ENGLISH | TELUGU  

తెలుగులో రీమేక్ కానున్న 'క‌ప్పేలా' మూవీ రివ్యూ

on Jul 6, 2020

 

సినిమా పేరు: క‌ప్పేలా
లాంగ్వేజ్‌: మ‌ల‌యాళం
తారాగ‌ణం: అన్నా బెన్‌, శ్రీ‌నాథ్ భాసి, రోష‌న్ మాథ్యూ, సుధి కొప్పా, త‌న్వీ రామ్‌, నిషా సారంగ్‌, జేమ్స్ ఎలియా, మ‌హ‌మ్మ‌ద్ ముస్త‌ఫా
మ్యూజిక్‌:  సుసిన్ శ్యామ్‌
సినిమాటోగ్ర‌ఫీ:  జిమ్‌షీ ఖాలిద్‌
ఎడిటింగ్‌:  నౌఫ‌ల్ అబ్దుల్లా
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం:  మహ‌మ్మ‌ద్ ముస్త‌ఫా
నిడివి: 113 నిమిషాలు
రేటింగ్‌: 3.5/5

'క‌ప్పేలా' మూవీని మెచ్చుకుంటూ డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్ కొద్ది రోజుల క్రితం చేసిన కామెంట్లు కాంట్ర‌వ‌ర్సీ సృష్టించ‌డ‌మే కాకుండా, ఇద్ద‌రు మ‌హేశ్ బాబు అభిమానుల‌పై అత‌డు పోలీసు కేసు పెట్టే దాకా వ్య‌వ‌హారం వెళ్లింది. ఆ త‌ర్వాతే ఈ మూవీ తెలుగు రీమేక్ హ‌క్కుల్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ కొనుగోలు చేసిన విష‌యం వెల్ల‌డైంది. మ‌ల‌యాళంలో రూపొంది, తెలుగువాళ్ల మ‌ధ్య గొడ‌వ‌కు మూల‌మైన ఈ సినిమా ఎలా ఉందంటే...

క‌థ‌
వాయ‌నాడ్‌లోని ఓ చిన్న గ్రామంలో నివ‌సిస్తుండే ఒక అంద‌మైన అమాయ‌క యువ‌తి క‌థ 'క‌ప్పేలా'. దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తికి చెందిన ఆ కుటుంబంలో అమ్మానాన్న‌లు, చెల్లెలితో హాయిగా గ‌డుపుతుంటుంది జెస్సీ. త‌ల్లి ద‌ర్జీ ప‌ని చేస్తుంటే, ఆమెకు కావాల్సిన లైనింగ్ క్లాత్‌లు, ఇత‌ర కుట్టుమిష‌న్ సామ‌గ్రి తీసుకువ‌స్తుంటుంది జెస్సీ. ఒక‌సారి త‌ల్లి మాట‌పై ఆమె క‌ష్ట‌మ‌ర్‌కు కాల్ చేయ‌బోయి, రాంగ్ నంబ‌ర్‌కు కాల్ చేస్తుంది. అది ఒక ఆటోడ్రైవ‌ర్‌కు వెళ్తుంది. అత‌డి పేరు విష్ణు. అప్ప‌ట్నుంచీ అత‌డు ఆమెకు ప‌దే ప‌దే కాల్ చేస్తూ ప‌రిచ‌యం చేసుకుంటాడు. ఫోన్‌లోనే ఇద్ద‌రి మ‌ధ్యా స‌న్నిహిత‌త్వం పెరుగుతుంది. జెస్సీది బేసిక్ ఫోన్ కావ‌డం వ‌ల్ల అత‌డెలా ఉంటాడో జెస్సీకి కానీ, జెస్సీ ఎలా ఉంటుందో విష్ణుకి కానీ తెలీదు.

