పవనిజం కాపాడుతుందా?
on Mar 30, 2015
రేయ్ సినిమా చూసి థియేటర్లోంచి జనాలు పరుగులు పెడుతున్నారు. ఇదేం సినిమారోయ్... అంటూ సెటైర్లు వేసుకొంటున్నారు. ఈమాత్రం కళాకండానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాడా?? అంటూ వైవిఎస్ చౌదరి వైపు జాలి చూపులు చూస్తున్నారు. శుక్రవారం బీసీల్లో మంచి ఓపెనింగ్స్ రాబట్టుకొన్న రేయ్.. శని, ఆది వారాల్లో బాగా డల్ అయ్యింది. దాంతో ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడిలో సగమైనా తిరిగొస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ దశలోనే వైవిఎస్ చౌదరి తన దగ్గరున్న బ్రహ్మాస్త్రం సంధింస్తున్నాడు. రేయ్ కోసం పవన్ కల్యాణ్ వ్యక్తిత్వంపై ఓ పాట రూపొందించారు. ఆ పాటని ఈమధ్యే షూట్ చేశారు. అయితే విడుదల సమయానికి పూర్తి కాకపోవడంతో ఇప్పుడు కలుపుతున్నారు. సోమవారం నుంచీ రేయ్ ఆడుతున్న థియేటర్లలో ఈ పాటని చూడొచ్చు. ఇదంతా చౌదరి ముందస్తు వ్యూహంలో భాగమే. పవన్ పాటని కాస్త ఆలస్యంగా కలిపితే.. పవన్ ఫ్యాన్స్ ఈ సినిమాని రెండోసారి చూస్తారని ఆశపడుతున్నాడు. పవన్ ఫ్యాన్స్ విషయంలో ఇది ఎట్రాక్టింగ్ పాయింటే. తమ హీరోపై పాటంటే తప్పకుండా చూస్తారు. ఇప్పుడు చౌదరికి కావల్సింది అదే. ఈ సినిమా వసూళ్లు సోమవారం నుంచి పెరిగినా.. కాస్త స్టడీగా ఉన్నా అదంతా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మహిమ అనుకోవాల్సిందే. అయితే ఈ మాత్రం పాట కోసం రేయ్‌ని భరించే ఓపిక వాళ్లకు ఉంటుందా అనేదే అసలు ప్రశ్న. ఇప్పుడు రేయ్‌ని కాపాడే శక్తి ఆ పాటకు మాత్రమే ఉంది. మరి.. పవనిజం వల్ల ఈ సినిమాకి ఎన్ని వసూళ్లు దక్కుతాయో చూద్దాం.