'ఆషికీ' హీరో ఔట్ ఆఫ్ డేంజర్!
on Dec 1, 2020
1990లో మహేశ్ భట్ డైరెక్షన్లో వచ్చిన 'ఆషికీ' సినిమా ఎంతటి మ్యూజికల్ హిట్టయిందో చాలా మందికి తెలుసు. ఆ మూవీలో హీరోగా నటించిన రాహుల్ రాయ్ ఓవర్ నైట్ స్టార్ అవడమే కాకుండా అమ్మాయిల కలల రాకుమారుడిగా మారాడు. అయితే తర్వాత కాలంలో ఆ ఇమేజ్ను, క్రేజ్‌ను అతను నిలుపుకోలేకపోవడం వేరే సంగతి. ఇటీవల అతను కార్గిల్‌లో 'ఎల్ఏసీ- లివ్ ద బ్యాటిల్' అనే డిజిటల్ ఫిల్మ్ షూటింగ్లో పాల్గొంటూ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై హాస్పిటల్ పాలయ్యాడు. మొదట అక్కడి మిలటరీ హాస్పిటల్లో సీటీ స్కాన్ తీశాక, హెలికాప్టర్ ద్వారా అతడిని ముంబైకు తరలించారు. నానావతి హాస్పిటల్లో చేర్పించారు.
తాజా సమాచారం ప్రకారం వైద్యుల చికిత్సకు ఆయన మునుపటి కంటే బాగా స్పందిస్తున్నాడనీ, దాంతో ఐసీయూ నుంచి రూమ్‌కు ఆయన షిఫ్ట్ చేశారనీ తెలిసింది. లేటెస్ట్గా ఆయనకు ఫిజియోథెరపీ చికిత్సను కూడా ప్రారంభించారు. ఆయన ఔట్ ఆఫ్ డేంజర్ అని రాహుల్ రాయ్ బావ రొమీర్ తెలిపారు. ప్రస్తుతం రాహుల్‌ను ఆయన, ఆయన భార్య ప్రియాంక (రాహుల్ సోదరి) చూసుకుంటున్నారు. రాహుల్ కవల సోదరుడు రోహిత్ రాయ్ విదేశాల్లో ఉంటున్నారు. రాహుల్ త్వరలో కోలుకుంటాడని ఆశిద్దాం.