Publish Date:May 1, 2019

EDITORIAL SPECIAL
  మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఏపీలో వైసీపీదే అధికారమని అంచనా వేస్తున్నాయి. అయితే టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం.. ఎగ్జిట్ పోల్స్ ని నమ్మొద్దని, నూటికి నూరు శాతం మళ్ళీ టీడీపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రేపు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో చంద్రబాబు తమ పార్టీ నేతలకు, కార్యకర్తలకు గెలుపు మనదేనన్న భరోసా ఇచ్చారట. ప్రతిపక్షాల మైండ్‌గేమ్‌లో పడాల్సిన అవసరం లేదని, వారు చేస్తోన్న హంగామాకు బెదిరిపోవద్దని, గెలుపు మనదేనని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. టీడీపీకి 116 సీట్లు వస్తాయని, దాని కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉందని, రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు టీడీపీ వైపు నిలబడ్డారని అన్నారట. కేంద్రం, ఎన్నికల కమీషన్‌ సహాయంతో వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా తట్టుకుని నిలబడ్డామని, గెలుపు మనదేనని, సంబరాలకు సిద్ధంగా ఉండాలని బాబు చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీకి పట్టున్న రాయలసీమలో కూడా టీడీపీ ఘన విజయం సాధించబోతోందని బాబు ధీమా వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. "గతంలో చిత్తూరులో టీడీపీకి 7 సీట్లు వస్తే.. ఈసారి మరో రెండు సీట్లు పెరుగుతున్నాయి. అదే విధంగా అనంతపురంలో వచ్చిన 12 సీట్లను నిలబెట్టుకుంటున్నామని, కర్నూలులో గతంలో 3 సీట్లు వస్తే.. ఈసారి తొమ్మిది సీట్లు సాధించబోతున్నామని, కడపలో మరో సీటు వస్తుందని.. గతానికంటే పది సీట్లు సీమలో అదనంగా గెలుచుకోబోతున్నాం" అని బాబు అన్నట్లు తెలుస్తోంది. రాయలసీమలోనే ఇలా ఉంటే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉంటుందో చూసుకోవాలని ఆయన పార్టీ నేతలకు, కార్యకర్తలకు చెప్పారట.  ఇక ప్రకాశంలో ఏడు, నెల్లూరులో నాలుగు సీట్లు వస్తున్నాయని అన్నారట. రాజధాని ప్రాంతమైన  గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పదికి తగ్గకుండా వస్తాయని, గోదావరి జిల్లాల్లో కూడా అదే పరిస్థితి ఉందని, ఉత్తరాంధ్రలో మెజార్టీసీట్లు సాధిస్తామని తెలిపారట. మరి బాబుకి తమ గెలుపుపై ఉన్న నమ్మకం నిజమవుతుందో లేదో రేపు తెలుస్తోంది.
  ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడేకొద్దీ ఎన్నికల సంఘం సరికొత్త వివాదాల్లో చిక్కుకుంటోంది. ఈవీఎంల తరలింపు విషయంలో రాజకీయ పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. యూపీ, బీహార్, పంజాబ్, హర్యానాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయి. కౌంటింగ్‌కు రెండు రోజుల ముందు ఈవీఎంలను స్ట్రాంగ్ రూంల వద్దకు తీసుకొచ్చిన వీడియోలు కలకలం సృష్టించాయి. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న ఉత్తర్‌ప్రదేశ్‌ లోని వారణాసిలో ఈవీఎంల తరలింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. చందౌలీ నియోజకవర్గంలో ఆదివారం పోలింగ్ ముగియగా.. సిబ్బంది మంగళవారం ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్‌కు తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్‌ కాంప్లెక్స్‌లోని ఓ గదిలో భద్రపరచడాన్ని సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు మొబైల్ లో చిత్రీకరించారు. పోలింగ్ ముగిసిన రెండ్రోజుల తర్వాత ఈవీఎంలు తీసుకురావడంపై అధికారులను నిలదీశారు. దీనిపై స్పందించిన ఎన్నికల యంత్రాంగం.. వీడియోలో చూపించిన ఈవీఎంలు చందౌలీ నియోజవర్గానికి చెందిన రిజర్వ్‌ యూనిట్లని తెలిపారు. పోలింగ్‌ రోజున తరలించే క్రమంలో ఏర్పడ్డ ఇబ్బందుల కారణంగా వాటిని స్ట్రాంగ్‌ రూంలకు చేర్చడంలో ఆలస్యమైందని వివరించారు. కాగా.. గత డిసెంబరులో ఈసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అన్ని ఈవీఎంలతో పాటే రిజర్వ్‌ యూనిట్లను కూడా తరలించాల్సి ఉంటుంది. అలాగే అవన్నీ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు సాయుధ బలగాల పటిష్ఠ భద్రతలో ఉండాలి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ నియోజవర్గ పరిధిలో ఓ వాహనంలో భారీ ఎత్తున ఈవీఎంలను తరలిస్తున్నారని ఆరోపిస్తూ బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్‌ అన్సారీ స్థానికంగా ఉన్న ఓ స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో జిల్లా రిటర్నింగ్‌ అధికారి అక్కడికి చేరుకొని స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పార్టీలకు చెందిన ప్రతినిధులను కూడా ఉండడానికి అనుమతించడంతో ఆందోళన విరమించారు. బీహార్, హర్యానా, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి ఘటనలే వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఈవీఎంల తరలింపు వార్తలపై స్పందించిన ఎన్నికల సంఘం.. ఆ వార్తలన్నీ కేవలం వదంతులేనని, భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను భద్రపరిచామని తెలిపింది.