జెస్సీకి పెళ్లి సంబంధం వ‌స్తుంది. కొత్త‌గా షాపు పెట్టిన బెన్నీ ఆమెను పెళ్లాడాల‌నుకుంటాడు. నిశ్చితార్థం చేయ‌డానికి పెద్ద‌లు నిర్ణ‌యిస్తారు. జెస్సీ మ‌న‌సంతా విష్ణు మీదే ఉంటుంది. త‌ల్లిదండ్రులు ప‌నిమీద వేరే చోటుకు వెళ్లిన‌ప్పుడు విష్ణును క‌లుసుకోవాల‌నుకుంటుంది జెస్సీ. అత‌డు చెప్పిన‌ట్లు బ‌స్సులో కోళికోడ్‌కు వెళ్తుంది. విష్ణు కూడా వ‌స్తాడు. కానీ అత‌డు ఫోన్ పోగొట్టుకోవ‌డంతో వెంట‌నే క‌లుసుకోలేక‌పోతారు. ఆ ఫోన్ రాయ్ అనే వ్య‌క్తి చేతికి చిక్కుతుంది. అత‌ను దాన్ని ఆఫ్ చేసి పెడ‌తాడు. జెస్సీ ప‌దే ప‌దే ఫోన్ చేసి, విష్ణు ఫోన్ ఆఫ్‌లో ఉండ‌టంతో ఆందోళ‌న చెందుతుంది. రాయ్ ఫోన్ ఆన్ చేసి, జెస్సీ కాల్‌ను రిసీవ్ చేసుకుంటాడు. త‌నే విష్ణులాగా ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు రాయ్‌. అదే స‌మ‌యంలో జెస్సీ వ‌చ్చిన బ‌స్సు కండ‌క్ట‌ర్ సాయంతో ఆమెను క‌లుసుకుంటాడు విష్ణు. అత‌డి ఫోన్ ఇచ్చేసి రాయ్ వెళ్లిపోతాడు. విష్ణు, జెస్సీ స‌ర‌దాగా కోళికోడ్‌లో తిరుగుతారు. త‌మ‌ను రాయ్ వెంబ‌డిస్తున్నాడ‌నే విష‌యం వాళ్లు గ్ర‌హిస్తారు. రాయ్‌తో విష్ణు గొడ‌వ‌ప‌డ‌తాడు. ఇద్ద‌రూ కొట్టుకుంటారు. వాళ్ల‌ను వారించాల‌ని చూసిన జెస్సీ అక్క‌డే ఉన్న బుర‌ద నీళ్ల‌లో ప‌డుతుంది. జ‌నం గుమిగూడ‌టంతో జెస్సీని తీసుకొని అక్క‌డ్నుంచి వెళ్లిపోతాడు విష్ణు. ఆమెకు బ‌ట్ట‌లు కొని, ఒక లాడ్జికి తీసుకొని వెళ్తాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది ఊహాతీతం.

