తమిళంలో తమ్ముడు... తెలుగులో 'దొంగ'
on Nov 16, 2019
కార్తీ, జ్యోతిక నటిస్తున్న తమిళ సినిమా 'తంబీ'. అంటే... తమ్ముడు అని అర్థం. కథ, కథలో పాత్రలకు తగ్గట్టు టైటిల్ పెట్టారు. నిజ జీవితంలో కార్తీకి జ్యోతిక వదిన. అయితే సినిమాలో అక్కగా నటిస్తున్నారు. అందుకని, సినిమాలో రిలేషన్ ప్రకారం జ్యోతికకు కార్తీ తమ్ముడు కనుక 'తంబీ' అని టైటిల్ ఖరారు చేశారు. తెలుగుకు వచ్చేసరికి ఈ తమ్ముడు కాస్తా 'దొంగ' అయ్యాడు. 'తంబీ' తెలుగు వెర్షన్ కు 'దొంగ' టైటిల్ ఖరారు చేశారు. నిజానికి, 'తమ్ముడు' టైటిల్ అయితే పర్ఫెక్ట్ ట్రాన్సలేషన్. కానీ, తమ్ముణ్ణి దొంగ చేశారేంటో? బహుశా... తెలుగులో ఆ టైటిల్ వేరేవాళ్లు రిజిస్టర్ చేయించుకున్నారేమో.
ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే... చిరంజీవి హిట్ సినిమాల్లో 'దొంగ' ఒకటి. తెలుగులో కార్తీ రీసెంట్ హిట్ 'ఖైదీ' కూడా ఒకప్పటి చిరంజీవి హిట్ సినిమా టైటిలే. యాదృశ్చికంగా చిరు టైటిల్స్ తన సినిమాలకు కుదిరాయని కార్తీ చెబుతున్నాడు. 'దొంగ' హిట్ అయితే చిరు టైటిల్స్ అతడికి సెంటిమెంట్ గా మారే అవకాశం ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.కట్టప్ప సత్యరాజ్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కార్తీ దొంగగా కనిపిస్తాడని టైటిల్ ను బట్టి చెప్పవచ్చు.