  కేంద్రంలో బీజేపీకి గానీ, కాంగ్రెస్ కి గానీ పూర్తీ మెజారిటీ వచ్చే అవకాశం లేదని.. ఈసారి ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం మళ్ళీ కేంద్రంలో ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని అంచనా వేసాయి. ఇక ఏపీలో వైసీపీదే గెలుపని అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తాజాగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుని కలిశారు. అంతేకాదు.. మళ్ళీ మీరే రావాలి, మిమ్మల్ని సీఎంగా మరోసారి చూడాలని తన ఆకాంక్ష అని బాబుతో విష్ణు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ, టీడీపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఓ వైపు చంద్రబాబు బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడానికి తనవంతు ప్రయత్నాలు చేసున్నారు. మరి ఇలాంటి సమయంలో బీజేపీ నేత.. చంద్రబాబుని కలవడం రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని చెప్పినా బీజేపీకి నమ్మకం లేదా? అందుకే మిగతా పార్టీ నేతలను దగ్గరికి తీసుకునే ప్రయత్నంలో భాగంగా.. బీజేపీ పెద్దలు బాబు వద్దకి విష్ణుని రాయబారానికి పంపారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లేక ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నమ్మని విష్ణు.. ఏపీలో టీడీపీనే గెలిచే అవకాశముందని నమ్ముతూ బాబుకి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ విష్ణు.. బాబుని ఏ ఉద్దేశంతో కలిసారో ఆ పై వాడు విష్ణువుకే తెలియాలి.
ALSO ON TELUGUONE N E W S
  'ఓం నమో వేంకటేశాయ' తరవాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మెగాఫోన్ పట్టలేదు. 'బాహుబలి' (చిత్ర సమర్పకుడిగా వ్యవహరించారు) తరవాత ఆయన నిర్మాణంలోనూ సినిమా రాలేదు. కొంత విరామం తరవాత ఆయనో సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ముగ్గురు దర్శకులు, ముగ్గురు కథానాయికలతో ఒక సినిమా చేయబోతున్నానని పుట్టినరోజు (మే 23) సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తారా? లేక నిర్మాతగా మాత్రమే ఉంటారా? అనేది చెప్పలేదు. త్వరలో చెబుతానన్నారు. సినిమా కాకుండా వెబ్ సిరీస్ కోసం మూడు కథలు సిద్ధం చేశానని రాఘవేంద్రరావు తెలిపారు. సో... త్వరలో దర్శకేంద్రుడి నుంచి సినిమా ఆశించవచ్చు.   
ముక్కుసూటిగా వ్యవహరించడం తేజ నైజం. ఎవరేమనుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా బయట పెడతారు. 'సీత' సినిమాపై కొందరు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై సూటిగా స్పందించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా 'సీత'లో కాజల్ పాత్రను తీర్చిదిద్దారని... సినిమాలో కొన్ని డైలాగులు, సన్నివేశాలు హిందూ మతాన్ని, పురాణాల్ని కించపరిచేలా ఉన్నాయని బీజేపీ అనుబంధ సంస్థ యువ మోర్చా మండిపడింది. సినిమాను తమకు చూపించిన తరవాత విడుదల చేయాలనీ, లేనిపక్షంలో సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామని హెచ్చరించింది. ఈ హెచ్చరికలను 'సీత' దర్శకుడు ఖాతరు చేయలేదు. భారతీయ జనతా యువ మోర్చా హెచ్చరికలకు ధీటుగా సమాధానం ఇచ్చారు. "సీత అని కాకుండా సూర్ఫణఖ అని టైటిల్ పెట్టాలా? నేనెందుకు టైటిల్ మార్చాలి? నేను మార్చను. 'సీత' సినిమా ఇలాగే ఉంటుంది. ఇలాగే విడుదల చేస్తా. సినిమా సెన్సార్ అయింది. నేను ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదు. ఎవడొస్తాడో చూసుకుంటా. మే 24న ఉదయం 11 గంటలకు సినిమా విడుదలవుతుంది. ఎవడు ఆపుతాడో చూసుకుంటా" అని తేజ అన్నారు.    
  యంగ్ హీరో  రామ్ కి క‌లిసొచ్చిన ద‌ర్శ‌కుల‌లో కిషోర్ తిరుమ‌ల ఒక‌డు. వీరిద్ద‌రి తొలి క‌ల‌యిక‌లో వ‌చ్చిన `నేను శైల‌జ‌`(2016) బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించింది. అనంత‌రం `ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ` (2017) తోనూ  ఈ కాంబినేష‌న్ అల‌రించింది. ఈ నేప‌థ్యంలో ముచ్చ‌ట‌గా మూడోసారి ఈ ద్వ‌యం జ‌ట్టు క‌ట్ట‌నున్న‌ట్టు టాలీవుడ్ టాక్. ఆ వివ‌రాల్లోకి వెళితే అరుణ్ విజ‌య్ హీరోగా తెర‌కెక్కిన త‌మిళ చిత్రం `త‌డ‌మ్` ను తెలుగులో రీమెక్ చేయనున్న‌ట్టు గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. తాజా స‌మాచారం ప్ర‌కారం రామ్ హీరోగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ రీమేక్ తెర‌కెక్క‌నుంద‌ని తెలుస్తోంది. అంతేకాదు ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స్ర‌వంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంద‌ని స‌మాచారం. రామ్ న‌టిస్తున్న `ఇస్మార్ట్ శంక‌ర్` విడుద‌ల అనంత‌రం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవ‌కాశం ఉంద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు ముచ్చ‌టించుకుంటున్నాయి. త్వ‌ర‌లోనే త‌డ‌మ్ రీమేక్ వెర్షన్ పై క్లారిటీ వ‌స్తుంది.  
