'వకీల్ సాబ్' ప్రమోషన్లో పాల్గొంటాడా?
on Jun 6, 2020
ఎప్పుడు థియేటర్లు తెరుచుకుంటాయా.. ఎప్పుడు తమ సినిమాల్ని రిలీజ్ చేద్దామా.. అని టాలీవుడ్ ప్రొడ్యూసర్లు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. లాక్డౌన్ ఎత్తేసినా షూటింగ్‌లకు గవర్నమెంట్ అనుమతి లభించకపోవడంతో షూటింగ్ లాస్ట్ స్టేజ్‌లో ఉన్న సినిమాల నిర్మాతలు.. ఎప్పుడు ఆ అనుమతులు వస్తాయా అని చకోర పక్షుల్లా వెయిట్ చేస్తున్నారు. ఇవాళ టాలీవుడ్లో రిలీజ్‌కు దగ్గరగా ఉన్న భారీ సినిమాల్లో మొదటి స్థానం పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర చేస్తోన్న 'వకీల్ సాబ్'. బాలీవుడ్ ఫిల్మ్ పింక్ రీమేక్ అయిన ఈ సినిమాకు సంబంధించి చివరి షెడ్యూల్ షూటింగ్ మాత్రమే మిగిలుంది. నిజానికి ఈ మూవీని మే 15న రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించారు. కానీ. కరోనా వైరస్ దెబ్బకు షూటింగ్ నిలిచిపోవడంతో సినిమాకు సంబంధించిన అన్ని ప్లాన్లూ తలకిందులయ్యాయి. కరోనా ముందు ఎంతటి స్టార్ అయినా తలొగ్గాల్సిందేననే విషయం రూఢి అయిపోయింది.
షూటింగ్‌లకు గ్రీన్ సిగ్నల్ వచ్చాక కూడా నియమ నిబంధనలు అమల్లో ఉంటాయి కాబట్టి 'వకీల్ సాబ్' షూటింగ్ ఎప్పటికి ఫినిష్ అవుతుందనేది తెలీని పరిస్థితి. ఇప్పటికైతే దసరా పండగకి ఈ మూవీని రిలీజ్ చేయాలని దిల్ రాజు క్యాంప్ భావిస్తున్నట్లు సమాచారం. ఆయన అనుకున్న విధంగానే సినిమా రిలీజ్ కావచ్చు కానీ, దాని ప్రమోషన్లో పవర్‌స్టార్ పార్టిసిపేట్ చేస్తాడా?.. అనే సందేహం తలెత్తుతోంది. కరోనా బయట ఉంది కాబట్టి మనం ఇంట్లో సురక్షితంగా ఉందామని చెబుతూ వస్తున్న పవన్.. ఇప్పుడు 'వకీల్ సాబ్' చూడ్డానికి థియేటర్లకు వెళ్లమని ప్రేక్షకుల్ని కోరతాడా?.. అనేది ప్రశ్న. ఈ ఏడాది చివరి నాటికి కూడా కరోనా ప్రభావం ఉంటుందని నిపుణులందరూ చెబుతున్నారు. పవన్ కల్యాణ్ సినిమాకు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. ఆయన సినిమా రిలీజైతే ఫ్యాన్స్ సామాజిక దూరం పాటిస్తూ సినిమా చూస్తారని అనుకోవడం అవివేకం అవుతుంది. అలాంటప్పుడు సోషల్ డిస్టాన్సింగ్ పాటిస్తూ సినిమా చూడండని పవన్ చెబుతాడా?
పైగా కరోనా నేపథ్యంలో థియేటర్లను ఫుల్ కెపాసిటీతో గవర్నమెంట్లు అనుమతించే పరిస్థితి ఉండదు. ఇప్పుడున్న సీట్లలో 50 శాతం సీట్లనైనా అనుమతిస్తారా.. అనేది అనుమానమే. దీంతో సినిమాల వసూళ్లు బాగా పడిపోనున్నాయి. ఈ గడ్డుకాలాన్ని 'వకీల్ సాబ్' ఎలా ఎదుర్కొంటాడో చూడాల్సిందే.