బ్రహ్మీని భరించలేక 'తీసేశారు..'
on Jul 20, 2015
బ్రహ్మానందం వల్ల సినిమా నిలబడిపోతోందని సినీ జనాల నమ్మకం. బ్రహ్మీ పాత్ర హిట్ అయితే.. సినిమా సూపర్ హిట్టని, కలక్షన్లు కొల్లగొట్టడం ఖాయమని చాలా సందర్భాల్లో రుజువైంది. ఇదే అదునుగా తీసుకొని బ్రహ్మీ కూడా తన పారితోషికాన్ని అమాంతం పెంచేశాడు కూడా. సినిమాకి ఇంత అని కాకుండా రోజుకి ఇంత అని తీసుకొనేవాడు. ఇప్పుడు గంటల్లెక్కన పారితోషికం డిమాండ్ చేస్తున్నాడు. గంటకు బ్రహ్మీ పారితోషికం ఇంచుమించుగా లక్ష వరకూ ఉంది.
తాజాగా నందమూరి బాలకృష్ణ సినిమా డిక్టేటర్‌లో ఓ ప్రధాన మైన పాత్రకు బ్రహ్మానందంని ఎంపిక చేశారు. ఈ సినిమా కోసం కోన వెంకట్ బ్రహ్మానందం కోసం ఓ పాత్ర డిజైన్ చేశారు. అయితే ఆ పాత్రలో నటించడానికి బ్రహ్మానందం భారీ పారితోషికాన్ని డిమాండ్ చేశారట. 30 రోజుల కాల్షీట్ల కోసం దాదాపు కోటి రూపాయలు అడిగాడట. దాంతో.. చిత్రబృందం ఖంగుతిన్నదని టాక్.
ఈ సినిమాలతో అంజలి, సోనాల్ చౌహాన్‌లు కథానాయికలు. వాళ్లిద్దరి పారిపోషికం కలిపినా కోటి లేదు. అలాంటిది కేవలం బ్రహ్మానందానికే అంత ఇవ్వాలా..? అనుకొని ఆయన్ని సినిమా నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. తన కథలో బ్రహ్మానందం కోసం ఎప్పుడూ కొత్త పాత్రలు సృష్టించే కోన వెంకట్ కూడా ఆ స్థానంలో మరొకర్ని తీసుకొందామని దర్శకుడు శ్రీవాస్‌కి సూచించినట్టు తెలుస్తోంది. పారితోషికం విషయంలో మరీ హెచ్చుకుపోతే.. మొదటికే మోసం వస్తుందన్న సంగతి బ్రహ్మీ ఇప్పుడైనా గుర్తుపెట్టుకొంటే మంచిది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