రౌడీ గా , కామెడీ విల‌న్ గా , విల‌న్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా విభిన్న పాత్ర‌ల  విల‌క్ష‌ణ న‌టుడు శ్రీ హ‌రి హీరోగా ఎదిగారు. శ్రీ హరి న‌టించిన అనేక చిత్రాలు ఘ‌న‌విజ‌యం సాధించాయి. ఇప్పుడు శ్రీ హ‌రి త‌న‌యుడు మేఘాంశ్ శ్రీ హ‌రి హీరోగా టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. హీరో శ్రీహ‌రి , న‌టి , డాన్సర్ డిస్కో శాంతిని వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. వారికి ఇద్ద‌రు కుమారులు మేఘాంశ్ శ్రీహ‌రి , శ‌శాంక్ శ్రీహ‌రి. సినిమాల‌తో బిజీగా ఉన్న శ్రీహ‌రి మృతి చెంద‌డంతో డిస్కో శాంతి త‌మ కుమారుల‌ను పెంచి పెద్ద చేశారు. కార్తీక్ - అర్జున్ నూత‌న ద‌ర్శ‌కుల ద్వ‌యం ద‌ర్శ‌క‌త్వంలో మేఘాంశ్ శ్రీహ‌రి హీరోగా రాజ్ దూత్ మూవీ రూపొంద‌నుంది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొంద‌నున్న రాజ్ దూత్ మూవీ లో బైక్ కు ప్రాధాన్యం ఉంద‌ని స‌మాచారం.రాజ్ దూత్ మూవీ తో మేఘాంశ్ హీరో గా టాలీవుడ్ లో సెటిల్ అవ్వాల‌ని కోరుకుందాం.
  `ఎంత‌సేపు కోట్లు , స్లో మోష‌న్ లో బిల్డ‌ప్ షాట్సే నీ సినిమాలో ఉంటాయి. నువ్వు ఇంత బాగా యాక్టింగ్ చేయ‌గ‌ల‌వ‌ని అనుకోలేదని` ద‌ర్శ‌కుడు తేజ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ని ఉద్దేశించి అన్నార‌ట‌. తేజ దర్శ‌క‌త్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా `సీత‌` చిత్రంలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఈ నెల 24న విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఈ సంద‌ర్భంగా  హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పై విధంగా స్పందించారు. ఇంకా ఆయ‌న చెబుతూ...షూటింగ్ మొద‌టి రోజు ఫుల్ పేజీ డైలాగ్ పేప‌ర్ చేతిలో పెట్టారు తేజ గారు. అది చూడ‌గానే నా యాక్టింగ్ కు తేజ గారు ప‌రీక్ష పెడుతున్నార‌ని అర్థ‌మైంది. కేర్ వ్యాన్ లోకి వెళ్లి ఆ ఫుల్ పేజీ డైలాగ్ పేప‌ర్ ఫుల్ గా ప్రిపేరయ్యాను. షాట్ రెడీ అన‌గానే సింగిల్ టేక్ లో డైలాగ్స్  చెప్పేసాను. తేజ గారు షాక‌య్యి.. నువ్వు ఇంత బాగా యాక్ట్ చేస్తావ‌నుకోలేదంటూ ఫ‌స్ట్ రోజే బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చారంటూ చెప్పుకొచ్చాడు బెల్లంకొండ శ్రీనివాస్.
  బీజేపీ, కాంగ్రెస్ లు ప్రత్యర్థి పార్టీలు. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఒంటి కాలు మీద లేస్తారు. అయితే ఇదంతా జాతీయ రాజకీయాల్లోనేనట. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ లు శ్రేణులు కలిసి పనిచేసి టీఆర్ఎస్ ను దెబ్బకొట్టాయనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్.. తెలంగాణలో టీఆర్ఎస్ భావించినట్లు 16 సీట్లు గెలిచే అవకాశం లేదని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా రెండు,మూడు సీట్లు వరకు గెలిచే అవకాశముందని అంచనా వేశాయి. అయితే బీజేపీకి రెండు మూడు స్థానాల్లో గెలుపు అవకాశాలు రావడానికి కారణం కాంగ్రెస్ సహకారమే అని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత రెండో దఫా పోటీ చేశారు. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా ధర్మపురి అరవింద్ బరిలోకి దిగారు. అయితే అరవింద్.. గతంలో కాంగ్రెస్ లో బలమైన నేతగా పేరు తెచ్చుకున్న డి. శ్రీనివాస్ తనయుడు కావడంతో.. ఆయన వెంట మెజార్టీ కాంగ్రెస్ పార్టీ నేతలు నిలిచారని ప్రచారం జరుగుతోంది. అదీగాక ఎలాగైనా కవిత గెలుపుకి బ్రేకులు వేయాలని భావించిన మెజారిటీ కాంగ్రెస్ శ్రేణులు.. ఓట్లు చీల్చకూడదని భావించి అరవింద్ కి ఓటేసినట్లు తెలుస్తోంది. కరీంనగర్ స్థానంలో కూడ ఇదే రకమైన పరిస్థితి నెలకొందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన కరీంనగర్ నుండి బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా బి.వినోద్ కుమార్ బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చెందిన కేడర్ ఎక్కువగా బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు ఓటు వేయాలని కోరినట్టుగా టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. లోకల్ లో బండి సంజయ్ కి ఉన్న సొంత ఇమేజ్ కి తోడు, కాంగ్రెస్ కేడర్ కూడా తోడు కావడంతో.. కరీంనగర్ లో బీజేపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజామాబాద్, కరీంనగర్ లలోనే కాదు.. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ స్థానం నుండి బీజేపీ అభ్యర్ధిగా మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీలో చేరిన డీకే అరుణ పోటీ చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ గెలుపుని ఎలాగైనా అడ్డుకోవాలని భావించిన కాంగ్రెస్ నేతలు.. మొన్నటి వరకు తమ పార్టీలో ఉండి వెళ్లిన డీకే అరుణ గెలుపు కోసం కృషి చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణలో టీఆర్ఎస్ జోరుకి అడ్డుకోవడం కోసం.. కాంగ్రెస్ తన ప్రత్యర్థి అయిన బీజేపీ గెలుపుకి కృషి చేసిందని ప్రచారం జరుగుతోంది.
