శ్రీనువైట్ల ఖేల్ ఖతమ్
on Oct 29, 2015
ఆగడు ఫ్లాప్ తో శ్రీనువైట్ల కెరీర్ సగం.. మటాష్ అయ్యింది. మిగిలిన సగం...బ్రూస్లీ పూర్తి చేసింది. ఈరెండు సినిమాల వైఫల్యం.... పూర్తిగా దర్శకుడే మోయాల్సివచ్చింది. రొటీన్ కథ, విసుగెత్తించే కథనం, ఓవర్ కాన్ఫిడెన్స్ తో తీసుకొన్న నిర్ణయాలతో ఈ రెండు సినిమాలూ బాక్సాపీసు దగ్గర పల్టీలు కొట్టాయి. స్టార్ హీరోల నమ్మకాన్ని.. శ్రీనువైట్ల నిలబెట్టుకోలేకపోయాడని విమర్శకులు ఆ దర్శకుడ్నే వెలెత్తి చూపించారు.
ఆగడు తరవాత శ్రీనువైట్లతో సినిమాలు చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆగడుకు ముందే కర్చీఫ్ వేసుకొని కూర్చున్న రామ్‌చరణ్‌కి శ్రీనువైట్లతో సినిమా చేయక తప్పింది కాదు. ఎలాగైనా సరే, హిట్‌ని దక్కించుకోవాలన్న లక్ష్యంతో శ్రీనువైట్ల కాస్త కష్టపడి బ్రూస్లీని తీర్చిదిద్దుతాడనుకొన్నారంతా. పైగా పాత గొడవల్ని మర్చిపోయి తన ఆస్థాన కవులు కోన వెంకట్, గోపీమోహన్‌లతో మళ్లీ జట్టు కట్టాడు. దానికి తోడు చిరంజీవిని ఒప్పించి... గెస్ట్ రోల్ చేయించాడు. అందుకే బ్రూస్లీ గురి తప్పదుకొన్నారంతా. కానీ.. ఆ పంచ్ రివర్సయ్యింది. శ్రీనువైట్ల కెరీర్‌పైనే మెగా పంచ్ పడేట్టు చేసింది.
దర్శకుడి వైఫల్యం వల్లే బ్రూస్లీ సినిమా ఆడలేదన్నది చిరుకి అందిన పోస్ట్ మార్టమ్ రిపోర్ట్. దాంతో.. వేళ్లన్నీ శ్రీనువైట్లవైపు తిరిగాయి. దానికి తోడు ఈ దర్శకుడి వ్యక్తిగత జీవితం కూడా గాడితప్పినట్టు స్పష్టమతోంది. భార్య పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం సన్సేషనల్ అయ్యింది. తన ఫస్ట్రేషన్‌ని భార్యపై చూపిస్తున్నాడని పోలీసులే నిర్దరించారంటే... శ్రీనువైట్ల పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. శ్రీనుతో సినిమాలు చేద్దామనుకొన్న నిర్మాతలు ఇప్పుడు వెనక్కి దౌడు తీస్తున్నారు. శ్రీనుపై నమ్మకముంచిన కథానాయకుడెవరూ కనుచూపుమేర కనిపించడం లేదు. ఇక ఈ దర్శకుడి ఖేల్ ఖతమ్ అనుకోవచ్చా??