అదృష్టమంటే ఆ దర్శకుడిదే...
on Nov 12, 2014
ఒక్క సినిమా, ఒక్క సినిమా... జీవితాన్ని మార్చేస్తుందంటారు. ఓ హిట్టు ఎక్కడికో తీసుకెళ్లిపోతుందంటారు. ప్రస్తుతం చందూ మొండేటి పరిస్థితి ఇలానే ఉంది. కార్తికేయ సినిమాతో తన ప్రస్థానం ప్రారంభించాడు చందూ మొండేటి. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేశాడు. విభిన్నమైన సినిమాలు తీసే సత్తా తనకు ఉందని నిరూపించుకొన్నాడు. ఈ సినిమాతో నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టాడు. కథానాయకులు, నిర్మాతల దృష్టి చందూపై పడడానికి ఇంతకంటే కారణాలు కావాలా...?? నాగార్జున లాంటివాడే.. ''ఓ మంచి కథ చెప్పు, సినిమా చేద్దాం'' అనేశాడు. అంతేకాదు... రూ.50 లక్షల అడ్వాన్స్ చేతికిచ్చాడట. గీతా ఆర్ట్స్ నుంచి కూడా చందూకి పిలుపొచ్చింది. ఇద్దరు ముగ్గురు యువ హీరోలు చందూతో టచ్‌లో వచ్చారు. దాంతో మురిసిపోతున్నాడు చందూ. తొలి సినిమా కార్తికేయకు చందూ పారితోషికం ఎంతో తెలుసా..?? ఆ సంస్థకు ఆయనో నెల జీతగాడు మాత్రమే. నెలకు ఇంత అని పారితోషికం ఇచ్చారు. మహా అయితే నాలుగైదు లక్షలకు మించి ఉండదు. ఇప్పుడు ఏకంగా అరకోటి అడ్వాన్సులుగా తీసుకొంటున్నాడు. హిటు మహత్యం అదే!!