  ఏపీలో మళ్లీ ఎన్నికలు జరుగుతాయనీ, అందుకు టీడీపీ ప్లాన్ కూడా సిద్ధం చేసిందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ మాటలు కూడా ఇందుకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఈ నెల 27 అర్థరాత్రి వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందన్న ఆయన.. తప్పనిసరి అయితే రీపోలింగ్ జరిపిస్తామన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పుల్లో తేడా వచ్చినా, ఈవీఎం డీకోడ్ కాకపోయినా, ఈవీఎంలు మొరాయించినా, పార్టీల మధ్య ఓట్ల తేడా తక్కువగా ఉన్నా రీపోలింగ్‌ జరిపించే అవకాశం ఉందని ద్వివేది స్పష్టం చేశారు. ఈ మాటలను టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా వస్తే సరే. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే మాత్రం ఈవీఎంలు, వీవీప్యాట్లలో తేడా కొట్టిందనీ, అంతా గందరగోళం అయిపోయిందనీ మళ్లీ ఎన్నికలు జరపాల్సిందేనని టీడీపీ పట్టుపట్టే ఛాన్సుందని తెలుస్తోంది. వైసీపీ వైపు నుంచీ చూస్తే... ఆ పార్టీ మళ్లీ ఎన్నికలు అనే ఆలోచనలోనే లేదు. ఎందుకంటే కచ్చితంగా తామే గెలుస్తామని బలంగా నమ్ముతోంది. ఈ నమ్మకమే టీడీపీని మళ్లీ ఎన్నికలవైపు నడిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీ అంత కాన్ఫిడెంట్‌గా ఉందంటే.. ఎన్నికల్లో ఏదో గోల్‌మాల్ జరిగిందనీ, దాన్ని ఎలాగైనా కనిపెట్టి.. మొత్తం ఎన్నికల్ని రద్దు చేసైనా సరే నిజానిజాల్ని బయటకు తేవాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో గందరగోళం జరిగినట్లు టీడీపీ నిరూపిస్తే, వీవీప్యాట్ స్లిప్పుల్లో తేడాలను కనిపెడితే, అప్పుడు ఈసీ కూడా గట్టిగా ప్రశ్నించలేని పరిస్థితి ఉంటుంది. అది రీపోలింగ్‌కి దారితీస్తుంది. మరి రేపటి ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉంటాయో, ఒకవేళ టీడీపీకి ప్రతికూలంగా ఉంటే రీపోలింగ్‌ అంటారేమో చూడాలి.
  ఏపీలో వైసీపీనే అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసాయి. రాజకీయ విశ్లేషకులు కూడా వైసీపీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఫలితాలు రాకముందే వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం మొదలైంది. నిజానికి వైసీపీ శ్రేణులు తమదే అధికారమని మొదటి నుంచి నమ్మకంగా చెబుతున్నాయి. వైఎస్ జగన్ పేరుతో సీఎం నేమ్ ప్లేట్, జగన్ సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం, జగన్ డ్రీం కేబినెట్ లిస్ట్.. ఇలా సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని పరిశీలిస్తే చాలు.. గెలుపుపై వైసీపీ శ్రేణులు ఎంత నమ్మకంగా ఉన్నాయో అర్ధమవుతోంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్న నేపథ్యంలో జగన్ కేబినెట్ లో ఎవరెవరు ఉండబోతున్నారన్న చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా కీలక నేత విజయసాయి రెడ్డిని జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకొని కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించనున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీలో నెంబర్ 2 అంటే విజయసాయి రెడ్డి గుర్తుకొస్తారు. జగన్ కు అత్యంత సన్నిహితుడుగా పేరున్న విజయ సాయి రెడ్డి వైసీపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ కోసం తనవంతుగా కష్టపడుతున్నారు. అందుకే జగన్.. వైసీపీ అధికారంలోకి వస్తే విజయ సాయి రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవాలి అనుకుంటున్నారట. అయితే విజయ సాయిరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా మాత్రమే ఉన్నారు. దీంతో ఆయనను ఎమ్మెల్సీ కోటాలో మంత్రిగా తీసుకోవాలన్న ప్రయత్నాల్లో జగన్ ఉన్నట్లు సమాచారం. ఇక ఎంతో కీలకమైన స్పీకర్ పదవిని దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అప్పగించాలన్న యోచనలో జగన్ ఉన్నారని కూడా చర్చ జరుగుతోంది. స్పీకర్ పదవికి అంబటి రాంబాబు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. వీరితో పాటు మొదట్నుంచి తన వెంటే ఉన్న కొంతమంది నాయకులకు కూడా తన కేబినెట్‌లో జగన్ చేర్చుకోబోతున్నారని తెలుస్తోంది. ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజా, ఆళ్ల రామకృష్ణారెడ్డి, కొడాలి నాని తదితరులకు పదవులు దక్కవచ్చని వైసీపీలో చర్చ జరుగుతోంది.
  సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ నెల 23 న ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటికి వరకు నిన్న సాయంత్రం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ గురించి చర్చలు జరుగుతూ ఉంటాయి. లోక్ సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో టీఆర్ఎస్‌కే మెజారిటీ సీట్లు ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. అయితే టీఆర్ఎస్ చెబుతున్న 16 సీట్లకు రెండు, మూడు సీట్లు తగ్గే అవకాశముందని సర్వేలు అంచనా వేశాయి. అంతేకాదు తెలంగాణలో బీజేపీ బోణి కొట్టనుందని అంచనా వేశాయి. దీంతో బీజేపీ గెలవబోయే సీటు ఏది అయ్యుంటుంది అంటూ విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి. తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశమున్న సీటు అంటే ముందుగా కరీంనగర్ పేరు వినిపిస్తోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ బరిలోకి దిగారు. బండి సంజయ్ ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారన్న పేరుంది. దీంతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలు ఆయన వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా యువత ఆయనకు అండగా నిలబడ్డారు. దీన్నిబట్టి చూస్తుంటే బండి సంజయ్ పుణ్యమా అని తెలంగాణలో బీజేపీ ఖాతాలో ఒక సీటు పడేలా ఉంది. ఇక బీజేపీ మరో రెండు స్థానాల్లో కూడా బలమైన పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అవే సికింద్రాబాద్, నిజామాబాద్ స్థానాలు. ఈ రెండింట్లో ముఖ్యంగా సికింద్రాబాద్ లో బీజేపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నేత కిషన్ రెడ్డి బరిలోకి దిగారు. సికింద్రాబాద్ లో బీజేపీకి పట్టు ఉండటమే కాకుండా కిషన్ రెడ్డికి కూడా వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉండటంతో.. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఇక నిజామాబాద్ లో బీజేపీ గెలుస్తుందని చెప్పలేము కానీ టీఆర్ఎస్ కి గట్టి పోటీ ఇస్తుందనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టు తెలంగాణలో బీజేపీ బోణి కొడుతుందో లేదో ఈ నెల 23 న తేలనుంది.
  విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టాలని ప్రయత్నించి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విఫలమయ్యారు. వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌' సినిమా ఏపీలో తప్ప అన్ని ప్రాంతాల్లో విడుదలైంది. అయితే ఇప్పుడు ఏపీలో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. దీంతో మే 1న సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రెస్ మీట్ పెట్టాలని వర్మ అనుకున్నారు. విజయవాడలో నడిరోడ్డుపై లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ పెడతానంటూ ట్విట్టర్‌లో చెప్పిన వర్మ...అనుకున్న ప్రకారం బయల్దేరారు. దీంతో అక్కడ ఎయిర్ పోర్టుకు చేరుకోగానే వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వర్మ ప్రెస్ మీట్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో వర్మ ఎలాంటి ప్రెస్ మీట్ పెట్టకుండానే వెనుదిరిగారు. ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన వైసీపీ అధినేత జగన్.. వర్మకు అండగా నిలిచారు. ట్విట్టర్ వేదికగా ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. "విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టలేని  పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది.  పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?"  అని జగన్ ట్వీట్ చేశారు. అయితే ఈ ఘటనపై వర్మ మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల అనుమతి తీసుకోకుండా ప్రెస్ మీట్‌ ఎలా పెడతారు? అయినా నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ ఏంటి? ట్రాఫిక్ కి అంతరాయం కలగదా? అలా నడిరోడ్డు మీద మీటింగ్ పెట్టి ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఎవరిదీ బాధ్యత? అంటూ వర్మ తీరుపై పలువురు మండిపడుతున్నారు. పోలీసులు కూడా వర్మ ప్రెస్ మీట్ కి ఎందుకు అనుమతి ఇవ్వలేదో వివరించారు. విజయవాడ నగరపరిధిలో సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌, సెక్షన్‌ 114 సీఆర్‌పీసీ, ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. ఈ సమయంలో ప్రెస్ మీట్ నిర్వహించుకొనేందుకు ముందస్తుగా పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. నిత్యం రద్దీగా ఉండే విజయవాడలోని పైపులరోడ్డు, ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ప్రెస్‌ మీట్‌ నిర్వహిస్తే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగి ప్రజలకు అసౌక్యం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రాంతంలో వర్మ ప్రెస్ మీట్ నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య ఘర్షణలకు దారి తీసే అవకాశం ఉందని భావించామన్నారు. దీంతో ముందస్తుగా రామ్‌గోపాల్ వర్మను అదుపులోకి తీసుకొన్నట్టు  పోలీసులు తెలిపారు. ఎలక్షన్‌ కోడ్‌ అమలు, పోలీసుల అనుమతి.. ఇలాంటివి పట్టించుకోకుండా వైఎస్ జగన్ వర్మకి సపోర్ట్ గా మాట్లాడడంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు చంద్రబాబుని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అని, పవర్ లెస్ సీఎం అని అన్నారు. ఆయనకసలు అధికారులు లేవని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ చెప్పిందే వేదమని డైలాగ్ లు కొట్టారు. తీరా పోలీసులు ఎన్నికల కోడ్ పేరుతో వర్మ ప్రెస్ మీట్ ని అడ్డుకుంటే మాత్రం.. చంద్రబాబు సీఎం అని, టీడీపీ ప్రభుత్వం అని గుర్తుకొచ్చిందా?. అయినా పవర్ లెస్ సీఎం ఓ ప్రెస్ మీట్ ని ఎలా అడ్డుకోగలడు?, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఈసీ, సీఎస్ చెప్పిందే వేదమని మీరే చెప్పారు కదా. మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు నడిరోడ్డుపై ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి వారు అనుమతి ఇస్తారేమో అడగండి అంటూ పలువురు జగన్ ని ప్రశ్నిస్తున్నారు.
  తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ బోర్డు నిర్వాకంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దాదాపు 20 మంది ఇంటర్ విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అయితే ఇంత జరుగుతున్నా దీనిపై సీఎం కేసీఆర్ స్పందించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుకి బాధ్యులైన వారిని శిక్షించి మీకు అండగా ఉంటామని.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు భరోసా ఇవ్వలేదు. కనీసం ఆత్మహత్యల పట్ల విచారం వ్యక్తం చేసి.. మిగతా విద్యార్థుల్లో ధైర్యం నింపే ప్రయత్నం కూడా చేయలేదు. కేసీఆర్ కి ఓ ఐదు నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టడానికో లేక ఒక ట్వీట్ చేయడానికో కూడా టైం లేదా? అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్నింట్లో తోటి తెలుగు రాష్ట్రమైన ఏపీతో పోటీ పడే కేసీఆర్.. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించినా.. తన సొంతం రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు స్పందించారు. 'పరీక్షలో ఫెయిల్ అయ్యామని తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్ధులు ఆత్మహత్య చేసుకున్నట్లు వెలువడుతున్న వార్తలు బాధ కలిగించాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్ధుల మరణం నన్ను కలిచివేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. విద్యార్ధులకు నా విజ్ఞప్తి ఒక్కటే.. కేవలం పరీక్షలు, పాస్ కావడం మాత్రమే జీవితం కాదు. అవి మీ ప్రతిభకు గుర్తింపు మాత్రమే.. కానీ పరీక్షల కంటే మీ జీవితాలు ముఖ్యం. మీ ప్రాణాలు అంతకన్నా అమూల్యమైనవి. పరీక్షల్లో తప్పినంత మాత్రాన మీ జీవితాలను అర్థాంతరంగా ముగించి, మీ కన్నవారు మీపై పెట్టుకున్న ఆశలను కడతేర్చకండి. ఈ వయసులో తల్లిదండ్రులకు కడుపుకోత పెట్టకండి. మీ ముందెంతో సుందరమైన బంగారు భవిష్యత్తు ఉంది. ప్రపంచ చరిత్రలో విజేతలుగా నిలిచిన చాలామంది మొదట పరాజితులే..చదువు అనేది కేవలం విజ్ఞానానికే, అదే జీవితం కాదు. ఓటమి విజయానికి తొలిమెట్టు. మళ్లీ మంచి ఫలితాల కోసం కష్టపడి చదవండి. ఎప్పటికప్పుడు మీ నైపుణ్యాలను పెంచుకోండి. ఎంచుకున్న రంగాలలో ప్రతిభ చూపి రాణించండి. కష్టపడితే విజయం మీదే, బంగారు భవిష్యత్తు మీదే. జీవితంలో మీ ఎదుగుదలే తల్లిదండ్రులకు, దేశానికి  మీరిచ్చే బహుమతి.' అని ట్వీట్ చేశారు. ఈ మాత్రం స్పందన తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి కరువైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
  తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు ఊహించని షాకిచ్చాయి. నిజామాబాద్ నుంచి టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కల్వకుంట్ల కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 68వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సిట్టింగ్ ఎంపీ కవితపై పసుపు రైతులు తీవ్ర అసంతృప్తితో తమ నిరసనను తెలియజేస్తూ నామినేషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. కవితపై ఉన్న ఈ అసంతృప్తి బీజేపీ అభ్యర్థికి కలిసొచ్చిందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కుమార్తె ఓటమికి కారణాలను విశ్లేషించుకునే పనిలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
  విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్ పై కోడికత్తితో దాడిచేసిన నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరయ్యింది. బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానంలో వాదనలు ముగియగా, నిందితుడు శ్రీనివాస్ కు ఎన్ఐఎ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో మరో రెండు రోజుల్లో నిందితుడు శ్రీనివాస్ విడుదలకానున్నాడు. ఇదిలా ఉంటే శ్రీనివాస్ పై ఐపీసీ 307, సివిల్ ఏవియేషన్ చట్టం ప్రకారం అభియోగాలు నమోదు చేసినట్లు ఎన్ఐఏ తన చార్జ్ షీట్ లో తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోడికత్తి దాడి కేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో నిందితుడు శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు కావడం చర్చనీయాంశంగా మారింది.
  ఏపీలో వైసీపీ గెలుపు ఖాయం కావడంతో.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ పెట్టి తన ఆనందాన్ని పంచుకున్నారు. తమని గెలిపించిన ప్రజలకు కృతఙ్ఞతలు చెప్పడంతో పాటు.. ఈ గెలుపుతో తన బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. జగన్ ప్రెస్ మీట్ లో ముఖ్యాంశాలు: అద్భుత విజయం అందించిన ప్రజలకి కృతజ్ఞతలు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇది ఒక నూతన అధ్యాయం. ఈ విజయం దేవుడి దయ, ప్రజల దీవేనలతో సాధ్యమైనది. ఈ విజయం నా బాధ్యతను పెంచుతుంది. ప్రజలు ఓటు వేశారు అంటే విశ్వసనీయతకు ఓటు వేశారు ఈ విజయం తో నా మీద బాధ్యత మరింత పెరిగింది. 5 కోట్ల మందిలో దేవుడు ఒకరికే అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం ఇచ్చినందుకు సుపరిపాలన అంటే ఏంటో చూపిస్తా. ఏడాది లోపే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటా. సుపరిపాలనకు తొలి అడుగు నవరత్నాలు. తొలి సంతకం కాదు, నవరత్నాలు అన్నీ అమలు చేస్తాను. ఈ నెల ౩౦న విజయవాడ లోనే ప్రమాణ స్వీకారం చేస్తాను.
