దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో అపశృతి 

దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్యే సూచనతో ట్రాక్టర్ డ్రైవర్ పిల్లలను ఎక్కించుకొని అటు, ఇటు తిప్పారు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ అదుపు తప్పి చేపల చెరువులోకి వెళ్ళడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు చిన్నారులు గాయపడగా వారిని స్థానికులు ఏలూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తుండగా.. అందులో కొంతమంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనకు అబ్బయ్య చౌదరినే కారణమని…ఆయన ప్రచార ఆర్భాటమే పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టిందని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Publish Date: May 1, 2024 6:33PM

ఎన్నికల ప్రచారంలో వెంకటేష్ కుమార్తె

ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.  ఆ యువతి మరెవరో కాదు.. విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత! వెంకటేష్ వియ్యంకుడు రామసహాయం రఘురామ్‌రెడ్డి ఖమ్మం పార్టమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రఘురామ్‌రెడ్డి కుమారుడిని ఆశ్రిత పెళ్ళాడారు. పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల బరిలో వున్న తన మామగారికి మద్దతుగా ఆశ్రిత ఎన్నికల ప్రచారంలోకి ఎంటరయ్యారు. రఘురామ్‌రెడ్డికి మద్దతుగా వెంకటేష్ ఎన్నికల ప్రచారం చేస్తారన్న వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలకు ట్విస్ట్ ఇస్తూ ఆశ్రిత కాంగ్రెస్ కండువా వేసుకుని ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆశ్రిత ఈ ఒక్కరోజే ప్రచారంలో పాల్గొన్నారా.. ప్రచారం ముగిసేవరకూ పాల్గొంటారా అనే విషయంలో ఇంకా క్లారిటీ రావలసి వుంది. ఈసారి ఎన్నికలలో ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి రఘురామ్‌రెడ్డి గెలిస్తే, రాబోయే రోజుల్లో ఈ స్థానం నుంచి ఆయన రాజకీయ వారసురాలిగా ఆశ్రిత ఎన్నికలలో నిలబడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానంలో కాంపిటీషన్ భారీగా వుంది. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు పోటీలో వున్నారు. మరి ఆశ్రిత ప్రచారంలోకి ఎంటరైంది కదా.. ఏ మ్యాజిక్ జరుగుతుందో చూడాలి.
Publish Date: May 1, 2024 6:28PM

జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది! ఇంకెన్నాళ్లు సాగ‌దీస్తారు

