గ్రహస్థితి బాగోలేకనే వైకాపాలోకి వెళ్లారుట!
posted on Jul 4, 2015 8:35AM
.jpg)
పార్టీలు మారడానికి ముహూర్తాలు పెట్టుకొన్న రాజకీయ నాయకులని చూసాము కానీ గ్రహస్థితి బాగాలేక పొరపాటున పార్టీ మారామని చెప్పిన వారిని ఎన్నడూ చూసి ఉండము. మాజీ తెదేపా వ్యవస్థాపక సభ్యుడు దాడి వీరభద్ర రావు మాత్రం గ్రహాలు ప్రతికూలంగా ఉన్నందునే తప్పుడు నిర్ణయం తీసుకొని వైకాపాలోకి వెళ్లానని చెప్పడం విశేషం. గ్రహాలూ అనుకూలించకపోతే ఎంతవారయినా తప్పులు చేయడం అందుకు ఫలితం అనుభవించడం సహజమేనని తనేమి అందుకు అతీతుడని కాదని చెప్పుకొచ్చారు. తెదేపా ఆవిర్భావం నుండి సుమారు మూడు దశాబ్దాల పాటు పార్టీకి సేవ చేసానని, మళ్ళీ తనను పార్టీలో చేర్చుకొనేందుకు అంగీకరిస్తే జీవితాంతం పార్టీకి సేవ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తన అనుచరులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన రాజకీయ స్నేహితులు అందరూ కూడా మళ్ళీ తెదేపాలో చేరమని ఒత్తిడి చేస్తున్నారని కనుక తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనను మళ్ళీ పార్టీలో చేర్చుకొనేందుకు అంగీకరిస్తే తను కూడా అందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు.
తెదేపాతో తనకు మూడు దశాబ్దాల అనుబందం ఉందని ఇప్పుడు గుర్తు చేసుకొంటున్న ఆయన తనకు రెండవసారి ఎమ్మెల్సీ పదవి ఈయలేదనే కుంటి సాకుతో పార్టీని వీడి ఎన్నికల ముందు వైకాపాలో చేరారు. కానీ అసలు కారణం ఏమిటంటే వైకాపా ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశముందని ఆయన అంచనా వేసి ఆ పార్టీలోకి దూకేశారు. కానీ ఆయన అంచనాలు తారుమారయ్యాయి. ఎన్నికలలో వైకాపా ఓడిపోయింది, ఆయన విడిచిపెట్టేసిన తెదేపా అధికారంలోకి వచ్చింది. దానితో కంగుతిన్న ఆయన తక్షణమే వైకాపాని వదిలిపెట్టి తెదేపాలోకి తిరిగి వచ్చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ తెదేపా ఆయనని తిరిగి పార్టీలో చేర్చుకొనేందుకు ఇష్టపడటం లేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
అధికార దాహంతో పార్టీలు మారిన ఆయన ఆ తప్పును గ్రహాల మీదకు తోసేయడం ఒక వింతయితే, అసలు తెదేపా ఆయనను చేర్చుకోనేందుకే సిద్దపడనప్పుడు ఆయన తన అనుచరులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన స్నేహితులు అందరూ మళ్ళీ తనను తెదేపాలో చేరమని ఒత్తిడి చేస్తున్నారని చెప్పుకోవడం మరీ వింతగా ఉంది.