  ఆకుకూరల్లో ఘుమఘుమలాడేది ఏది అంటే వెంటనే వచ్చే సమాదానం పుదీనా. నిజమే కదా ఏ వంటకానికైనా మంచి రుచిని వాసనను తీసుకురావాలంటే ఖచ్చితంగా పుదీనాను వాడాల్సిందే. అందులో ఎండాకాలం ఎండల నుంచి ఉపశమనం కావాలనుకుంటే క్రమం తప్పకుండా పుదీనాను వాడతారు చాలామంది. దీనిని కేవలం వంటకాలకి మాత్రమే దీనిని ఉపయోగిస్తారు అనుకోకండి. వైద్యపరంగా కూడా పుదీనాకి మంచి గుర్తింపే ఉంది. ముఖ్యంగా ప్రాకృతిక వైద్యం, ఆయుర్వేదం మొదలైనవాటిలో దీనిని బాగా ఉపయోగిస్తారు. ఈ పుదీనా రక్తప్రసరణని క్రమబద్దీకరించటమే కాకుండా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. గొంతు నొప్పికి, కడుపులో మంటకి ఇదొక మంచి మందు. పుదీనాతో ఎన్ని ఉపయోగాలున్నాయో చూద్దామా.     జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పుదీనాను క్రమం తప్పకుండా వాడితే మంచిదని వెైద్యులు చెబుతున్నారు. పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకు లు, దాల్చిన చెక్క కలిపి నూరి ప్రతి రోజూ  2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. జీర్ణకోశ వ్యాధులకి, కడుపు నొప్పికి, పుదీనా గింజలు కొన్ని నమిలిన  తరువాత ఒక గ్లాసుడు వేడినీళ్ళు తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది.     పుదీనా కషాయం ఎలాంటి జ్వరాన్నైనా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ కషాయం వల్ల కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.   పుదీనా, మిరియాలు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు కలిపి మొత్తం నూరుకుని లేహ్యంలా సేవిస్తే ఉదరసంబందిత వ్యాధులు నివారణ అవుతాయి. ఆకలి ఎక్కువగా లేని వారు, పుల్లత్రేనుపులతో బాధపడేవారు, కడుపులో గ్యాస్ పేరుకుపోయి ఇబ్బంది పడేవారు కూడా ఈ లేహ్యాన్ని తినవచ్చు. ఫలితాన్ని మీరే స్వయంగా చూడచ్చు.   ప్రెగ్నెన్సీ మొదటి రోజుల్లో కొంతమంది వాంతులతో బాధపడుతూ ఉంటారు అలాంటివారు చెంచాడు పుదీనా రసంలో అదే కొలతలో నిమ్మరసం, తేనే కలుపుకుని ఆరారా తాగుతూ ఉంటే వాంతులు తగ్గుతాయి. వికారం కూడా రాకుండా ఉంటుంది.    నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి ముందు ఈ ఆకుల్ని ఒక గ్లాసుడు నీళ్ళల్లో వేసి మూతపెట్టి అరగంట తర్వాత తాగితే మంచి నిద్ర పడుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.   అరికాళ్ల మంటలకు పుదీనా ఆకులను మొత్తగా రుబ్బి పేస్టులా చేసుకుని ఫ్రిజ్‌లో కాసేపు ఉంచిన తరువాత బయటకు తీసి చల్లగా ఉన్నప్పుడు అరికాళ్లకు రాస్తూ ఉంటే మంటలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.   పుదీనా ఆకుల్ని ఎండబెట్టి దానిని టీ పొడిలో కలిపి టీ చేసుకుని తాగితే గొంతునొప్పి తాగటమే కాకుండా గొంతులో మాధుర్యం కూడా పెరుగుతుంది.   చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని చేతితో రసంలా తీసి ఆ రసంలో దూదిని  ముంచి ఆ డ్రాప్స్ చెవిలో, ముక్కులో ఆరారా  వేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గిపోతుంది.   నోటి దుర్వాసనకి కూడా ఇది మంచి మందు. నోరు వాసన వచ్చేవారు పుదీనా ఆకుల్ని ఎండబెట్టి పొడిచేసి అందులో కాస్త ఉప్పు వేసుకుని ఆ పొడితో రోజూ పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన మాయం అవ్వటమే కాదు చిగుళ్ళు కూడా గట్టిపడతాయి.   ఎండాకాలంలో మజ్జిగలో పుదీనా ఆకులు వేసుకుని తాగితే చాలా చలవ చేస్తుంది. నిమ్మరసంలో పుదీనా కలుపుకుని తాగితే దాహం కూడా తీరుతుంది. వేసవికాలానికి పుదీనా ఒక మంచి నేస్తంలాంటిది.   ఈ రోజుల్లో ప్రతి వస్తువులోనూ పుదీనాని కలుపుతున్నారు. సబ్బులలో, పేస్టులలో, పేస్ క్రీమ్స్ లో, ఆఖరికి ఈ మధ్య సిగరెట్ తయారీలో కూడా పుదీనాని వాడుతున్నారు. ఈ పుదీనా సిగరెట్ వల్ల గొంతు నొప్పులు అలాగే గొంతు కాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా మటుకు తగ్గుతాయట. ఇన్ని ఉపయోగాలున్న పుదీనా ని మనం నిర్లక్షం చెయ్యకుండా క్రమం తప్పకుండా వాడదామా. ...కళ్యాణి