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై  గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఆయా చార్జిషీట్ల నుంచి తమను తప్పించాలని కోరుతూ జగన్‌, విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితులు దాఖలు చేసిన 130 డిశ్చార్జి పిటిషన్‌లపై తీర్పు వెలువడాల్సి ఉంది. వీటి పరిష్కారానికి హైకోర్టు ఇప్పటికే ఒకసారి గడువు పొడిగించింది. ఈ గడువు సైతం ఏప్రిల్‌ 30తో ముగిసింది.  ఈ పిటిషన్‌లలో తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. అయితే, అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని సీబీఐ కోర్టు జడ్జి రమేశ్‌బాబు పేర్కొన్నారు. ఇటీవల బదిలీల్లో రమేశ్‌బాబు సైతం వేరే కోర్టుకు బదిలీ అయ్యారు. ఈ కారణంగా మళ్లీ మొదటి నుంచి కేసులు వినేందుకు మే 15కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో 12 ఏళ్లుగా కొనసాగుతున్న విచారణ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.  2013 నుంచి సీబీఐ కోర్టులో ఏడుగురు జడ్జిలు బదిలీ అయ్యారు. 2022, మే 4 నుంచి ఆయన జగన్‌ అక్రమాస్తులకు సంబంధించిన డిశ్చార్జి పిటిషన్‌లపై రమేష్ బాబు సుదీర్ఘంగా వాదనలు విన్నారు. తీర్పు వెలువరించాల్సిన సమయంలో బదిలీ కావడంతో ఆయన కేసులను తిరిగి ప్రారంభిస్తున్నట్టు(రీ ఓపెన్‌) ప్రకటించారు. దీంతో కొత్తగా వచ్చే జడ్జి మళ్లీ ఈ కేసులను మొదటి నుంచి వినాల్సిన అవసరం ఏర్పడింది.  జగన్మోహన్ రెడ్డి పై గల 11 చార్జిషీట్ల వివరాలుః మొదటి చార్జి షీట్: 75 ఎకరాల స్థలాన్ని M/s Hetero Group of companies కి మరియు M/s Aurobindo group కు కేటాఇంచినందుకుగాను రెడ్డికి ముట్టిన డబ్బు రూ.29కోట్లు. రెండవ చార్జి షీట్: వ్యక్తిగత పెట్టుబడిదారుల నుంచి రూ.35.64కోట్లు సేకరించి మోసగించినందుకు. మూడవ చార్జి షీట్: రూ.133.74కోట్ల M/s Ramky Pharmacity Project కు సంబంధించిన గ్రీన్ బెల్ట్ విషయంలో మితిమీరిన ప్రయోజనాలను ఆశించి పరస్పర ఒప్పందంతో రూ.10కోట్లను జగన్ లంచంగా తీసుకున్నందుకుగాను. నాలుగవ చార్జి షీట్: నియమనిబంధనలను కాలరాస్తూ 22000 ఎకరాల స్థలాన్ని VANPIC Project కు సంబంధించి Nimmagadda Prasadకి ఇచ్చినందుకు పరస్పర ఒప్పందంగా జగన్ పరిశ్రమకు రూ.854 కోట్లను అందించినందుకుగాను. ఐదవ చార్జి షీటు: కడప జిల్లా తళ్ళమంచిపట్నం గ్రామంలో 407 హెక్టార్ల గనుల తవ్వకాల లీజును Puneet Dalmia కంపెనీకి మంజూరు చేసినందుకు పరస్పర ఒప్పందంగా జగన్ కంపెనీలో రూ.95కోట్లు జమ చేసినందుకు. ఆరవ చార్జి షీట్: India Cements కు కృష్ణ, కగ్న నదుల జలాలను, స్థలాన్ని మితి మీరిన ప్రయోజనాలకు మంజూరు చేసినందుకుగాను India Cements అధినేత N Srinivasan పరస్పర ఒప్పందంతో జగన్  కంపెనీలో రూ.140కోట్లను జమ చేసినందుకు. ఏడవ చార్జి షీట్: M/s Penna Group కంపెనీస్ P Pratap Reddy తమ కంపెనీలకు అనంతపురం జిల్లాలో 231.09 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని మంజూరు చేసినందుకు, కర్నూలు జిల్లాలో 307 హెక్టార్ల భూమిలో   లైసెన్స్ పొందినందుకుగాను,రంగారెడ్డి జిల్లాలో 821 ఎకరాల గనుల తవ్వకాల లైసెన్స్ పునరుద్దరించినందుకుగాను మరియు బంజారా హిల్స్ లో తలపెట్టిన హోటల్ ప్రోజేక్టుకు ప్రయోజనాలను చేకూర్చినందుకు ప్రతిఫలంగా పరస్పర ఒప్పందంతో జగన్ కంపెనీలో రూ.68 కోట్లను పెట్టుబడిగా పొందినందుకు. ఎనిమిదవ చార్జి షీట్: కడప జిల్లాలో 2037.54 ఎకరాల పాలరాతి గనుల తవ్వకాలను నిబంధనలను అతిక్రమించి నియమాలను ఉల్లంఘించి M/s Raghuram Cements Ltd కు కట్టబెట్టినందుకు. తొమ్మిదవ చార్జి షీట్: అనంతపురం జిల్లాలో 8844 ఎకరాల M/s Lepakshi Knowledge Hub (LKH) ఏర్పాటుకు మరియు పెట్టుబడులకు నిబంధనలను అతిక్రమించి స్థలం కేటాయించినందుకు గాను పరస్పర ఒప్పందంతో జగన్ జగతి పబ్లికేషన్స్ కంపెనీలో రూ.50 కోట్లను పెట్టుబడిగా పొందినందుకు. పదవ చార్జి షీట్: శంషాబాద్ పెట్టుబడుల పేరుతో M/s Indu Techzone Pvt Ltd కు 250 ఎకరాల స్థలాన్ని మంజూరు చేసినందుకు ప్రతిఫలంగా M/s Caramel Asia Holdings Pvt Ltd లో రూ.15 కోట్ల పెట్టుబడులను పొందినందుకు. ఇది మాత్రమే కాక హవాలా నేరానికి సంబందించి రూ.840. కోట్లను సరిక్రొత్తగా ED జత చేసింది. సీబీఐ కోర్టు జడ్జి రమేశ్‌బాబు.. ఎమ్మార్‌ కేసులో నిందితులు దాఖలు చేసిన 9 డిశ్చార్జి పిటిషన్‌లపై తీర్పు వెలువరించారు. జగన్‌ సన్నిహితుడు ఎన్‌. సునీల్‌రెడ్డి , కోనేరు ప్రదీప్‌, విజయరాఘవ, శ్రీకాంత్‌ జోషి, ఎమ్మార్‌ ఎంజీఎఫ్‌, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌, ఎమ్మార్‌ హిల్స్‌, బౌల్డర్‌ హిల్స్‌ డిశ్చార్జి పిటిషన్‌లను కోర్టు కొట్టేసింది. మరో నిందితుడు, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి బీపీ ఆచార్యపై 120బీ, 409 సెక్షన్లను తొలగించిన సీబీఐ కోర్టు.. అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు ఎదుర్కోవాల్సిందేనని పేర్కొంది. ఇతర నిందితులను కేసు నుంచి తప్పించడానికి నిరాకరించింది.   జ‌గ‌న్ కేసుల క‌ద‌లిక లేదు. సిబిఐ, ఈడిల కేసుల లిస్ట్ చూస్తే...  అస్సాం హేమంత్ బిస్వాస్ శ‌ర్మ బిజేసి సి.ఎం, అజిత్ ప‌వార్ కేసుల్లో క‌ద‌లిక లేదు బిజెపి నేత‌, శివ‌సేన ఏక్‌నాథ్ షిండ్ ఎమ్మెల్య‌లే కేసుల్లో క‌ద‌లిక లేదు. అశోక్ చౌహాన్ ఆద‌ర్శ‌సొసైటీ కుంభ‌కోణం. ఇప్పుడేమో బీజేపీకీ స్టార్ క్యాంపెయిన‌ర్‌. అందుకే అత‌ని కేసుల్లోనూ క‌ద‌లిక లేదు. బెంగాల్‌కు చెందిన  సువేందో అధికారి బిజెపి ప్ర‌తిప‌క్ష నేత ఆయ‌న కేసుల్లోనూ క‌ద‌లిక లేదు. త‌మ వాళ్ళ‌ను బీజేపీ ముట్టుకోదు. అందుకే వాళ్ళు జైలు బ‌య‌ట వుంటారు.  త‌న వాడు కాద‌ని డిసైడ్ అయితే జైలుకు పంపుతుంది. కేసుల్లో క‌ద‌లిక ఏంటి తూఫాన్ వుంటుంది. జ‌గ‌న్‌కు బిజెపితో ఉన్న సాన్నిహితం తోనే ఆయ‌న కేసుల్లో క‌ద‌లిక లేదు. జ‌గ‌న్‌, ఎన్‌డిఏలో లేక‌పోయిన, త‌న‌ ప్ర‌త్యర్థి టీడీపీతో బీజేపీ క‌లిసిన, జ‌గ‌న్ స‌పోర్ట్ బిజెపికే. టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కూడా బిజెపికి మిత్రులే. ఢిల్లీలో స‌పోర్ట్ చేస్తారు. ఇక్క‌డ ఓ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. బిజెపికి జ‌గ‌న్ అవ‌స‌రంవుంది. ఎందుకంటే రాజ్య‌స‌భ‌లో 11 మంది ఎంపీలున్నారు. మ‌రో ప‌క్క బిజెపికి రాజ్య‌స‌భ‌లో బ‌లంత‌క్కువే.  కాబ‌ట్టి భ‌విష్య‌త‌లో బిజెపి జ‌గ‌న్ అవ‌స‌రం వుంది. అందుకే జ‌గ‌న్‌కు బిజెపి అనుకూలంగానే వుంటుంది.  ఏపీ ప్ర‌జ‌ల‌కు అర్థం కాని విష‌యం ఏమిటంటే.... జ‌గ‌న్ ప‌ట్ల బీజేపీ సానుకూలంగా వున్నా, జ‌గ‌న్‌కు అన్ని రకాలుగా స‌హ‌కారం ఇస్తున్నా, అలాంటి బిజెపితో టీడీపీ ఎందుకు పొత్తు పెట్టుకుంది?  జ‌గ‌న్ ప‌రోక్ష స్నేహ‌సంబంధాలే గ‌త 12 ఏళ్ళ గా కేసుల్ని ప‌ట్టించుకోవ‌పోవ‌డానికి కారణం. అంత‌గా జ‌గ‌న్‌కు స‌పోర్ట్‌గా వున్న బిజేపీతో క‌లిసి వుండాలా? లేదా నిర్ణ‌యించుకోవాల్సిందే టీడీపీనే. - ఎం.కె.ఫ‌జ‌ల్‌
Publish Date: May 1, 2024 5:56PM

తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్

ప్రపంచంలో అతి పిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలిగా గుర్తింపు పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము  అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం. అది ఆగస్టు 13, 2013... తెలుగు నేల ను పులకింపజేస్తూ ఈ లోకంలో అడుగు పెట్టింది ఆ బంగారు తల్లి. పేరు కలశ... కలశ నాయుడు.. పసితనము నుండే పరుల కష్టాలకు స్పందించడం మొదలుపెట్టింది తనలాంటి పసిపిల్లలు, పనివాళ్ళుగా ఉండడం చూసి తట్టుకోలేకపోయింది ఆ చిన్నారి గుండె. తన వంతుగా, తన వయసుకు తెలిసినంతగా సాయం ప్రారంభించింది. పలకలు, బలపాలు, చాక్లెట్లు, ఆట బొమ్మలు... ఒకటేమిటి ఎవరికి ఏ అవసరం ఉన్నా అన్నీ ఇచ్చేస్తూ ఉండేది. ఆ చిన్నారి దాన గుణానికి, సేవా తత్వానికి మురిసిపోయిన ఆమె తల్లిదండ్రులు ఆమెకు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. చేయూతను అందించారు. దాని ఫలితమే కలశ  ఫౌండేషన్ సాధించిన ఘనవిజయాలు. వాటిలో మచ్చుకు కొన్ని తెలుసుకుందాం.   ‘అక్షర కలశం’ అనే జ్ఞాన జ్యోతిని వెలిగించి ఎందరో చిన్నారుల జీవితాల్లో వెలుగులు పంచుతుంది. విభిన్న రంగాలలోని విశిష్ట సేవలు అందించిన మహిళా మూర్తులను గుర్తిస్తూ, వారిని గౌరవిస్తూ ‘మార్వలెస్ ఉమెన్’ పురస్కారాలతో సత్కరిస్తుంది. ‘గ్రీన్ రన్’ పేరిట పర్యావరణ పరిరక్షణకై ప్రజల్లో లోతైన అవగాహన కోసం పాటుపడుతుంది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తుంది. చిన్నారి కలశ తన సేవలను దేశ సరిహద్దులు దాటి విస్తరించింది. ఎన్నో దేశాల అవార్డులు, రివార్డులు తనను వరించాయి. అవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ అందించిన గౌరవ డాక్టరేట్ మరో ఎత్తు. సామాజిక సేవా రంగంలో ఆ చిన్నారి చేసిన సేవను గుర్తించి లండన్ పార్లమెంటు భవనంలో.. చిన్నారి కలశ నాయుడు ‘ప్రపంచవ్యాప్తంగా అతిచిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలు’గా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. పలు దేశాలలో చిన్నారి కలశ అందించిన సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ఈ పురస్కారం మరియు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది.  బ్రిటిష్ పార్లమెంట్, గౌరవ పార్లమెంటు సభ్యులు, గ్రేట్ బ్రిటన్ లోని ఇండియన్ హైకమీషనర్ మరియు అనేకమంది ప్రముఖులను ఉద్దేశించి చిన్నారి కలశ రెండు నిమిషాల పాటు అద్భుతంగా ప్రసంగించడం జరిగింది. అంతేకాదు కలశ నాయుడు గురించి లండన్ పార్లమెంట్లో రెండు నిమిషాల నిడివి గలిగిన ఆడియో విజువల్ ప్లే చేయడం జరిగింది. అతి ముఖ్యమైన పార్లమెంటు క్వశ్చన్ అవర్ లో భాగం కావలసి వచ్చినందున గ్రేట్ బ్రిటన్ ప్రధాని శ్రీ రిషి సునక్, ఈ కార్యక్రమంలో భాగం కాలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. అంతేకాక చిన్నారి కలశ నాయుడు కఠోర శ్రమ మరియు నిబద్ధతను గుర్తించి, గౌరవించుకోవడం ఒక సదవకాశం అని, ఇంత చిన్న వయసులో తను అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అని, ఈ పురస్కారం తనకు మేము అందించే గౌరవం, విశ్వ మానవ సేవలో ఈ చిన్నారి అత్యుత్తమ శిఖరాలు అందుకోవాలని ఆశిస్తున్నాను అని అన్నారు. చిన్నారి కలశ నాయుడిని తనతో కలిసి ఒక ప్రత్యేక హై-టీ పంచుకోవలసిందిగా ఆహ్వానం పలుకుతూ, తన అత్యద్భుత సేవలు మరియు ఈ వ్యక్తిగత విజయానికి ప్రతిగా ప్రతిష్టాత్మకమైన లండన్ పార్లమెంట్ సందర్శించవలసిందిగా వ్యక్తిగత ఆహ్వానం అందించడం జరిగింది.
Publish Date: May 1, 2024 5:49PM

ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి.... పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతు తెలిపిన తెలంగాణ మంత్రి 

తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించిన తర్వాత మరో డిమాండ్ బలంగా వినిపిస్తోంది.  అదే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్‌ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు.  మాజీ ప్రదాని పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం రావడంపై సినీ, రాజకీయ సహా అన్ని రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు. తెలుగు జాతి ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తికి కారణమైన పీవీ లాంటి వాళ్లకు నిజంగా దక్కాల్సిన గౌరవంగా అభివర్ణిస్తున్నారు. అదే టైంలో తెలుగు జాతీ ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్‌కి కూడా భారత రత్న ఇచ్చి ఉంటే తెలుగు నేల పులకించిపోయేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.  విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్య మంత్రి సీనియర్ ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాల్సిందే అని తెలంగాణ   మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డి తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రత్న ఇవ్వాలని చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి పొంగులేటి మద్దతు తెలిపారు.  రఘు రాం రెడ్డి, పొంగులేటి   కలిసి కార్డులపై సంతకాలు చేసి..పోస్టు చేశారు. అనంతరం పార్టీ నేతలు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం, కేత్తినేని హరీష్ లతో కలిసి పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ తర్వాత ఎన్టీఆర్ రాజకీయాల్లో అనేక సంస్కరణలు తెచ్చారని అన్నారు.ఆ ఫలితంగానే.. కొత్త వారు రాజకీయాల్లో రాణించగలుగుతున్నారు అని ప్రశంసించారు. ఎమ్మెల్యే, ఎంపీలు,  మంత్రులు గా అనేకమందికి ఎన్టీఆర్ రాజకీయ జీవితం ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, విద్యా, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, సీనియర్ నాయకురాలు మద్దినేని స్వర్ణ కుమారి, నాయకులు ఎండీ.ముస్తఫా, కొప్పుల చంద్రశేఖర్ రావు, బాణోతు ఉత్తేజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Publish Date: May 1, 2024 5:48PM

జగన్ భయపడ్డారు.. అందుకే ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు పడ్డాయ్..

