మామిడిపండ్లను తినేముందు నీటిలో కొద్దిసేపు ఉంచి తినాలి ఎందుకో తెలుసా?
posted on Apr 24, 2024 9:30AM
వేసవికాలం కోసం చాలామంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు. ఆ ఎదురు చూపులు అన్నీ మామిడికాయల కోసమే. పండ్లలో రారాజు అని చెప్పుకునే మామిడికి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. సమ్మర్ లో మామిడి పండ్లు మార్కెట్లోకి వచ్చాయంటే చాలు.. ఎంత ధర అయినా కొనేసి వాటి రుచిని ఆస్వాదించేవారు ఉన్నారు. అయితే ఒకప్పుడు ఇంట్లో మామిడి కాయలు ఉంటే అమ్మలో, అమ్మమ్మలో ముందే వాటిని నీళ్లున్న టబ్ లో వేసి ఓ గంటాగిన తరువాత తినడానికి ఇచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ సీన్ మారింది. మామిడి పండ్లను ఎంచక్కా ఫ్రిజ్ లో పెట్టి చల్లగా అయ్యాక మండుతున్న ఎండల్లో హాయిగా చల్లగా తింటూ ఉంటారు. అయితే ఇది తప్పని ఒకప్పుడు మన పెద్దలు చెప్పిన మార్గమే మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు మామిడిపండ్లను నీటిలో ఎందుకు ఉంచాలి? దీనివెనుక గల ఆరోగ్య రహస్యం ఏంటి? తెలుసుకుంటే...
నీళ్లలో కొద్దిసేపు ఉంచిన మామిడిపండు తింటే శరీరంలో వేడి తగ్గుతుంది. నిజానికి మామిడిపండు తినడం వల్ల శరీరంలో వేడి ఉత్పత్తి అవుతుంది. ఇది జీర్ణక్రియ, చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కానీ ఈ సమస్యను నీటిలో కాసేపు ఉంచడం ద్వారా తగ్గించుకోవచ్చు.
మామిడిలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ న్యూట్రియంట్. ఇది శరీరంలోకి ప్రవేశించినప్పుడు పోషకాలను గ్రహించడంలో ఆటంకం కలిగిస్తుంది. దాని అధిక పరిమాణం కారణంగా శరీరంలో పోషకాల లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది . అయితే మామిడిని కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టడం ద్వారా ఫైటిక్ యాసిడ్ స్థాయిని తగ్గించవచ్చు.
ఈ రోజుల్లో ప్రతి పంటకు హానికరమైన పురుగుమందులు, ఎరువులు అధిక పరిమాణంలో ఉపయోగిస్తారు. మామిడి సాగులో కూడా ఇవి తప్పనిసరి. ఇవి మామిడి తొక్కపై ఉంటాయి. ఇవి తినేటప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే మామిడిని కనీసం అరగంట నుండి గంట సేపైనా నీటిలో ఉంచడం అవసరం. తద్వారా వాటిపై ఉన్న పురుగుమందులు తొలగిపోతాయి.
మామిడిలో కొంత మొత్తంలో తెల్లని స్రావం ఉంటుంది. ఇది మొటిమలు, దద్దుర్లు, అలెర్జీ వంటి చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. మామిడికాయను నీళ్లలో కాసేపు నానబెట్టడం వల్ల స్రావం తగ్గుతుంది. తద్వారా చర్మ సమస్యలు ఏవీ ఇబ్బంది పెట్టవు.
మామిడికాయను నీళ్లలో ఉంచకుండా తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ఇది జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. అందువల్ల కొంత సమయం పాటు నానబెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మామిడిని నీటిలో ఉంచి తింటే అందులో హైడ్రేటింగ్ లక్షణాలు పెరుగుతాయి.
*రూపశ్రీ.