విశ్లేష‌ణ‌
"గైస్‌, ఇప్పుడు క‌ప్పేలాను నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి. త‌ర్వాత నాకు థాంక్స్ చెప్పండి" అని త‌రుణ్ భాస్క‌ర్ ఆ సినిమా గొప్ప‌త‌నాన్ని ఒక్క లైన్‌లో చెప్పాడు. అయితే ఆ త‌ర్వాత, "కానీ హీరో గ‌ట్టిగా పిచ్చోడిలాగా రీసౌండ్ చేసుకుంటూ అర‌వ‌డు. అంద‌రికంటే స్మార్ట్‌గా ప్ర‌తి డైలాగ్‌లో సామెత చెప్ప‌డు. ఎక్స్‌ట్రీమ్ స్లో మోష‌న్‌లో ఫిజిక్స్ ఫెయిల్ ఫైట్లు ఉండ‌వ్‌. ప్ర‌తి రెండు నిమిషాల‌కి హీరో రీ ఎంట్రీ ఉండ‌దు. లాస్ట్ 10 మినిట్స్‌కి రాండ‌మ్‌గా ఫార్మ‌ర్స్ గురించో, సోల్జ‌ర్స్ గురించో, ఇండియా గురించో మెసేజ్ ఉండ‌దు. కానీ దీన్ని కూడా సినిమా అంటారు మ‌రి ఆ ఊరిలో" అని కామెంట్స్ చేశాడు. నిజ‌మే. అత‌ను చెప్పిన‌వేవీ ఈ సినిమాలో లేవు. కానీ ఈ క‌థ ఒక మెసేజ్ ఇస్తుంది. మ‌నం ప్రేమించేవాళ్లంతా మంచివాళ్లు కాద‌నీ, మంచి ముసుగులో విష‌స‌ర్పాలు ఉంటాయ‌నీ 'క‌ప్పేలా' చెబుతుంది. క‌ప్పేలా అంటే.. ఒక చిన్న ప్రార్థ‌నాల‌యం. క్రిస్టియ‌న్ అయిన జెస్సీకి అలాంటి ఆల‌యం ఒక‌టుంటుంది. అక్క‌డ‌కు వెళ్లి ప్రార్థ‌న చేసుకోవ‌డం ఆమెకు అల‌వాటు.

ఒక‌వైపు జెస్సీ-విష్ణు క‌థ‌ను, మ‌రోవైపు రాయ్ క‌థ‌ను చూపించి, ఆ రెండు క‌థ‌ల‌ను ద‌ర్శ‌కుడు ముస్త‌ఫా క‌లిపిన వైనం ఆక‌ట్టుకుంటుంది. విష్ణు ఒక స్వ‌చ్ఛ‌మైన ప్రేమికుడిలా, రాయ్ ఒక రౌడీ త‌ర‌హా వ్య‌క్తిలా మ‌న‌కు ప‌రిచ‌య‌మ‌వుతారు. నిజానికి ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు మంచివారు?  జెస్సీకి ఎవ‌రు ర‌క్ష‌కుడు? ఆ విష‌యాన్ని డైరెక్ట‌ర్ నెరేట్ చేసిన విధానం ముచ్చ‌టేస్తుంది. జెస్సీ, ఆమె స్నేహితురాలు వ‌ర్షంలో గొడుగు ప‌ట్టుకొని బ‌స్టాండ్‌కు న‌డిచి వెళ్ల‌డం, జెస్సీ కోళికోడ్‌కు వెళ్లే బ‌స్సెక్క‌డంతో క‌థ మొద‌ల‌వుతుంది. జెస్సీ కోళికోడ్‌కు ఎందుకు వెళ్తున్న‌ద‌నే క‌థ‌ను ఫ్లాష్‌బ్యాక్ మోడ్‌లో ద‌ర్శ‌కుడు చెప్పాడు. ఫోన్‌లో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా జ‌రిగే ప‌రిచ‌యం కానీ, వాళ్ల మ‌ధ్య సంభాష‌ణ కానీ, ప‌రిచ‌యం కాస్తా అవ్య‌క్త‌మైన ప్రేమ‌గా మార‌డం కానీ అంతా స‌హ‌జంగా అవుపిస్తుంది. పెద్ద‌వాళ్లు త‌నకు వేరే వ్య‌క్తితో నిశ్చితార్ధం జ‌ర‌ప‌నున్నార‌నే విష‌యం తెలిశాక‌, విష్ణుని తాను ప్రేమిస్తున్నాన‌నే విష‌యం అర్థ‌మై, అత‌డ్ని క‌లుసుకోవాల‌ని జెస్సీ త‌హ‌త‌హ‌లాడ‌టం ఎంత స్వ‌చ్ఛంగా అనిపిస్తుంది! ఆమెతో మ‌నం స‌హానుభూతి చెందుతాం. ఆమెతో మ‌న‌మూ ప్ర‌యాణిస్తాం.

