ఆరుగురు హీరోల్లో.... ప్రతాపరుద్రుడు ఎవరు?
on Aug 4, 2015
గుణశేఖర్ ఈసారి భారీ స్కెచ్ వేశాడు. రుద్రమదేవి తరవాత... మరో హిస్టారికల్ మూవీతో బాక్సాఫీసు ముందుకు రావడానికి సరంజామా సిద్ధం చేసుకొంటున్నాడు. రుద్రమదేవి కి సీక్వెల్‌గా ప్రతాపరుద్రుడు సినిమాని స్టార్ట్ చేయబోతున్నాడు. ఆల్రెడీ ఈ టైటిల్‌ని గుణశేఖర్ ఫిల్మ్‌ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించేశాడు కూడా. రుద్రమదేవి క్లైమాక్స్‌లోనే ప్రతాపరెడ్డికి లీడ్ సీన్లు వస్తాయట. మరి ప్రతాపరుద్రుడుగా ఎవరు కనిపిస్తారు? అనే విషయంపై ఆసక్తికరమైన చర్చసాగుతోంది.
గుణ అయితే ఆరుగురు హీరోల లిస్టు తయారు చేసుకొన్నట్టు భోగట్టా. ఒకొక్కరి దగ్గరకు వెళ్లి కథ చెప్పి ఒప్పించే ప్రయత్నాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్. బాలకృష్ణ, చిరంజీవి.. ఇలా గుణ లిస్టు రాసుకొన్నాడు. చిరంజీవి 150వ చిత్రానికి, బాలయ్య 100 వచిత్రానికి స్ర్కిప్టుల కోసం వెదుకుతున్న సంగతి తెలిసిందే. వాళ్లకు ఈ కథ బాగా మ్యాచ్ అవుతుందని గుణ నమ్మకం. వాళ్లు కాదంటే అప్పుడు యువ హీరోలు బన్నీ, తారక్, చెర్రీలకు వినిపిస్తాడట. వీళ్లలో ఒకరు ఈ సినిమాపై ఆమోద ముద్ర వేయడం ఖాయమని గుణ నమ్ముతున్నాడు.
అయితే గుణ మదిలో మెదిలిన మొదటి హీరో... మహేష్‌బాబు. ప్రిన్స్‌తో గుణకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఒక్కడు, అర్జున్, సైనికుడు ఇలా మూడు సినిమాలు తీశారు. రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి పాత్రకూ ముందు సంప్రదించింది మహేష్‌నే. ఆ తరవాతే ఆ ఆఫర్ బన్నీ దగ్గరకు వెళ్లింది. అందుకే ముందు మహేష్ కి ఈ కథ వినిపించి, తాను కాదంటే అప్పుడు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని గుణ భావిస్తున్నాడట. మరి ఈ ఆరుగురు హీరోల్లో ప్రతాపరుద్రుడిగా మెరిసేదెవ్వరో కాలమే చెప్పాలి.