తెలుగు చలన చిత్ర పరిశ్రమకు 2024 సంవత్సరం అనేది ఎంతో కీలకమైనదిగా మారింది. ఎందుకంటే ఇదే సంవత్సరం తెలుగు సినిమాకి సంబంధించి ఎన్నో అద్భుతాలు జరిగాయి. అదే సమయంలో కొన్ని సినిమాల వల్ల తీవ్రమైన నష్టాలు, ప్రేక్షకులకు అసంతృప్తి కలిగింది. కొన్ని సినిమాలు రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడితే, కొన్ని భారీ సినిమాలు భారీ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటివరకు ఉన్న తెలుగు సినిమా తీరు తెన్నులు పూర్తిగా మారిపోయాయి అని చెప్పొచ్చు. గతంలో మన సినిమాలకు ఒక ఫార్ములా ఉండేది. హీరోలు, దర్శకనిర్మాతలు దాన్నే ఫాలో అవుతూ సినిమాలు నిర్మించేవారు. కానీ, సినిమాకి ట్రెండ్ అనేది ఒకటి ఉంటుంది కదా. అది ఎప్పటికప్పుడు మారుతూ వస్తుంది. ఆ ట్రెండ్ మాయలో పడి దాన్నే ఫాలో అవుతూ దెబ్బతింటున్నారు. 2024 సంవత్సరం అదే జరిగింది. నెల, నెలకీ మారిపోతున్న ట్రెండ్‌ని పట్టుకోవడం వారివల్ల కాలేదు. అందుకే ఈ ఏడాది బ్లాక్‌బస్టర్లు, సూపర్‌హిట్లు వేళ్ళ మీద లెక్కపెట్టే స్థాయిలో ఉంటే డిజాస్టర్లకు లెక్కే లేదు. మరి 2024 సంవత్సరం ఎలా ప్రారంభమైంది? ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాలు ఏ స్థాయిలో ప్రేక్షకాదరణ పొందాయి అనేది పరిశీలిద్దాం.
మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య సంక్రాంతికి విడుదలైన ‘గుంటూరు కారం’ ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేకపోయింది. సినిమా బ్లాక్‌బస్టర్ అంటూ ఎంత ప్రచారం చేసినా వాస్తవాన్ని ప్రేక్షకులు గుర్తించారు. సినిమాపైనే కాదు, దర్శకుడు త్రివిక్రమ్‌పై కూడా విమర్శలు వచ్చాయి. పండగ సీజన్‌లోనే రిలీజ్ అయిన ‘నా సామిరంగా’ ఫర్వాలేదు అనిపించే స్థాయిలో విజయాన్ని అందుకుంది. ఇక ‘సైంధవ్’ చిత్రం మరో డిజాస్టర్‌గా నిలిచింది. ఈ భారీ సినిమాల మధ్యలో రిలీజ్ అయిన ‘హనుమాన్’ అనూహ్యంగా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను పండగ నుంచి వెనక్కి పంపించాలని ఎంతోమంది ప్రయత్నించినా పండగనే నమ్ముకున్నారు నిర్మాతలు. ఊహించని విధంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టుకుంది ‘హనుమాన్’. ఆ తర్వాత విడుదలైన ‘ఈగల్’, ‘ఆపరేషన్ వాలెంటైన్’, ‘భీమా’ చిత్రాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఈ సినిమాలతోపాటే రిలీజ్ అయిన ‘గామి’ ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించి వసూళ్ళ పరంగా కూడా ఫర్వాలేదు అనిపించింది. మొదటి త్రైమాసికంలో అంతంత మాత్రంగా వున్న టాలీవుడ్‌కి మార్చి నెలాఖరులో విడుదలైన ‘టిల్లు స్క్వేర్’ భారీ విజయం సాధించడం ఊరటనిచ్చింది. ఈ సినిమా దాదాపు వంద కోట్లకుపైగా కలెక్షన్ రాబట్టింది.
