బతికున్నోళ్ళకి విగ్రహం పెడితే ఖేల్ ఖతమే?

 

తూర్పు గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని పెట్టాలని కొంతమంది అభిమానులు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. వీళ్ళు పెట్టబోయే విగ్రహం కూడా రెడీ అయిపోయింది. అయితే ఈ చర్యను చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బతికి వున్న వాళ్ళ విగ్రహం పెడితే, ఎవరి విగ్రహం అయితే పెట్టారో ఆ ప్రముఖుల ప్రభ తగ్గిపోయి, వాళ్ళ ఖేల్ ఖతమ్ అయిపోయే ప్రమాదం వుందని అంటున్నారు. దీనికి సంబంధించిన కొన్ని చారిత్రక ఆధారాలను కూడా చూపిస్తున్నారు.

 

తమిళ రాజకీయ ప్రముఖుడు కామరాజ్ నాడార్ హవా ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో ఆయన అభిమానులకు కామరాజ్ బతికి వుండగానే ఆయన విగ్రహాలను పెట్టేస్తే ఓ పనైపోతుందని ముచ్చటపడ్డారు. కామరాజ్ నాడార్ కూడా దానికి సంతోషంగా అంగీకరించారు. తన మొదటి విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూని కామరాజ్ నాడార్ ఆహ్వానించారు. అయితే నెహ్రూ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. ‘‘బతికి వున్న వాళ్ళకి విగ్రహాలు పెట్టడమేంటి.. దానికి నన్ను పిలవటమేంటి.. నేను రాను’’ అని స్పష్టంగా చెప్పేశారు. అయితే నెహ్రూ రాకపోతే ఏంటంట అనుకుని కామరాజ్ అభిమానులు తమిళనాడులో విగ్రహాలు ఏర్పాటు చేశారు. విగ్రహాలు ఏర్పాటు చేసిన కొన్నాళ్ళకే కామరాజ్ నాడార్ చనిపోయాడు. అప్పుడు ఆయనకు నిజంగా విగ్రహాలు పెట్టే అర్హత లభించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్‌కి కూడా బతికుండగానే గుడికట్టి విగ్రహం పెట్టారు. అంతే ఆ తర్వాత కొన్నాళ్ళకే ఆయన కూడా దేవుళ్ళలో కలసిపోయారు.

 

ఈ తమిళనాడు వాళ్ళే హీరోయిన్ల మీద ప్రేమతో ఖుష్బూ, రోజా, రంభ లాంటి హీరోయిన్లకు గుడులు కట్టి, ఆ గుళ్ళలో వాళ్ళ విగ్రహాలు పెట్టారు. అప్పటి వరకూ తారాపథంలో దూసుకుపోయిన ఈ హీరోయిన్లు గుళ్ళు కట్టి విగ్రహాలు పెట్టిన తర్వాత తారాపథం నుంచి ఢామ్మని కిందపడిపోయారు. ఆ తర్వాత మళ్ళీ నిలదొక్కుకోలేదు.

 

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిణి మాయావతి మేడమ్‌కి కూడా తాను బతికి వుండగానే ఉత్తరప్రదేశ్ అంతటా తన విగ్రహాలు పెట్టించుకోవాలన్న కోరిక పుట్టింది. ఆ విషయాన్ని అసెంబ్లీలో బిల్లుగా తీసుకొచ్చింది. బిల్లు పాసైపోయింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రమంతటా మాయావతి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు కూడా విడుదలయ్యాయి. కొన్నిచోట్ల ఆమె విగ్రహాలను ఆమే ఆవిష్కరించేసుకున్నారు. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడంతో విగ్రహాల కథ ముగిసింది. అయితే బతికుండగా విగ్రహాలు పెట్టించుకున్న దోషం మాత్రం మాయవతిని వదల్లేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో ఎదురులేదని అనుకున్న మాయావతి ఘోరంగా ఓడిపోయారు.

 

ఇక ఈ మధ్యకాలంలో తెలంగాణలో సోనియాగాంధీకి గుడి కట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతగా మాజీ మంత్రి శంకర్రావు సోనియాగాంధీకి గుడి కట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహానికి పూజలు చేశారు. తర్వాత జరిగిన ఎన్నికలలో సోనియాగాంధీ పార్టీ అటు కేంద్రంలో, ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఓడిపోయింది. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా అధికారాన్ని కోల్పోయింది. ఇంకా చరిత్రని తవ్వే ఓపిక లేదు.. లేకపోతే బతికుండగానే విగ్రహాలు పెట్టించుకుని మటాషైపోయిన ఎంతమంది ప్రముఖుల చరిత్ర బయటపడుతుందో.....

 

చరిత్ర ఇలా వుంటే, వర్తమానంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు వచ్చింది. పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయడానికి ఆయన అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ అత్యుత్సాహాన్ని మరికొంతమంది అభిమానులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిక్షేపంగా బతికి వున్న పవన్ కళ్యాణ్ విగ్రహాన్ని పెట్టి ఆయన ప్రభ తగ్గిపోయేలా చేయడం న్యాయం కాదని అంటున్నారు. నిజమైన అభిమానులైతే ఇలా విగ్రహాలు పెట్టించడం లాంటి పిచ్చిపనులకు పూనుకోరని చెబుతున్నారు. సదరు అభిమానులు తక్షణం విగ్రహ ప్రతిష్ట పనులను మానుకోవాలని సూచిస్తున్నారు.