English | Telugu

మన వెంకీలో ఈ కోణం కూడా ఉందా!

on Aug 8, 2017


కథ నచ్చి సినిమాకు ఓకే చెప్పిన తర్వాత.. లొకేషన్లో  నటన గురించి తప్ప మిగిలిన విషయాల గురించి అస్సలు ఆలోచించడని వెంకటేశ్ కి పేరు. ‘ఎవరి పని వాళ్లు చేయాలి’అనుకునే తత్వం అయనది. అందుకే...‘విక్టరి’ని ఇంటిపేరు చేసుకోగలిగాడాయన. అందుకని మిగిలిన క్రాఫ్ట్స్ పై వెంకీకి అవగాహన లేదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సినిమాకు సంబంధింన 24 శాఖలపై మంచి గ్రిప్ ఉన్న పరిపూర్ణమైన సినిమావాడు వెంకటేశ్. ఎవరికీ తెలీని బాబాయి లోని ఈ కోణాన్ని... అబ్బాయి హీరో రానా ఓ సందర్భంలో తెలియజేశాడు. 

‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం ప్రమోషన్లో భాగంగా  ‘జోగేంద్ర యువగర్జన’పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దర్శక నిర్మాతలు తేజా, డి.సురేశ్ బాబు. ఈ కార్యక్రమానికి బత్తిరి సత్తి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. తండ్రి సురేశ్ బాబుతో పాటు, తనయులు రానా, అభిరామ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడంతో... ‘కుటుంబంలోని అందరూ వచ్చారు కానీ... మా విక్టరీ వెంకటేశ్ గారు ఏరి?’అని ఆరా తీశాడు  బిత్తిరి సత్తి. ‘బాబాయ్ ఎడిటింగ్ సూట్ లో ఉన్నారు. ఆయన దగ్గరుండి మా సినిమా పనులు చూసుకుంటున్నారు’ అని చెప్పడంతో.. అందరూ ఒక్కింత ఆశ్చర్యానికి లోనయ్యారు.

తన సినిమాల విషయంలోనే అంటీ అంటనట్టుండే వెంకీ... అన్న కొడుకు సినిమా విషయంలో మాత్రం ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడంటే.. మరి ఆశ్చర్యం కాక మరేంటి? కొంత విరామం తర్వాత సురేశ్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న సినిమా ఇది. పైగా అబ్బాయి సినిమా కావడంతో... తన చుట్టూ ‘హీరో’గా కట్టుకున్న పరదాను తొలిగించేసి,  టెక్నీషియన్ గా మారిపోయాడు బాబాయ్ వెంకీ. ‘కృష్ణంవందే జగద్గురుమ్’సినిమాలో కూడా అబ్బాయి రానా కోసం.. బాబాయ్ వెంకీ ఓ పాటలో స్సెషల్ అప్పీరియన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఎన్టీయార్ ‘బిగ్ బాస్’షోను కూడా ప్రమోషన్ కి విచ్చలవిడిగా వాడేసుకుంటున్నారు దగ్గుబాటి బ్రదర్స్.  11వ తారీకున ఈ సినిమాకు పోటీగా రెండు సినిమాలున్నాయి.

అందులో ఒకటి ‘జయ జానకీ నాయకా’అయితే.. రెండోది ‘లై’. రెండూ ప్రస్టేజియస్ సినిమాలే. అందుకే... ప్రమోషన్ విషయంలో అందరి కంటే ముందుండాలని ప్రయత్నిస్తున్నాడు నిర్మాత సురేశ్ బాబు. ప్రమోషన్ విషయంలో ఎంత హంగామా చేసినా... సినిమా బాగుంటేనే డబ్బులొస్తయ్. ఇది ప్రతి ఒక్క నిర్మాత గ్రహించాల్సిన విషయం. మరి ఈ పోటీలో గెలుపెవరదో తెలియాలంటే... ఇంకో రెండుమూడు రోజులు ఆగాల్సిదే.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here