బాహుబలికి అది సాధ్యమేనా??
on May 26, 2015
అందరినోటా.. బాహుబలి మాటే. బాహుబలి ఈ రికార్డుని బ్రేక్ చేసిందట, ఆ రికార్డుని బ్రేక్ చేస్తుందట.... అంటూ తెగ మాట్లాడుకొంటున్నారు. ఆడియో రైట్స్, ఆడియో ఫంక్షన్ ప్రసార హక్కులు భారీ రేట్లకు అమ్ముడుపోయాయి. అన్ని ఏరియాల నుంచీ ఫ్యాన్సీ రేట్లకు ఈ సినిమాని కొనడానికి బయ్యర్లు ముందుకొస్తున్నారు. ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందన్న విషయంపై పందేలు కూడా మొదలైపోయాయి. రూ.100 కోట్ల నుంచి 130 కొట్లలోపు బాహుబలి వసూలు చేయొచ్చని ప్రభాస్ అభిమానులు లెక్కలు వేస్తున్నారు. అదే నిజమైతే.. దక్షిణాది రికార్డులన్నీ బాహుబలి బద్దలు కొట్టేసినట్టే. దానికి తోడు.. ఇప్పుడు బాహుబలి టీమ్ ఓ సరికొత్త పథకం రచిస్తోంది. బాహుబలి విడుదలైన తొలి మూడు రోజులూ... టికెట్ల రేట్లు పెంచుకొనే సౌలభ్యం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పుడైతే రూ.75 , రూ.40 రూ.20 రేట్లు నడుస్తున్నాయి. మల్టీప్లెక్స్‌లో రూ.150 ఫిక్స్‌డ్ రేటు. మల్టీప్లెక్స్‌వదిలేసి సింగిల్ థియేటర్లలో టికెట్టు రేటు మినిమం రూ.100 చేస్తే.. వసూళ్లు కుమ్మేసుకోవచ్చన్నది రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్. తొలి మూడు రోజులూ ఏ టికెట్టయినా రూ.100 అంటే.. వారాంతంలోనే రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టుకోవచ్చు. దాంతో గళ్లాపెట్టెలు నింపేసుకోవచ్చన్నది ప్లాన్. అయితే... టికెట్లు రేటు పెంచుకోవాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు బాహుబలి రేటు పెంచేతే.. రేపొద్దిట ఇలానే పెద్ద సినిమాలన్నీ టికెట్టు రేటు పెంచుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇప్పటికే.. జనాలు థియేటర్లకు రావడం లేదు. సినిమా ఎంత బాగున్నా టాక్ కనుక్కొని థియేటర్లో అడుగుపెడుతున్నారు. అలాంటిది రేట్లు పెంచేస్తే.. ఎలా..? అన్నది విశ్లేషకుల ప్రశ్న. అయితే రికార్డులను కొల్లగొట్టడమే ధ్యేయం పెట్టుకొన్న బాహుబలి టీమ్ మాత్రం టికెట్టు రేటు పెంచడానికి తీసుకోవాల్సిన అనుమతుల విషయంలో దృష్టిసారించింది. మరి అది బాహుబలికి సాధ్యమా, కాదా అన్నది కాలమే తేల్చి చెప్పాలి.