జగన్ హయాంలో  ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు. ఫిట్ మెంట్, డిఏ బకాయిల విషయంలో అడిగినందుకు జగన్ సర్కార్ వారిని నానా ఇబ్బందులూ పెట్టింది. అంతెందుకు ఫిట్ మెంట్ పేరుతో జీతాలు తగ్గించేసి ఉద్యోగ సంఘాల నేతలతో చప్పట్లు కొట్టించుకుంది. ఔను 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ఉద్యోగులు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పీఆర్సీ విషయంలో  చేయగలిగినంత జాప్యం చేసి చివరకు ఇక తప్పదన్నట్లుగా 2022 జనవరిలో వారికి పీఆర్సీ  ఇచ్చింది. ఎక్కడైనా పీఆర్సీ ఇస్తే జీతాలు పెరుగుతాయి. కానీ జగన్ సర్కార్ మాత్రం రివర్స్ లో ఆలోచించింది.  జగన్ సర్కార్  పీఆర్సీ ప్రకటించిన తరువాత ఉద్యోగుల జీతాలు తగ్గాయి. నిజం వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా జరిగింది మాత్రం అదే.  ఉద్యోగులకు అప్పటికే మధ్యంతర భృతి (ఐఆర్) 27 శాతం ఉండగా, జగన్ సర్కార్  ఫిట్‌మెంట్‌ 23 శాతం ఇచ్చింది. దీంతో ఉద్యోగుల వేతనాలు 4 శాతం తగ్గాయి. దాంతో  తగ్గిన ఫిట్‌మెంట్‌ ప్రభావంతో డీఏలు.. హెచ్‌ఆర్‌ఏల్లో కూడా కోత పడింది.  దాంతో అప్పట్లో ఉద్యోగులు తమకు ఇచ్చింది పే రివిజన్ కాదు  పే రివర్స్‌  అని ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చే శారు.  అసలు జగన్ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచీ ఉద్యోగులకు కష్టాలూ వేధింపులు ఆరంభమయ్యాయనే చెప్పాలి. సమయానికి వేతనాలు ఇచ్చింది లేదు. వేతనాల కోసం రోడ్డెక్కితే ఉపాధ్యాయులు, ఉద్యోగులపై జగన్ సర్కార్ కక్ష సాధింపులకు పాల్పడింది. కారాలూ మిరియాలూ నూరింది. వారి పొడే గిట్టదన్నట్లుగా వ్యవహరించింది. రారయతీలు, అలవెన్సుల మాట దేవుడెరుగు అసలు జీతాలకే ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. వేతనాల కోసం నిలదీసినందుకు అసలు వారు పని చేయడం లేదంటూ ప్రచారం చేసింది.  సమయపాలన లేదని నిలదీసింది. ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్ అంది. పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారంటూ ప్రజలలో వారిని పలుచన చేయడానికి ప్రయత్నించింది.  విధులకు పది నిముషాలు ఆలస్యమైనా గైర్హాజరుగా పరిగణించి వేతనాలు కట్ చేస్తామని బెదరించింది. దీంతో జగన్ సర్కార్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు జగన్ పవన్ కట్ చేయడమొక్కటే తమ సమస్యలకు పరిష్కారం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆ విషయం అర్ధమైన తరువాత జగన్ సర్కార్ వారిని ఎన్నికల విధులకు దూరం చేయాలని ఎత్తుగడ వేసింది. వాలంటీర్లతో  పబ్బం గడిపేసుకోవచ్చని భావించింది. అయితే వాలంటీర్లను ఎన్నికల విధులకు ఎన్నికల సంఘం దూరం చేయడంతో ఇప్పుడు మళ్లీ ఉద్యోగులను మంచి చేసుకోవడానికి తహతహలాడుతోంది. అందులో భాగమే జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నడూ లేని విధంగా మే నెల 1వ తేదీనే ఉద్యోగులకు వేతనాలు అందించడం అని పరిశీలకులు అంటున్నారు. అయితే ఉద్యోగుల సహనం పూర్తిగా నశించాక ఇప్పుడు వారిని మంచి చేసుకోవడానికి జగన్ ఏ ప్రయత్నం చేసినా వృధాయే అని పరిశీలకలు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులు  జగన్  సర్కార్ విషయంలో ఒక నిర్ణయం తీసేసుకున్నారనీ ఇప్పుడిక జగన్మాయలో పడే అవకాశమే లేదనీ అంటున్నారు. మొత్తం అనూహ్యంగా 1నే వేతనాలు పడటం ఉద్యోగులనే విస్మయానికి గురి చేసింది. తామంటే జగన్ భయపడ్డాడనడానికి ఇదే నిదర్శనమని వారంటున్నారు. ఈ ఒక్క నెల సమయానికి వేతనాలిచ్చేసినంత మాత్రాన తమ నిర్ణయం మార్చుకునే ప్రశక్తే లేదని తెగేసి చెబుతున్నారు. 
Publish Date: May 1, 2024 5:24PM

ఎన్నికల సంఘమా.. ఇదెక్కడి చోద్యం?

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది. ప్రపంచానికి ఓటు హక్కు విలువను తెలియజెప్పిన మన దేశం ఇప్పుడు ఏదో ఒక ఆశ చూపితే తప్ప ఓటు వేయని ఓటర్లతో నిండిపోయి సర్వనాశనమయ్యే దిశగా వెళ్తోంది. రాజకీయ నాయకులు ఓటర్లకి తాయిలాల ఎరచూపి ఓట్లు వేయించుకోవడంతో ప్రారంభమైన ఈ జాడ్యం, ఇప్పుడు తాయిలాలు ఇస్తే తప్ప ఓటు వేయం అని ఓటర్లు చెప్పే పరిస్థితి వరకు పరిస్థితి దిగజారింది. ఎవరో ఒక రాజకీయ నాయకుడు డబ్బు ఇస్తే, విశ్వాసంతో అతనికే ఓటు వేసే పరిస్థితి నుంచి, అందరి దగ్గర డబ్బు తీసుకుని వేస్తే ఏ ఒక్కరికో.. లేక ఎవరికీ ఓటు వేయకుండా ఊరుకునే పరిస్థితికి ఓటర్లు చేరుకున్నారు. ఓటు వేయడం అనేది హక్కు, బాధ్యత అనే విషయం మరచిపోయి పథకాలు ఇస్తేనే, తాయిలాలు ప్రకటిస్తేనే ఓటు వేస్తామని చెప్పే దౌర్భాగ్య స్థితికి ఎన్నికల వ్యవస్థ చేరుకుంది. ఇప్పుడు చాలామంది ఓటర్లు ఎలా తయారయ్యారంటే, పథకాల ద్వారా డబ్బు ఇవ్వాలి, ఎలక్షన్లు వచ్చినప్పుడు  ఓటు వేయడానికి డబ్బు ఇవ్వాలి. ఇందులో ఓటర్లకు డబ్బు ఎరచూపే రాజకీయ నాయకులది తప్పా.. ఓటుకోసం డబ్బు ఆశించే ఓటర్లది తప్పా అంటే, అది ‘విత్తుముందా.. చెట్టుముందా’ అనే ప్రశ్నకంటే సంక్లిష్టమైన ప్రశ్న అవుతుంది. ఎలక్షన్ల వ్యవస్థలో రాజకీయ నాయకులు, ఓటర్ల మధ్య ఇలాంటి కానుకల బంధం కొనసాగుతూ, ప్రజాస్వామ్య విలువలను ఒకవైపు ప్రశ్నార్థకంలో పడేస్తుంటే, మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా ఓటర్లకు తాయిలాలు ఇచ్చే కార్యక్రమానికి తెరతీసింది. ఓటు వేసేలా ఓటర్లలో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహిస్తే ఓకేగానీ, ఓటు వేయండి, కానుకలు ఇస్తాం అని సాక్షాత్తూ ఎన్నికల కమిషనే అంటూ వుండటం ఘోరం.. దారుణం.. అన్యాయం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లను ఓటు వేసేలా చేయడానికి ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ‘ఓటు వేయండి.. బహుమతులు పొందండి’ అటూ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం ప్రకారం, ఓటు వేసిన ఓటర్లకు లక్కీ డ్రా ద్వారా డైమండ్ రింగ్‌లు గెలుచుకునే సదవకాశాన్ని ఇస్తోంది. ఓటర్లు ఓటు వేసిన తర్వాత పోలింగ్ కేంద్రం బయటకి వచ్చి, తమ చేతికి వున్న ఇంకు గుర్తును చూపించి, లాటరీలో తమ పేరు నమోదు చేసుకోవాలి. ఇలా రెండు గంటలకోసారి లాటరీ తీసి, ఈ రెండు గంటల్లో ఓటు వేసిన వారికి ఒక డైమండ్ రింగ్ ఇస్తారు. భోపాల్ నియోజకవర్గంలో ఈనెల 7వ తేదీన మూడో విడత పోలింగ్ జరగనుంది. రెండు విడతల్లో తక్కువ పోలింగ్ నమోదైన నేపథ్యంలో మూడో విడత పోలింగ్‌ శాతాన్ని పెంచడానికి అక్కడి ఎన్నికల కమిషన్ ఈ డైమండ్ రింగ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన ఎన్నికల కమిషన్‌ని ఏమనాలో అర్థంకావడం లేదని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు.
Publish Date: May 1, 2024 4:59PM