  A research says that excess or continuous usage of cell phone can increase the risks of Brain Tumor. Though the exact number cannot be revealed, Dr. Ranganatham too warns the people who use cell phones excessively. To know in detail watch the video. https://www.youtube.com/watch?v=U5Du_HOHgl0  
  తలనొప్పి రాని మనిషెవరుంటారు! ఒకప్పుడైతే ఓ గంటా రెండు గంటలకు మించి తలనొప్పి బాధిస్తే, ఏదో ఒక చిట్కా వైద్యం చేసి దాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించేవారు. మరీ తగ్గకపోతే, తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ మోతాదులో మందులను వేసుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఇలా తలనొప్పి మొదలైందో లేదో అలా ఓ భారీ మందుబిళ్లను చప్పరించేస్తున్నాము. దానివల్ల మన శరీరం నిదానంగా నొప్పి మాత్రలకు అలవాటుపడిపోతోందనీ, రాన్రానూ మోతాదుని పెంచితేనే కానీ ఆ మందులు పనిచేయవనీ నిపుణులు చేస్తున్న హెచ్చరికలను ఎవరూ పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు. తలనొప్పిలో 200కి పైగా రకాలు ఉన్నాయని చెబుతున్నారు వైద్యులు. వీటిలో చాలావరకు ఆకలికో, ఒత్తిడి కారణంగానో, నిద్రలేమితోనో వచ్చే నొప్పులే! ఇక ‘తిక్క తిక్క’ సినిమాలు చూసిన తరువాత వచ్చే నొప్పులూ లేకపోలేదు. ఇలాంటి తాత్కాలిక తలనొప్పులకి మందుబిళ్లల జోలికి పోకుండా కొన్ని చిట్కాలను ప్రయత్నించి చూస్తే సరి.   నిదానించండి!: చాలావరకూ తలనొప్పులు మన రోజువారీ ఉన్న ఉరుకులు పరుగుల కారణంగానే ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి తలలో సన్నటి నొప్పి మొదలవగానే, కాస్త నిదానించేందుకు ప్రయత్నించండి. మీ ఉద్వేగాలను తగ్గించుకోండి. ఓ పది నిమిషాల పాటు మీ శ్వాసను గమనిస్తూ, వీలైనంత నిదానంగా శ్వాసను పీల్చుకునేందుకు ప్రయత్నించండి. వీలైతే కాసేపు ద్యానంలో మునిగిపోండి. లేదా ఏదన్నా మంచి సంగీతంలో లీనమయ్యేందుకు ప్రయత్నించండి.   నీళ్లు: రోజువారీ హడావుడిలో మునిగిపోయి చాలామంది తగినంత నీరు తీసుకోవడమే మర్చిపోతూ ఉంటారు. నిజానికి శరీరానికి తగినంత నీరు అందకపోయినా కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి ఎంత పనిలో ఉన్నా, అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు నీరు తీసుకోవడం మర్చిపోవద్దు. ఒకోసారి మరీ చల్లటి నీరు తాగడం కూడా కొందరిలో తలనొప్పికి దారితీస్తుంది. పైగా చల్లటి నీటితో దాహం తీరేది కూడా తక్కువే!   వేణ్నీళ్లు- చన్నీళ్లు: మెడ దగ్గర కండరాలు బిగుసుకుపోయినట్లుండే తలనొప్పికి, మెడ వెనుక భాగంలో వేడి నీటి కాపడం పెట్టడం చాలా ఉపశమనంగా ఉంటుంది. అలా కాకుండా కణతల వద్ద మాత్రమే నొప్పి ఉంటే, కొన్ని మంచు ముక్కలను గుడ్డలో చుట్టి పెడితే తలనొప్పి నిదానిస్తుంది. మంచు ముక్కల వల్ల అక్కడి రక్తనాళాల వాపు తగ్గి రక్తప్రసారం తిరిగి యథాస్థితికి వస్తాయి. దీంతో తలనొప్పి కూడా ఉపశమించే అవకాశం ఏర్పడుతుంది.   చిన్నపాటి కదలికలు: మాడు మీద, కణతుల వద్దా మర్దనా చేస్తే తలనొప్పి నుంచి కాస్తైనా ఉపశమనం లభించడాన్ని గమనించవచ్చు. తలని రెండు భుజాల వైపుగా కదల్చడం, భుజాలను కూడా కిందకీ మీదకీ ఆడించడం వల్ల ఒత్తిడిలో ఉన్న కండరాలకి కాస్త విశ్రాంతిని ఇచ్చినట్లవుతుంది. ఓ నాలుగడులు అలా నడుచుకుంటూ వెళ్లినా ఉపయోగమే!   వంటింటి చిట్కాలు: తలనొప్పిని తరిమికొట్టే ఆయుధాలు మన వంటింట్లో చాలానే కనిపిస్తాయి. అల్లం లేదా పుదీనా ఆకులతో చేసిన తేనీరు పుచ్చుకున్నా, దాల్చిన చెక్కని పొడిచేసి కణతులకు పట్టించినా, లవంగ నూనెని వాసన చూసినా, నిమ్మరసం కలిపిన నీటిని తాగినా... తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. మరో వైపు కాఫీ, మద్యం, చాక్లెట్‌ వంటి పదార్థాలు తలనొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.   - నిర్జర.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.