సినిమాపై సెటైర్లు.. ఇదేనా ఇప్పటి ట్రెండ్??
on Apr 27, 2015
సినీకళామతల్లి ముద్దు బిడ్డలం అని చెప్పుకొంటుంటారు సినిమా వాళ్లు. ఇక్కడే పేరూ, కీర్తి దక్కింది కాబట్టి, అభిమానం అనే ఆస్తి ఇక్కడే సంపాదించుకొన్నారు కాబట్టి ఆ మాత్రం ప్రేమ, వాత్స్యల్యం ఉండాల్సిందే. ఆ ప్రేమని పలు రూపాల్లో బయటపెట్టే అవకాశం కూడా వాళ్లకు ఉంది.కానీ వాడుకోరు. .. తమపై తామే, తమ రంగంపై తామే సెటైర్లు వేసుకోవడానికి మాత్రం ముందుకొస్తారు. దాన్నీ ఓ కమర్షియల్ యాంగిల్ చేసుసుకొన్నారు. సినిమా వాళ్ల కథలు, వారి కళలు, వాళ్లపై జోకులు వేసుకొంటూ... కామెడీ ట్రాక్ లు సృష్టించిన సినిమాలు బోలెడున్నాయి.
దుబాయ్ శీనునే తీసుకోండి. అందులో సాల్మాన్ రాజు చేసిందేంటి?? ఏజ్ బార్ హీరోయిజాలపై శ్రీనువైట్ల చేసిన కామెడీ అది. ఫలానా హీరోని దృష్టిలో ఉంచుకొనే.. శ్రీనువైట్ల ఆ కామెడీ ఎపిసోడ్ డిజైన్ చేశాడని ఆ తరవాత వార్తలొచ్చాయి. వాటిపై శ్రీనువైట్ల కూడా వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది. మళ్లీ ఆయనే.. కింగ్ సినిమాలో ఓ సంగీత దర్శకుడ్ని ఆట పట్టించాడు. దూకుడులో దానికి పరాకాష్ట చూపించాడు. బాలయ్య, ఎన్టీఆర్, రామ్‌చరణ్.. ఇలా ఏ హీరోనీ వదల్లేదు. ఇక్కడా.. ఆ వేషాలేసింది ఎమ్మెస్ నారాయణే. దూకుడు ఫార్ములానే లౌక్యంలో కనిపించింది. థర్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ ఫృద్వీ ఈ సినిమాలో హీరోగా రెచ్చిపోయాడు. సినిమా రంగంపై బోలెడు సెటైర్లు వేశాడు. పటాస్ లోనూ సేమ్ టూ సేమ్ సీన్ రిపీటయ్యింది.
ఈ శుక్రవారం వచ్చిన `దోచేయ్`లోనూ ఇదే ట్రెండ్ రిపీట్ అయ్యింది. ఈ సినిమాలో బుల్లెట్ బాబుగా హీరోయిజం చూపించాడు బ్రహ్మానందం. హీరోలు హీరోయిన్లపై ఎంత ఆశగా చూస్తుంటారు, ఆడియో ఫంక్షన్లలో అభిమానుల ముందు డైలాగులు బట్టిపట్టి ఎలా పలుకుతారు? బట్టతలను ఎలా కవర్ చేసుకొంటారు.. అనే విషయాలపై ఈ సినిమాలో సెటైర్లు పడ్డాయి. సినిమావాళ్లే సినిమా వాళ్లపై ఇలా వెకిలి జోకులు వేసుకోవడం కూడా.. ఓ ట్రెండ్ అనుకొంటున్నారేమో..? ఈ సరదా ట్రాకులతో.. కామెడీ పండుద్ది సరే. మరి ఈ సెటైర్లు ఎవరికైనా గుచ్చుకొంటే..? ఈ సీన్ నాకోసమే శారారని భుజాలు తడుముకొంటే ఎన్ని గొడవలు అయిపోతాయో..?
కడుపు చించుకొంటే కాళ్లపై పడుతుంది. తమపై తామే సెటైర్లు వేసుకొని ఏం ఉద్దరిద్దామనుకొన్నారు వీళ్లంతా? సినిమా తల్లిని, కళనీ ఇది అవమాన పరచడమే కదా..? ఈవిషయం సినిమావాళ్లెందుకు పసిగట్టలేకపోతున్నారు? ఒక్కసారి కామెడీ చేస్తే నవ్వుతారు. ప్రతీసారీ అదే ట్రక్‌ని పట్టుకొని తిప్పి తిప్పి లాగితే.. సినిమా రంగంపై, సినిమావాళ్లపై ఉన్న ఈ గౌరవం కాస్త.. మంటగలుస్తుంది. దర్శకురాలా.. కాస్త ఈ విషయం గురించి ఆలోచించండి ప్లీజ్..