నక్కతోక తొక్కాడు.. లాటరీలో 10 వేల కోట్లు!

అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ చెంగ్ సైఫాన్. లావోస్ దేశానికి చెందిన చెంగ్ సైఫాన్ నలభై ఆరేళ్ళ క్రిందట అమెరికా దేశానికి వలస వెళ్ళాడు. చిన్నా చితకా ఉద్యోగాలేవో చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సైఫాన్‌కి ఎనిమిదేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఆ వ్యాధితో బాధపడుతూనే, చాలీ చాలని సంపాదనతో కీమో థెరఫీ చేయించుకుంటూనే బతుకుమీద ఆశతో ముందుకు వెళ్తున్నాడు చెంగ్ సైఫాన్. జీవితం ఎంత దురదృష్టభరితంగా వున్నప్పటికీ, తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకున్నాడు సైఫాన్. పవర్‌బాల్ లాటరీ అనే ప్రఖ్యాత సంస్థకు చెందిన లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశాడు. ఇటీవల డ్రా నిర్వహించగా, చెంగ్ సైఫాన్ కొన్న మొత్తం ఐదు టిక్కెట్ల నంబర్లు సరిపోలి జాక్‌పాట్ తగిలింది. ఈ లాటరీ ద్వారా చెంగ్‌కి మొత్తం 1.3 బిలియన్ డాలర్లు... అంటే, మన కెరెన్నీలో అక్షరాలా పదివేల కోట్లు. పన్నులలో భాగంగా 422 మిలియన్ డాలర్లను తగ్గించి త్వరలో చెంగ్‌కి మిగతా డబ్బును అందించనున్నారు. ఈ లాటరీ టిక్కెట్లు కొనడానికి తనకు సాయం చేసిన తన భార్య, మిత్రుడితో ఈ డబ్బును పంచుకుంటానని, తనను వేధిస్తున్న క్యాన్సర్‌కి చికిత్స చేయించుకుంటానని చెంగ్ సైఫాన్ చెబుతున్నాడు.
Publish Date: May 1, 2024 4:27PM

గాజు గ్లాస్ సింబల్.. హైకోర్టులో జనసేనకు పాక్షిక ఊరట

ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై బుధవారం (మే1)న  విచారణ జరిగింది. మంగళవారం రోజు ఎన్నికల కమిషన్ హైకోర్టును 24 గంటల సమయం కోరిన సంగతి తెలిసిందే.  జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలోని ఎంపీ స్థానాలలో అలాగే   జనసేన పోటీ చేస్తున్న రెండు లోక్‌సభ పార్లమెంట్ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లోనూ స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని ఎన్నికల కమిషన్ తరఫున లాయర్ కోర్టుకు తెలిపారు. అంటే గాజుగ్లాసు గుర్తు విషయంలో జనసేనకు పాక్షిక ఊరట మాత్రమే కలిగిందని చెప్పుకోవాల్సి ఉంటుంది.  కాగా హైకోర్టు   పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది. ఇంకా అభ్యంతరాలు ఉంటే మరో పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా జనసేనకు సూచించింది.  
Publish Date: May 1, 2024 3:57PM

నిప్పులుగుండం తెలంగాణ... వందేళ్ల రికార్డు బద్దలు

తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదౌతుండటంతో తెలంగాణ నిప్పులగుండంగా మారింది. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు   46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో  సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే  వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు. మరోవైపు  బుధ, గురువారాలలో కూడా ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలోనే 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు జిల్లాలు హైదరాబాద్, మెదక్ లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.  రాష్ట్రం నిప్పుల గుండంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నమోదైన ఉష్ణోగ్రతలు గత వందేళ్ల రికార్డును బద్దలు కొట్టేశాయి. వందేళ్లలో ఎన్నడూ రాస్ట్రంలో ఏప్రిల్ నెలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలకు మించి నమోదు కాలేదు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలోనే ఆ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో ఎండ మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.  అయితే అదే సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు కూడా చెప్పింది. ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితి ఉండదని పేర్కొంది. నిర్దుష్ట సమయానికే నైరుతి రుతుపవనాలు ఉంటాయనీ, ఈ ఏదాడి సగటు కంటే అధిక వర్ష పాతం నమోదౌతుందనీ పేర్కొంది. అంటే జూన్ తొలి వారంలోనే తొలకరి వానలు పడతాయనీ, సమృద్ధిగా వర్షాలు కురుస్తాయనీ పేర్కొంది.  
Publish Date: May 1, 2024 3:29PM

