సమయాన్ని ఇచ్చిపుచ్చుకోవాలి

 

శ్రీవారు మాట వినడం లేదన్నా, అత్తగారు చిరుకోపంతో చూస్తున్నా, పిల్లలు అల్లరి చేస్తున్నా... వీటన్నిటికీ ఒకటే పరిష్కారం... ‘కలసి గడపటమే’. అదేంటీ... ఇప్పుడు మేం కలసి గడపటం లేదా అని మీకు అనిపిస్తోంది కదూ...  అసలు విషయం ఏంటంటే, కుటుంబ సభ్యుల మధ్య పెరిగిపోతున్న దూరమే ఎన్నో మానసిక, శారీరక అనారోగ్యాలకి కారణం అంటున్నారు పరిశోధకులు. టీనేజ్ పిల్లల కోపతాపాలు, వారి నడవడిక, ప్రవర్తన ఇవన్నీ కూడా కుటుంబ సభ్యుల మధ్య వుండే అనుబంధంపై ఆధారపడి వుంటాయని కూడా చెబుతున్నారు వీరు. అంతేకాదు, భార్యాభర్తలు నువ్వు, నేను ఒకటి అంటూ మొదలుపెట్టిన ప్రయాణం కాస్తా తల్లిదండ్రులు అయ్యేసరికి నువ్వెంత అంటే నువ్వెంత అనేలా మారిపోవడానికి ముఖ్య కారణం ‘దూరమే’ అంటున్నారు పరిశోధకులు.


కమ్యూనికేషన్ గ్యాప్ తొలగించండి:-

భార్యాభర్తల మధ్య కావలసినంత సమయం ఉన్నప్పుడు ఆ బంధం చక్కగా సాగిపోతుంది. ఎప్పుడైతే పిల్లలు, బాధ్యతలు అంటూ మొదలవుతాయో ఇద్దరికి మధ్య కలసి గడిపే సమయం తగ్గిపోతుంది. దాంతో చిన్న చిన్న అపార్థాల నుంచి పెద్దపెద్ద గొడవలదాకా వచ్చే అవకాశం వుంది. అయితే అందరి విషయంలో ఇలా జరగదు. సమస్యకు మూలం ‘కమ్యూనికేషన్ గ్యాప్’ అన్న విషయం తెలుసుకున్న భార్యాభర్తలు రోజువారీ ఒత్తిడి పనుల మధ్య కూడా ఒకరికోసం ఒకరు కొంత సమయాన్ని కేటాయిస్తారు. కొన్ని జంటలపై జరిపిన అధ్యయనంలో పై విషయాలన్నీ చాలావరకు అందరు భార్యాభర్తల మధ్య జరిగే సహజ పరిణామాలని తేలింది. అయితే కొంతమంది మాత్రం వారి కోసం అంటూ కొన్ని కలసి గడిపే సమయాలని నిర్ణయించుకుని, ఆ ప్రకారం నడచుకోవడం గమనించారు పరిశోధకులు. వారిమధ్య  అనుబంధం ఎన్ని ఏళ్ళు గడచినా, ఎంత పని ఒత్తిళ్ళలో వున్నా చక్కగా, చిక్కగా వుందని కూడా గుర్తించారు.


ఇదిగో అసలు సీక్రెట్:-

భార్యాభర్తల బంధం తాజాగా వుండటానికి సీక్రెట్ ఏంటో తెలుసా? ‘ఇద్దరూ కలసి గడిపే సమయం’.  రోజూ తప్పకుండా  ఇద్దరూ కొంత సమయాన్ని గడపటం. అంటే ఉదాహరణకి భార్యాభర్తలు ఇద్దరూ ఉదయం, రాత్రి వాకింగ్‌కి వెళ్ళడం, ఆదివారాలలో బయట భోజనం చేయడం, ఇలా ఏదో ఒకటి అలవాటుగా మార్చుకున్న జంటల మధ్య అపోహలు తక్కువగా వున్నట్టు గమనించారు ఆ అధ్యయనంలో. అలాగే వీరిద్దరికే సొంతమైన నిక్‌నేమ్స్ వంటివి కూడా ఇద్దరినీ దగ్గర చేస్తాయిట. ఇక్కడ పరిశోధకులు ఒక రహస్యాన్ని కూడా బయటపెట్టారండోయ్. శ్రీవారు తనని ఓ ప్రత్యేకమైన పేరుతో పిలిస్తే, శ్రీమతులు తక్కువ అలుగుతారట. ఈ సీక్రెట్ మీ శ్రీవారికి చెప్పకండి. అలిగే ఛాన్స్ మిస్సయిపోతారు మీరు.


అత్తాకోడళ్ళూ ఇది వినండి...

సరే, భార్యాభర్తల తర్వాత అంత సంక్లిష్టమైన అత్తాకోడళ్ళ బంధానికీ ఆ అధ్యయనంలో దారి చూపించారు ఆ అధ్యయనంలో. అత్తాకోడళ్ళు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వుంటే ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందే తప్ప తగ్గదు అని  చెబుతున్నారు అధ్యయనకర్తలు. శ్రీవారిని, పిల్లల్ని ఆనందపరచడానికి, చిన్నచిన్న బహుమతులు ఇచ్చినట్టే అప్పుడప్పుడు అత్తగారికి కూడా బహుమతులు ఇస్తుండాలిట. అలాగే అత్తగారి తరఫు వారితో, అంటే ఆమె పుట్టింటి వారితో మంచి సంబంధాలు కలిగి వుండాలిట. అన్నిటికంటే ముఖ్యంగా ఎంత బిజీగా వున్నా, అలసిపోయినా సరే అత్తగారితో ఆరోజు జరిగిన ముఖ్యమైన సంఘటనల గురించి చెబుతూ కాసేపు కబుర్లు చెప్పాలిట. ఆమె చెప్పే విషయాలని ఓపిగ్గా వినాలిట. ఇలా చేస్తే అత్తాకోడళ్ళ మధ్య మంచి బంధం వుంటుందని అంటున్నారు. అదేంటి... అత్తగారి వైపు నుంచి చేయాల్సినవి ఏం లేవా అంటే... వున్నాయి... అవి కోడలిని ఏ విషయంపైనా ప్రశ్నించకుండా వుండటం. ఆమె పుట్టింటి వారితో మంచి అనుబంధాన్ని ఏర్పచుకోవటం, మధ్యమధ్యలో ఫోన్ చేసి పలకరించడం వంటి చిన్న చిన్న విషయాలు వారి మధ్య బంధాన్ని చక్కగా వుంచుతాయట.


బంధమేదైనా ఒకటే సూత్రం:-

ఇక పిల్లలు, స్నేహితులు, బంధువులు ఇలా బంధం ఏదైనా కానివ్వండి సూత్రం ఒక్కటే అంటున్నారు అధ్యయనకర్తలు. ఒకరికి ఒకరు సమయం ఇచ్చుకోవడం, తరచూ కలుసుకోవడం, మాట్లాడుకోవటం, కొంచెం సున్నితంగా వుండటం ఇవి ఏ బంధాన్ని అయినా తాజాగా వుంచుతాయిట. ముఖ్యంగా కలిసి గడిపే సమయాన్ని అలవాటుగా మార్చుకుంటే చాలుట. మరి ఆలోచిస్తారు కదూ.

-రమ