ఇక ఏప్రిల్ ప్రారంభంలో వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం ఊహించని విధంగా డిజాస్టర్ అయింది. దీంతో విజయ్ దేవరకొండపై ట్రోలింగ్ పెరిగిపోయింది. ఈ సినిమా బయ్యర్లకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆ సమయంలోనే గీతాంజలి మళ్లీ వచ్చింది, ఆ ఒక్కటీ అడక్కు చిత్రాలు గుడ్డిలో మెల్లగా ఫర్వాలేదు అనిపించాయి. ఆ తర్వాత వచ్చిన కృష్ణమ్మ, ప్రతినిధి2, భజేవాయువేగం, గమ్ గమ్ గణేషా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మనమే, హరోంహరా.. వంటి సినిమాలు భారీ డిజాస్టర్స్‌గా నిలవడంతో టాలీవుడ్ విలవిలలాడిపోయింది. ఆ టైమ్‌లో ప్రేక్షకులు థియేటర్స్ వైపు వెళ్ళకుండా ఓటీటీపైనే దృష్టి కేంద్రీకరించారు. వివిధ భాషల నుంచి తెలుగులోకి అనువాదమైన సినిమాలకు డిమాండ్ పెరిగిపోయింది. అదే సమయంలో వచ్చిన ‘కల్కి 2898ఎడి’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర తన ప్రతాపాన్ని చూపించింది. అలా ఈ ఏడాది ఆరు నెలలు ముగిసిపోయాయి.
కల్కి చిత్రం థియేటర్స్‌లో సందడి ముగిసిన తర్వాత ఆ స్థాయిలో వుండే సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూశారు. కానీ, ఆ పరిస్థితి కనిపించలేదు. అయితే ‘కమిటీ కుర్రోళ్లు’ టాలీవుడ్‌కి కాస్త ఊపిరి పోసింది. ఈ సినిమాను విమర్శకులు సైతం ప్రశంసించారు. ఆ తర్వాత భారీ అంచనాల మధ్య విడుదలైన డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి. ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ తర్వాత వస్తున్న డబుల్ ఇస్మార్ట్ చిత్రంపై సహజంగానే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ, దానికి భిన్నంగా సినిమా డిజాస్టర్ అయింది. మిస్టర్ బచ్చన్ కూడా దాని బాటలోనే వెళ్లింది. ఆ తర్వాత ఆయ్, మారుతినగర్ సుబ్రమణ్యం సినిమాలు ఫర్వాలేదు అనిపించినా అవి ఓటీటల్లోనే ఎక్కువ పేరు తెచ్చుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన సరిపోదా శనివారం మంచి కలెక్షన్స్‌తో రన్ అయింది. ఈ త్రైమాసికం చివరలో వచ్చిన ‘దేవర’ భారీ చిత్రంగా విడుదలై భారీ కలెక్షన్లు సాధించింది.
ఇక చివరి త్రైమాసికంలో విడుదలైన శ్వాగ్, విశ్వం చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. అయితే ఈ సినిమాలు ఓటీటీల్లో బాగానే రన్ అయ్యాయి. ఆ తర్వాత క, లక్కీ భాస్కర్, డబ్బింగ్ సినిమా అమరన్ చిత్రాలు ఒకే వారంలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఈ మూడు సినిమాలనూ ప్రేక్షకులు ఆదరించారు. ఈ సినిమాలు కలెక్షన్ల పరంగా నిర్మాతలకు ఊరటనిచ్చాయి. ఆ తర్వాత వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, జనక అయితే గనక వంటి సినిమాలు యధావిధిగా బాక్సాఫీస్ వద్ద నిలవలేకపోయాయి. ఇక నవంబర్‌లో విడుదలైన మట్కా చిత్రం ఈ ఏడాది చివరలో మరో డిజాస్టర్‌గా నిలిచింది. అదే సమయంలో విడుదలైన మెకానిక్ రాకీ కమర్షియల్‌గా ఫర్వాలేదు అనిపించింది. ఇక డిసెంబర్ 5న విడుదలై పాన్ ఇండియా మూవీ ‘పుష్ప2’ మొదటి షో నుంచే తన దూకుడును చూపించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.1300 కోట్ల భారీ గ్రాస్‌ని సాధించి కొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశగా వెళుతోంది.