన్నీ దహించుకుపోయి, మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అశ్వమేధయాగం చేస్తే ఎంత పుణ్యం లభిస్తుందో, అజైకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అంతే పుణ్యం లభిస్తుందని సాక్షాత్తు ఆ కృష్ణభగవానుడే పేర్కొన్నాడు.


మిగతా ఏకాదశులని ఎలా ఆచరిస్తామో... అజైకాదశిని కూడా అలాగే ఆచరించాలి. దశమినాటి రాత్రి నుంచే ఉపవాస వ్రతం ఆరంభించడం. ఏకాదశి రోజున నిరాహారంగా ఉండి, భగవంతుని ధ్యానంలో గడపడం. ఏకాదశి రాత్రివేళ భగవన్నామ స్మరణ చేస్తూ జాగరణ చేయడం, ద్వాదశి రోజున మితాహారం తీసుకుని ఉపవాసాన్ని విరమించడం.... ఈ విధంగా అజైకాదశిని పూర్తిచేయాలి. ఈ ఏడాది ఆగస్టు 18న ఈ అజైకాదశి వచ్చింది.


 

- నిర్జర.


More Vyasalu