టాలీవుడ్ ‘మేముసైతం’ ఎవరికోసం?

 

విశాఖని అల్లకల్లోలం చేసిన హుద్ హుద్ తుఫాను బాధితులను ఆదుకోవడానికి తెలుగు సినిమా పరిశ్రమ ‘మేముసైతం’ పేరుతో నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. గత నెల రోజులుగా ఈ అంశం మీద టాలీవుడ్‌లో హడావిడి జరుగుతోంది. ఈనెల 30న సినిమా ప్రముఖుల క్రికెట్ మ్యాచ్‌లు, ఇతర ఆటలు, పాటలు, రకరకాల వినోద కార్యక్రమాలు, స్టార్స్‌తో కలసి భోజనాలు... ఇలా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ నిర్వహించడం ద్వారా సేకరించిన మొత్తాన్ని హుద్ హుద్ తుఫాను బాధితుల సహాయార్థం వినియోగిస్తారు. ఈ ‘మేముసైతం’ కార్యక్రమం కోసం టాలీవుడ్ పడుతున్న శ్రమ చూస్తుంటే సినిమా రంగంలోని వారు సమాజం పట్ల ఎంతో బాధ్యతతో వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ఇంత మంచివాళ్ళయిన సినిమా వాళ్ళు మనకి ఉన్నందుకు ఆనందంతో హృదయం ఉప్పొంగిపోతోంది. అయితే ‘మేముసైతం’ పేరుతో టాలీవుడ్ చేస్తోన్న ఈ హడావిడి అంతా జనం కోసం కాదని.. తమ స్వలాభం కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హుద్ హుద్ బాధితుల సంగతి అలా వుంచితే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కాకాపట్టడానికే టాలీవుడ్ ప్రముఖులు ‘మేముసైతం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘మేముసైతం’ వెనుక వున్న అసలు గుట్టుని విమర్శకులు ఇలా వివరిస్తున్నారు.

 

ఎన్నికల ముందు సినిమా పరిశ్రమ చంద్రబాబు నాయుడికి ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో సినిమా పరిశ్రమ కోసం ఎంతో చేశారు. అయితే ఆయన అధికారం కోల్పోయిన తర్వాత సినిమా పరిశ్రమ ఆయన్ని లైట్‌గా తీసుకుంది. ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేసే విషయంలో కూడా గతంలో చంద్రబాబు నుంచి అనేక ఉపకారాలు పొందినవాళ్ళు కూడా ముందుకు రాలేదు. ఎన్నికల సమయంలో సినిమావాళ్ళు చంద్రబాబుకి మద్దతుగా నిలిస్తే రేపు జగన్ అధికారంలోకి వస్తే ఇబ్బంది అవుతుందని ఎందరూ చంద్రబాబు ఛాయలకు కూడా పోలేదు. ఎన్నికల ఫలితాలు రాకముందే కొంతమంది సినీ ప్రముఖులు కేసీఆర్ని మర్యాదపూర్వకంగా కలిశారు తప్ప చంద్రబాబుని కలసి నైతిక మద్దతు ఇవ్వాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు. చంద్రబాబు మనసులో ఆ బాధ వుంది. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. దాంతో నాలుకలు కరుచుకున్న టాలీవుడ్ ప్రముఖులు మళ్ళీ చంద్రబాబుకి దగ్గరయ్యే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా హుద్ హుద్ తుఫాను విధ్వంసం వారికి మంచి అవకాశంలా కనిపించింది. దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసమే ఈ ‘మేముసైతం’ కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శకులు అంటున్నారు.

 

ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ప్రగతి పథంలో దూసుకుపోతోంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా రంగంలో అద్భుతంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. దీనికితోడు ప్రఖ్యాత ఎరోస్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ నిర్మాణానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాలకు సంబంధించి తెలుగు సినిమా రంగంలో ప్రముఖులెవర్నీ సంప్రదించకుండా, సలహాలు కూడా అడక్కుండా చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళారు. ఈ చర్య టాలీవుడ్ ప్రముఖులు ఒక్కసారిగా గతుక్కుమనేట్టు చేసింది. తమను చంద్రబాబు ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని అర్థమైంది. సినిమా పరిశ్రమకు తెలంగాణ రాష్ట్రం ఎంత ముఖ్యమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అంతే ముఖ్యం. సినిమా ప్రముఖులు నిర్వహిస్తున్న సినిమా వ్యాపారాలు ఆంధ్రప్రదేశ్‌లో కూడా లాభాలు పొందాలంటే అక్కడి ముఖ్యమంత్రి సహకారం కూడా చాలా అవసరం. ఇప్పుడు ఎరోస్ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్న చంద్రబాబు ముందు ముందు థియేటర్లు, ఇతర అంశాలకు సంబంధించి కూడా టాలీవుడ్ ప్రముఖులను పక్కన పెట్టేస్తే, టాలీవుడ్‌లో వున్న మోనోపాలీకి గండి కొట్టేస్తే వాళ్ళ వ్యాపారాలు నేలమట్టమయ్యే ప్రమాదం వుంది. దీన్ని ఊహించే టాలీవుడ్ వ్యాపార రంగంలో పెద్దలుగా వున్న కొందరు ముందుండి ‘మేముసైతం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, బోలెడంత నిధులను సీఎం సహాయ నిధికి ఇవ్వడం ద్వారా చంద్రబాబుకు చేరువ అవ్వచ్చన్నది వారి ఆలోచనగా చెబుతున్నారు. అమ్మ టాలీవుడ్డూ...