నిప్పులుగుండం తెలంగాణ... వందేళ్ల రికార్డు బద్దలు

తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదౌతుండటంతో తెలంగాణ నిప్పులగుండంగా మారింది. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు   46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో  సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే  వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.

మరోవైపు  బుధ, గురువారాలలో కూడా ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ క్రమంలోనే 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరో రెండు జిల్లాలు హైదరాబాద్, మెదక్ లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.  రాష్ట్రం నిప్పుల గుండంగా మారింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నమోదైన ఉష్ణోగ్రతలు గత వందేళ్ల రికార్డును బద్దలు కొట్టేశాయి. వందేళ్లలో ఎన్నడూ రాస్ట్రంలో ఏప్రిల్ నెలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలకు మించి నమోదు కాలేదు. కానీ ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలోనే ఆ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మే నెలలో ఎండ మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 

అయితే అదే సమయంలో వాతావరణ శాఖ చల్లటి కబురు కూడా చెప్పింది. ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితి ఉండదని పేర్కొంది. నిర్దుష్ట సమయానికే నైరుతి రుతుపవనాలు ఉంటాయనీ, ఈ ఏదాడి సగటు కంటే అధిక వర్ష పాతం నమోదౌతుందనీ పేర్కొంది. అంటే జూన్ తొలి వారంలోనే తొలకరి వానలు పడతాయనీ, సమృద్ధిగా వర్షాలు కురుస్తాయనీ పేర్కొంది.