 

 

మ‌రోవైపు రాయ్ ఎప్ప‌డు మ‌న‌కు ప‌రిచ‌య‌మ‌వుతాడు?..  కోళికోడ్‌లో విష్ణు ఫోన్ పోగొట్టుకున్నాక‌. అత‌డిది వేరే ఊరు. ఉద్యోగం ఉండ‌దు. చిల్ల‌ర దొంగ‌త‌నాల‌తో కాలం గ‌డుపుతుంటాడు. ఒక రౌడీ త‌న‌కు తెలిసిన షాపు వాడిమీద‌కు క‌త్తితో వ‌స్తే, భ‌య‌ప‌డ‌కుండా ఆ రౌడీని త‌రిమి కొడ‌తాడు. చివ‌ర‌కు త‌ప్ప‌ద‌న్న‌ట్లు ఉద్యోగం కోసం ఒక ఇంట‌ర్వ్యూ నిమిత్తం కోళికోడ్‌కు వ‌స్తాడు. ఆ ఉద్యోగం అత‌డికి రాదు. బ‌స్‌స్టాండ్‌కు వ‌స్తే విష్ణు ఫోన్‌ను ఎవ‌డో దొంగిలించ‌డం చూసి, అత‌డి వెంట‌ప‌డి, దాన్ని లాగేసుకుంటాడు. ఆ ఫోన్ ద్వారా జెస్సీని చూస్తాడు. విష్ణు, జెస్సీ అప్ప‌టిదాకా ఒక‌రికొక‌రు తెలీద‌నే విష‌యం బోధ‌ప‌డుతుంది. ఆ ఇద్ద‌రినీ అనుస‌రిస్తాడు. చివ‌ర‌కు రాయ్ ఊహ నిజ‌మ‌ని తేలుతుంది. రాయ్ ఏం ఊహించాడు? అది జెస్సీకి మంచి చేసేదా?  చెడు చేసేదా? మ‌నం ఊహించ‌ని కోణంలో వ‌చ్చే స‌న్నివేశాలు చూసి నిర్ఘాంత‌పోతాం. మ‌లిన‌మైన మ‌న‌సుల‌ను గ్ర‌హించ‌లేని స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సులు స‌మాజంలో ఎన్నో ఉన్నాయ‌నీ, అలాంటి ఒక స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సున్న ఒక అమ్మాయి క‌థ‌ను ద‌ర్శ‌కుడు చెప్పాడ‌నీ అర్థం చేసుకుంటాం.

క‌థ‌లో సంగీత‌మూ ఒక భాగమేన‌ని 'క‌ప్పేలా' మ‌న‌కు చూపిస్తుంది. క‌థ ఆత్మ‌ను ప‌ట్టుకున్న సుసిన్ శ్యామ్ స‌న్నివేశాల‌కు త‌గ్గ‌ట్లు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. స్వ‌త‌హాగా 'ద డౌన్‌ట్రాడెన్స్' మెట‌ల్ బ్యాండ్‌లో కీబోర్డ్ ప్లేయ‌రైన అత‌ను పాట‌ల‌కూ అంతే అందంగా బాణీలు కూర్చాడు. జిమ్ షీ ఖాలిద్ సినిమాటోగ్ర‌ఫీని త‌క్కువ చేయ‌లేం. టైటిల్ కార్డ్‌లో వేగంగా భూమిపైకి దూసుకు వ‌స్తున్న వ‌ర్ష‌పు చినుకుల‌ను చూపిస్తూ.. టైటిల్ పూర్త‌య్యేస‌రికి వ‌ర్షంలో గొడుగు వేసుకొని త‌న స్నేహితురాలితో న‌డ‌చివెళ్తున్న జెస్సీని చూపించ‌డం క‌వితాత్మ ఉన్న ఛాయాగ్రాహ‌కుడికే సాధ్యం. రెండు క‌థ‌ల‌ను విడిగా చెప్పి, ఆ రెండు క‌థ‌లు ఎక్క‌డ క‌లుసుకున్నాయో, అక్క‌డ్నుంచి ఒక క‌థ‌గా అవి ఎలా ట్రావెల్ అయ్యాయో ఆస‌క్తిక‌రంగా చెప్ప‌డం ద‌ర్శ‌కుడి మేధ‌కు నిద‌ర్శ‌న‌మైతే, ద‌ర్శ‌కుడి మ‌న‌సు గ్ర‌హించి, వాటిని ఒక తాడుగా పేన‌డం మంచి ఎడిట‌ర్ ప‌నిత‌నానికి తార్కాణం. నౌఫ‌ల్ అబ్దుల్లా ఆ ప‌నిని చ‌క్క‌గా నిర్వ‌ర్తించాడు.