నవ రత్నాలు సరే... నవ సందేహాలు తీర్చు జగనన్నా

వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది. దీంతో  కాంగ్రెస్  అధిష్టాాాానం అదే వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిలను రంగంలో దింపింది.  ఆమె ప్రస్తుతం  ఎపి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి దూసుకెళుతున్నారు. స్వంత అన్నను ఓడించడానికి ఆమె ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. జగన్ అమలు చేసే నవరత్నాల స్కీంకు కౌంటర్గా  నవ సందేహాలతో చెల్లెలు షర్మిల ప్రజల్లో చొచ్చుకెళుతున్నారు.  తన నవ సందేహాలకు సమాధానం చెప్పాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు ఏపీసీసీ చీఫ్ షర్మిల లేఖ రాశారు. సాగుభూమిని ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు ఆపేశారు? ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించడం నిజం కాదా? 28 పథకాలను అర్థాంతరంగా ఎందుకు ఆపేశారు? విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారు? సాగు భూమి ఇచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు?  ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది? ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఎందుకు నిరాకరించారు? స్టడీ సర్కిళ్లకు నిధులు ఇవ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేశారు? డ్రైవర్ ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు? అంటూ తన లేఖలో షర్మిల తొమ్మిది ప్రశ్నలను సంధించారు. ఎన్నికల ప్రచారంలో జగన్ నవరత్నాల గురించి గర్వంగా చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కు షర్మిల నవ సందేహాలను సంధించారు.
Publish Date: May 1, 2024 3:28PM

జీతాలు వేసినా వాతలు తప్పవులే!

మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్‌ల సౌండ్‌తో మార్మోగిపోయాయి. నలుగురైదుగురు ప్రభుత్వోద్యోగులు ఒకేచోట వుంటే అందరి ఫోన్లకూ ఒకేసారి మెసేజ్‌లు వచ్చాయి. ఈ మెసేజ్‌లు ఏమిటా అని చూసిన ఉద్యోగులు ఆశ్చర్యపో్యారు... ఆ మెసేజ్‌ల సారాంశం ఏమిటంటే, వారి నెల జీతం బ్యాంక్‌లో డిపాజిట్ అయింది. దాంతో వాళ్ళందరూ కళ్ళు నులుముకుని, చేతులను గిల్లుకుని ఇది కలయా.. నిజమా వైష్ణవ మాయా అనుకున్నారు.. ఎందుకంటే, గత నాలుగున్నర ఏళ్ళుగా ప్రభుత్వం ఏనాడూ వాళ్ళకి మొదటి తారీఖునే జీతం ఇచ్చిన పాపాన పోలేదు. ఒక్క జీతం విషయంలోనే మాత్రమే కాదు. ఉద్యో్గులకు అందాల్సిన అనేక ప్రయోజనాల విషయంలో కూడా ప్రభుత్వం చాలా అన్యాయంగా వ్యవహరిస్తూ వస్తోంది. ఒకరిద్దరు ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం జగన్ ప్రభుత్వానికి భజన చేస్తున్నారు. దీనికి వెనుక వారి స్వప్రయోజనాలు తప్ప మరేమీ లేవు. అలాంటి వారు మినహా  ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులందరూ జగన్ ప్రభుత్వం మీద ఆగ్రహంగా వున్నారు. ఈసారి ఎన్నికలలో జగన్ ప్రభుత్వాన్ని ఓటుచ్చుకుని కొట్టడానికి సిద్ధంగా వున్నారు. ఇలాంటి సమయంలో వారిని కూల్ చేయడానికి మొదటి తేదీనే జీతాలు పడ్డాయన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఫస్ట్ తేదీనే ప్రభుత్వం జీతాలను పంపడం పట్ల సెటైర్లు వేస్తున్నారు. ఉద్యోగుల వాట్పాప్ గ్రూపుల్లో ఇప్పుడు ఇదొక ఎంటర్‌టైన్‌మెంట్ పాయింట్ అయింది. ఎన్నికల పోలింగ్ దగ్గరకి వచ్చింది కాబట్టి, ఈ నాలుగున్నర ఏళ్ళలో ఫస్టు తారీఖునే జీతాలు వేశారని, జీతాలు వేసినా ఎన్నికలలో జగన్ ప్రభుత్వానికి వాతలు తప్పవని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నారు.
Publish Date: May 1, 2024 3:20PM

షర్మిల ఎంట్రీతో జగన్ ధైర్యం, స్థైర్యం జావగారిపోయాయా?

సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్  నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్  గూటికి చేరి ఆ పార్టీ  రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.  షర్మిల కాంగ్రెస్ లో చేరిక నిస్పందేహంగా జగన్ కు నష్టం చేకూరుస్తుందన్నవిషయంలో వైసీపీ నేతలకూ, శ్రేణులకూ ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గత ఎన్నికలలో అంటే 2019 ఎన్నికలలో  వైసీపీ విజయంలో షర్మిల అఅత్యంత కీలక పాత్ర పోషించారు. అయితే జగన్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పార్టీలో షర్మిలకు కనీస ప్రాధాన్యత ఇవ్వకపోవడమే కాకుండా పొగబెట్టి మరీ పార్టీని వీడే పరిస్థితులను కల్పించిన విషయం తెలిసిందే. దాంతో ఆమె రాష్ట్ర వీడి పొరుగురాష్ట్రంలో సొంత కుంపటి పెట్టుకుని రాజకీయాలు చేశారు. అయితే అక్కడా ఆమెను స్థిమితంగా ఉండనీయకపోవడం, ఆమె పార్టీకి ఎటువంటి సహాయసహకారాలూ అందకుండా అడ్డుకోవడంతో ఇప్పుడు ఆమె జగన్ కు వ్యతిరేకంగా ఏపీలోనే రాజకీయం మొదలు పెట్టారు. వైఎస్ వారసత్వం కోసం అన్నతోనే పోటీ పడుతున్నారు. ఈ పోటీలో ఆమె జగన్ తప్పిదాలను ఎత్తి చూపుతున్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద హత్య విషయంలో షర్మల జగన్ పై సంధిస్తున్న విమర్శనాస్త్రాలు వైసీపీకి సమాధానం చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశాయి. అలాగే ఆమె వైఎస్ వివేకా హత్య కేసులో  తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ8 అవినాష్ రెడ్డికి ప్రత్యర్థిగా కడప లోక్ సభ బరిలో నిలవడంతో ఆ ప్రభావం మొత్తం జిల్లాపై కనిపిస్తోంది. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా  జగన్ కు ఒకింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తేలా చేశాయి. దీంతో జగన్ నైతిక స్థైర్యం దెబ్బతింది. ఆ కారణంగానే ఇంత వరకూ షర్మిలపై విమర్శలకు పార్టీ నేతలు, పార్టీ  సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం చేసి తాను సంయమనం పాటించిన జగన్.. పులివెందులపై షర్మిల ప్రభావం కనిపిస్తుండటంతో స్వయంగా తానే సొంత చెల్లిపై విమర్శలకు దిగారు. ఇది నిస్సందేహంగా ఆయన స్థైర్యం కోల్పోయారనడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చెల్లెలు కట్టుకున్న చీర రంగు  గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయనలో ఫ్రస్ట్రేషన్ ఏ స్టేజికి చేరిందో తెలియజేశాయి. అలాగే కడపలో షర్మిలకు డిపాజిట్ కూడా రాదంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు   చెల్లెలిపై అంత ప్రేమ ఉంటే అవినాష్ ను పోటీ నుంచి తప్పించొచ్చుకదా అంటూ ఆమె ఇచ్చిన రిటార్డ్ వైసీపీ మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. మొత్తం మీద అసలే అంతంత మాత్రంగా ఉన్న వైసీపీ గెలుపు ఆశలను షర్మిల మరింత ఆవిరయ్యేలా చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: May 1, 2024 3:04PM

మాజీ జడ్జి ఇంటిపై వైసీపీ పిశాచ మూకల దాడి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీహార్‌ని మించిన ఆటవిక రాజ్యం నడుస్తోంది. వేధింపులు, దాడులు వైసీపీ నాయకులకు మామూలు విషయంలా మారిపోయాయి. రాజకీయ ప్రత్యర్థులు, సామాన్య ప్రజల విషయంలో మాత్రమే కాదు... మాజీ జడ్జి విషయంలోనూ వైసీపీ పిశాచాలు తమ ఆటవిక ప్రవృత్తినే ప్రదర్శిస్తున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో బి.కొత్తకోటలో రిటైర్డ్ జడ్జ్ రామకృష్ణ ఇంటి మీద వైసీపీ మూకలు మంగళవారం అర్ధరాత్రి దాడిచేశాయి. వేటకొడవళ్ళతో రామకృష్ణ ఇంట్లోకి ప్రవేశించిన ఈ మూకలు విధ్వసాన్ని సృష్టించాయి. కారు, ఫర్నిచర్, కిటికీలు.. ఇలా ఏది కనబడితే దాన్ని ధ్వంసచేసేశారు. గతంలో కూడా వైసీపీ మూకలు రామకృష్ణ ఇంటి మీద దాడి చేశాయి. ఈ విషయమై రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు.
Publish Date: May 1, 2024 1:47PM

వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు 

కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసు కేసు నమోదయింది. ఈ విషయాన్ని స్థానిక ఎస్సై వీరేంద్రబాబు తెలిపారు. ఎస్సై చెప్పిన వివరాల ప్రకారం కొత్తూరులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో... నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై ప్రసన్నకుమార్ రెడ్డి వ్యక్తిగత దూషణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని... ఆయనపై కేసు నమోదు చేయాలని ఎంపీడీవో సాయిలహరి ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.  నువ్వెంతా.. నీ బతుకెంతా.. ఒక్క రోజు ఉంటావో రెండు రోజులు ఉంటావో.. ఎక్కడి నుంచి వచ్చావ్.. ఎవరి ప్రభుత్వం అనుకుంటున్నావ్... ఇవన్నీ ఎవరో సామాన్యులు తిట్టుకునే తిట్లు కావు. కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి బహిరంగ సభలో చేసిన విమర్శలు. తానొక ప్రజాప్రతినిధిననే విషయం మరిచి రెచ్చిపోతున్న వైనం.. ఇది ఏపీలో పెద్ద ఎత్తున విమర్శలకు తావిస్తోంది. వైసీపీ శ్రేణుల్లోనూ ఆయన తీరుపై అసహనం వ్యక్తమవుతోంది. 
Publish Date: May 1, 2024 1:44PM