బన్నీకి భయపడిన కమల్
on Mar 31, 2015
అల్లు అర్జున్‌కీ - కమల్‌హాసన్‌కీ పోలిక ఏంటి..? ఎవరి సినిమాలు వాళ్లవే. కమల్ క్రేజ్ పక్కన బన్నీ ఎంత? ఇలాంటి ప్రశ్నలు కాసేపు పక్కన పెట్టేద్దాం. సినిమా మార్కెట్, ప్రస్తుతం ఉన్న సమీకరణలు ఆలోచిస్తే సన్నాఫ్ సత్యమూర్తి సినిమాకి ఎవ్వరైనా భయపడాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాకున్న క్రేజ్ అలాంటిది. త్రివిక్రమ్ - అల్లు అర్జున్‌ల కాంబినేషన్‌లో జులాయి తరవాత వస్తున్నచిత్రమిది. ఇంతకు ముందే.. టాలీవుడ్‌కి త్రివిక్రమ్ రూ.100 కోట్ల సినిమా అందించారు. అందుకే సత్యమూర్తిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాపై పోటీకి దిగడానికి కమల్ లాంటివాడే భయపడ్డాడు. కమల్ నటించిన తాజా చిత్రం `ఉత్తమ విలన్`. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. అన్ని కార్యక్రమాలూ పూర్తయ్యాయి కూడా. అయితే ఇప్పుడు ఉత్తమ విలన్‌ని వాయిదా వేశారు. దానికి కారణం.. సత్యమూర్తి విడుదల 9న అని డిక్లేర్ చేయడమే. ఉత్తమ విలన్ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఓకేసారి విడుదల చేయాలన్నది కమల్ ప్లాన్. 10న అయితే తమిళంలో కమల్‌కి పోటీ లేదు. కానీ తెలుగులో కావల్సిన స్థాయిలో థియేటర్లు దొరకవు. అందుకే.. తన సినిమాని వాయిదా వేసుకొన్నాడు కమల్. ఉత్తమ విలన్ విడుదల తేదీ ఎప్పుడో తరవాత ప్రకటిస్తారట. సన్నాఫ్ సత్యమూర్తి క్రేజ్ అలాంటిది మరి..!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
