కేసీఆర్, హరీష్, కేటీఆర్ ల అరెస్టుకు ముహూర్తం ఫిక్సయ్యిందా?

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి ఆరోపణలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్  ఈ నెలాఖరులో  మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను విచారించనున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఈ నెల 21 న మరోసారి హైదరాబాద్ రానుంది. వచ్చే నెల అంటే డిసెంబర్  5 వరకు ఇక్కడే ఉండి పలువురిని విచారించనుంది. అన్నిటికీ మించి ఇప్పటి వరకూ అధికారుల విచారణకే పరిమితమైన కమిషన్ ఇక ముందు రాజకీయ నేతల నిర్వాకం పై దృష్టి సారించి వారినీ విచారణకు పిలిచే అవకాశం ఉందని విశ్వసనీయంగా తెలిసింది.

ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మాజీ మంత్రి హరీష్ రావును కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచీ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన అవకతవకలపై గురిపెట్టింది. అందులో భాగంగానే అధికారంలో ఉండగా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును టార్గెట్ చేసింది. 

కాళేశ్వరం విషయంలో జరిగిన అవకతవకలకు కేసీఆర్, హరీష్ రావులను, ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అక్రమాలకు కేటీఆర్ ను బాధ్యులుగా చట్టం ముందుక నిలబెట్టే లక్ష్యంతో రేవంత్ సర్కార్ ముందుకు సాగుతోంది.  కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసి ఘోష్ కమీషన్‌ ఈ నెలాఖరులోగా లేదా డిసెంబర్‌ మొదటి వారంలో మాజీ నీటిపారుదల, ఆర్ధిక శాఖల మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఆ తరువాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వంతు అని తెలుస్తోంది.  అంతే కాకుండా యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌ఘడ్‌ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్‌ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కమిషన్ గతంలోనే  మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

అయితే అప్పట్లో మదన్ బి లోకూర్ కమిషన్ కు విచారణ అర్హతే లేదంటూ కేసీఆర్ లేఖ రాశారు. ఆ కమిషన్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టుకు  కూడా వెళ్లారు. అయితే సుప్రీం కోర్టు కేసీఆర్ పిటిషన్ ను కొట్టేసింది. ఇప్పుడు ఇక కాళేశ్వరం అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసి ఘోష్ కమిషన్ నోటీసులకు కేసీఆర్ స్పందించి విచారణకు హాజరౌతారా అన్నది తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇక   ఫార్ములా1 రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్‌ని అరెస్ట్ చేయడం ఖాయమని ముఖ్యమంత్రి, మంత్రులు బాహాటంగానే చెబుతున్నారు. మొత్తం మీద బీఆర్ఎస్ అగ్రనేతలు ముగ్గురికీ ఏక కాలంలోనే చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.