న‌టీన‌టుల అభిన‌యం
ఈ సినిమాలో క‌చ్చితంగా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించేది జెస్సీ పాత్ర‌లో అన్నా బెస్ ప్ర‌ద‌ర్శించిన స్వ‌చ్ఛ‌మైన న‌ట‌నా సామ‌ర్థ్యం. గ‌తేడాది 'కుంబ‌ళంగి నైట్స్' మూవీతో ప‌రిచ‌య‌మై త‌న న‌ట‌న‌తో మ‌ల‌యాళీల‌ను మెస్మ‌రైజ్ చేసి, ఆ వెంట‌నే 'హెలెన్' సినిమాతో త‌న స‌త్తా చాటిన ఆమె జెస్సీ పాత్ర‌లో జీవించింది. పాత్ర‌లోని అమాయ‌క‌త్వాన్నీ, ప‌ల్లెటూరి అమ్మాయి స్వ‌చ్ఛ‌మైన హృద‌యాన్నీ ఆమె సునాయాసంగా ప‌లికించింది. ఆ త‌ర్వాత చెప్పుకోవాల్సింది.. రాయ్‌గా శ్రీ‌నాథ్ భాసి న‌ట‌న‌ను. ప్రేక్ష‌కుల్ని క‌న్‌ఫ్యూజ్ చెయ్య‌డం రాయ్ క్యారెక్ట‌ర్ ల‌క్ష్యం. దాన్ని చ‌క్క‌గా నెర‌వేర్చాడు శ్రీ‌నాథ్‌. నాలుగేళ్ల క్రితం విల‌న్‌గా మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టిన రోష‌న్ మాథ్యూ క‌న్నింగ్ అయిన విష్ణు పాత్ర‌కు స‌రిగ్గా స‌రిపోయాడు. అన్నా బెన్‌, శ్రీ‌నాథ్ బాసి, రోష‌న్ మాథ్యూ.. ఈ ముగ్గురూ ఈ సినిమాను నిల‌బెట్టారు. రాయ్ క‌జిన్ యానీ క్యారెక్ట‌ర్‌లో ఇమిడిపోయిన త‌న్వీ రామ్‌నూ ప్ర‌స్తావించుకోవాల్సిందే.

తెలుగు ఒన్ ప‌ర్‌స్పెక్టివ్‌
త‌రుణ్ భాస్క‌ర్ చెప్పాడ‌ని చెప్ప‌డం కాదు కానీ, 'క‌ప్పేలా' ఒక అంద‌మైన క‌థ‌, ఒక అమాయ‌క అమ్మాయి క‌థ‌. స‌మాజంలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌ల‌కు, వంచ‌న‌ల‌కు సాక్షీభూతంగా నిలిచే క‌థ‌. స్పందించే గుణ‌మున్న ప్ర‌తి ఒక్క‌రినీ క‌దిలించే క‌థ‌. ఈ ప్రార్థ‌నాల‌యంలోని ఆత్మ‌ను మ‌న తెలుగువాళ్లు ప‌ట్టుకోగ‌లుగుతారా?

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.