భీమ్ ఫర్ రామరాజు.. పర్ఫెక్ట్ బర్త్‌డే గిఫ్ట్ ఫర్ రామ్‌చరణ్!
on Mar 27, 2020
'భీమ్ ఫర్ రామరాజు' సర్ప్రైజ్ వీడియో వచ్చేసింది. సర్ప్రైజ్ గిఫ్ట్ అని దీన్ని జూనియర్ ఎన్టీఆర్ ఎందుకన్నాడో ఆ వీడియో చూస్తే అర్థమైంది. అతని మాటల్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రామరాజుగా రామ్‌చరణ్ కనిపించిన తీరు అమోఘం. ఒక అసాధారణ శక్తిమంతుడిగా ఆ పాత్రను 'రౌద్రం రణం రుధిరం' (ఆర్ఆర్ఆర్)లో యస్.యస్. రాజమౌళి చూపిస్తున్నాడని అర్థమైపోయింది. వీడియోలో రామరాజు పాత్రను భీమ్ పాత్రధారి అయిన తారక్ పరిచయం చేసిన తీరు రోమాలు నిక్కబొడుచుకొనేలా చేసింది. తెలుగుతో పాటు ఈ సినిమా విడుదలవుతున్న ఇతర భాషలు.. తమిళ, కన్నడ, మలయాళం, హిందీలోనూ రామరాజు క్యారెక్టర్ ఇంట్రోను రిలీజ్ చేశారు.
"ఆడు నిలబడితే నిప్పుకణం నిలబడినట్టుంటది. కలబడితే యేగుసుక్క ఎగబడినట్టుంటది. ఎదురువడితే సావుకైనా సెమట ధార కడతది. పాణమైనా, బందూకైనా వానికి బాంచనైతది. ఇంటిపేరు అల్లూరి. సాకింది గోదారి. నా అన్న.. మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు" అని రామరాజు పాత్రను పరిచయం చేశాడు కొమరం భీమ్. తెలంగాణ యాసలో భీమ్‌గా రామ్‌చరణ్ పోషించిన అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేస్తుంటే ఒళ్లు గగుర్పొడిచిందంటారే.. అలాగే అనిపించింది. మొన్న ఉగాది రోజు 'రౌద్రం రణం రుధిరం' టైటిల్ లోగో మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించనప్పుడే రామరాజు పాత్రను నిప్పుగా, భీమ్ పాత్రను నీరుగా పరిచయం చేశాడు రాజమౌళి. "నా అన్న.. మన్నెం దొర.. అల్లూరి సీతారామరాజు" అంటూ ఆ పాత్రను భీమ్ పరిచయం చేసినదాన్ని బట్టి సినిమాలో రామరాజును భీమ్ అన్నగా సంబోధిస్తాడని అర్థమవుతోంది.
మార్చి 27, రామ్‌చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆశ్చర్యకరమైన వీడియో కానుకను అందిస్తాననీ, అది ఎప్పటికీ గుర్తుండిపోతుందనీ తారక్ నిన్న ప్రకటించడంతో చరణ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులూ అమితాసక్తితో ఎదురుచూశారు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు ఆ వీడియో రాకపోవడంతో అభిమానులు ఉసూరుమన్నారు. కానీ ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు సర్ప్రైజ్ వీడియో వస్తుందని తారక్ ప్రకటించాడు. రెండోసారి చెప్పినట్లే సరిగ్గా 4 గంటలకు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా రామరాజు పాత్రను వీడియో రూపంలో ప్రెజెంట్ చేసి, చరణ్ ఫ్యాన్స్‌ను సంబరాల్లో ముంచెత్తాడు తారక్. ఉదయం 10 గంటలకు ఈ వీడియో రిలీజ్ కాకుండా ఇప్పటి దాకా దాన్ని రాజమౌళి ఎందుకు ఆపాడో కూడా అర్థమైందంటూ వాళ్లు ఆనందపడుతున్నారు. ఇంతకంటే తమ హీరోకు గొప్ప బర్త్‌డే గిఫ్ట్ ఏముంటుందని వాళ్లు రాజమౌళిని పొగుడుతున్నారు.
ఒకసారి మెడలో జంధ్యంతో యోగముద్రలో కనిపించిన రామరాజు, ఇంకోసారి బాణాకర్రను చకచకా తిప్పుతూ కనిపించాడు. ఒక సందర్భంలో చేతిలో దివిటీని పట్టుకొని పరుగెత్తుతున్నాడు. ఇంకో సందర్భంలో విల్లు ఎక్కుపెట్టి నారి సంధించి బాణం విడిస్తే, వెళ్లి సరిగ్గా లక్ష్యంలోకి దిగబడింది. అతని కన్ను సునిశితమనీ, బందూకు అతనికి బాంచెనవుతుందనీ ఒక సన్నివేశం చెబుతుంది. అతని చేతుల బలానికి బాక్సింగ్ సాధన కోసం ఉపయోగించే పంచింగ్ బ్యాగ్ అయినా పగిలిపోతుందని ఇంకో సన్నివేశం నిరూపిస్తుంది. కండలు దేరిన దేహంతో రామరాజుగా ఈ వీడియోలో చరణ్ కనిపించిన విధానం గూస్బంప్స్ తెప్పించేదిగా ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. నిమిషాలు కాదు.. క్షణాల వ్యవధిలో ఈ వీడియో వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసేస్తోంది. ఫ్యాన్స్ ఈ వీడియోను షేర్ చేస్తూ చరణ్ బర్త్‌డేని అలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
'భీమ్ ఫర్ రామరాజు' వీడియో వచ్చేసింది. మరి 'రామరాజు ఫర్ భీమ్' వీడియో ఎప్పుడొస్తుంది? జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 అనే విషయం తెలిసిందే. బహుశా అప్పుడే భీమ్ క్యారెక్టర్‌ను పరిచయం చేసే వీడియో వస్తుందని ఊహిస్తున్నారు.
Also Read