తెరాసకు మద్దతు ఇస్తే తప్పేమిటి? జగన్
posted on Jul 3, 2015 10:22AM
ధవళేశ్వరం వద్ద ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పరిహారం నాలుగు రోజుల్లో చెల్లించకపోతే విశాఖ కలెక్టరేట్ ని ముట్టడిస్తామని ప్రభుత్వానికి గడువు విధించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి వారిని పరామర్శిస్తే ఎవరూ కాదనరు. వారికి పరిహారం చెల్లించమని ప్రభుత్వాన్ని కోరినా కూడా ఎవరూ తప్పు పట్టరు. కానీ ఆ పనిని ప్రభుత్వం ఎన్ని రోజులలో పూర్తిచేయాలో గడువు పెట్టడం లేకుంటే కలెక్టరేట్ ని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని బెదిరించడం ఎవరూ హర్షించరు.
ఇక బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వచ్చి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించడం చూస్తుంటే అసలు అందుకే ఆయన ఈ పరామర్శ యాత్రల కార్యక్రమం పెట్టుకొన్నట్లు అనిపిస్తోంది. ఆయన ఉదేశ్యాలు ఎవయినప్పటికీ ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు ఆయన చాలా ఆసక్తికరమయిన విషయం ఒకటి బయటపెట్టారు. “రెండు రాష్ట్రాలలో తమ పార్టీ కొనసాగుతున్నప్పుడు తాము ఎవరికి మద్దతు ఇచ్చుకొంటే వారికెందుకు?” అని ప్రశ్నించారు.
నిజమే! తెరాసకు వైకాపా మద్దతు ఇచ్చినా, ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొన్నా ఎవరూ అభ్యంతరం చెప్పడానికి లేదు. అది ఆ పార్టీల రాజకీయ హక్కు కూడా. కానీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నామని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న తెరాసతో ఎందుకు చేతులు కలుపుతున్నారు? తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలని తెరాసలోకి ఆకర్షించినా ప్రశ్నించకుండా మౌనం వహించడమే కాక మళ్ళీ ఆ పార్టీకే తిరిగి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? ప్రజలెన్నుకొన్న తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఆ పార్టీ నేతలతో ఎందుకు చేతులు కలిపారని తెదేపా నేతలు ప్రశ్నిస్తున్నారు. కనుక ఆయన తమ పార్టీ తెరాసకు మద్దతు ఇవ్వడం గురించి మాట్లాడే బదులు వారి ప్రశ్నలకు సమాధానం చెపితే బాగుండేది.
వారి వాదోపవాదాలు, వాటి వెనుక ఉద్దేశ్యాలు, వ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న ఆంధ్రా వ్యతిరేక, తెరాస అనుకూల వైఖరి వలన వైకాపా పట్ల రాష్ట్ర ప్రజలలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకొంటున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాలకు బీజం వేసిన విశాఖనగరంలో నిలబడి రాష్ట్ర విభజనకు కారణమయిన తెరాసకు మద్దతు ఇస్తే ఏమిటి తప్పు? అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం చూసి రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం చెందుతున్నారు.